పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ విడుదల | Telangana SSC Exam Fee Schedule-2027 | Sakshi
Sakshi News home page

పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ విడుదల

Nov 17 2026 5:57 AM | Updated on Nov 17 2026 5:58 AM

Telangana SSC Exam Fee Schedule-2027

ఆలస్య రుసుము లేకుండా నవంబర్‌ 26 వరకు చెల్లించే అవకాశం

ఆలస్య రుసుముతో జనవరి 4 వరకు

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మినహాయింపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదో తరగతి (ఎస్సెస్సీ), ఓఎస్సెస్సీ, వొకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం విడుదల చేసింది. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైన (ౖnఛ్ఛి ఊ్చజీ ్ఛఛీ) అభ్యర్థులు నిర్ణీత గడువులోపు పరీక్ష ఫీజులు చెల్లించాలని సూచించింది.

ఆలస్య రుసుము లేకుండా నవంబర్‌ 26 వరకు విద్యార్థులు తమ పాఠశాలలో పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్‌ ట్రెజరీ ఆన్‌లైన్‌ ఇంటిగ్రేషన్‌ ద్వారా నవంబర్‌ 27 నుంచి నవంబర్‌ 30 వరకు ఫీజులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. ఫీజులు చెల్లించిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులకు నవంబర్‌ 30లోగా సమర్పించాలి.

ఆలస్య రుసుముతో..
నిర్ణీత గడువులోపు పరీక్ష ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 8 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఈ మొత్తాన్ని పాఠశాలలు డిసెంబర్‌ 9 లోగా ఖజానాకు జమ చేయాలి. విద్యార్థుల వివరాలను డిసెంబర్‌ 11లోగా డీఈవోలకు సమర్పించాలి. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చు.

ఈ ఫీజులను డిసెంబర్‌ 22లోగా ఖజానాకు జమ చేయాలి. విద్యార్థుల వివరాలను డిసెంబర్‌ 28లోగా డీఈవోలకు పంపాలి. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 23 నుంచి 2027 జనవరి 4 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఈ మొత్తాన్ని జనవరి 5లోగా ఖజానాకు జమ చేయాలి. విద్యార్థుల వివరాలను జనవరి 6లోగా డీఈవోలకు సమర్పించాలి.

పరీక్ష ఫీజుల వివరాలు
అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసే విద్యార్థులు రూ.110 చెల్లించాలి. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నవారు రూ.125 చెల్లించాలి. ఒకేషనల్‌ విద్యార్థులు సాధారణ ఎస్సెస్సీ పరీక్ష ఫీజు రూ.125తోపాటు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 2027కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు
పరీక్ష ఫీజులను అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in లో పాఠశాల లాగిన్‌ ద్వారా మాత్రమే చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. సైబర్‌ ట్రెజరీతో అనుసంధానించిన ఆన్‌లైన్‌ విధానంలోనే చెల్లింపులు చేయాలి. ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ చలానాలు, మాన్యువల్‌ బ్యాంకు చలానాలను అనుమతించబోమని పేర్కొంది. ప్రధానోపాధ్యాయులు తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. పరీక్ష ఫీజుల చెల్లింపునకు ప్రకటించిన గడువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని పరీక్షల విభాగం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: గోదావరి జలాల పూర్తి వినియోగమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement