‘ప్రైవేటు బైక్‌ ట్యాక్సీకి అనుమతులివ్వండి’ | Private Bike Taxis Get Centre Big Push Nitin Gadkari Urges States to Allow | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు బైక్‌ ట్యాక్సీకి అనుమతులివ్వండి’

Nov 19 2026 8:57 AM | Updated on Nov 19 2026 8:57 AM

Private Bike Taxis Get Centre Big Push Nitin Gadkari Urges States to Allow

ప్రైవేటు (నాన్-ట్రాన్స్‌పోర్ట్) మోటార్‌సైకిళ్లను బైక్‌ ట్యాక్సీలుగా వినియోగించుకునేందుకు అనుమతించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. కేంద్రం రూపొందించిన మోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌–2025ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల నిర్వహించిన ‘రైడ్‌: ఎ షోకేస్‌ ఆఫ్‌ అగ్రిగేటర్‌ అండ్‌ డెలివరీ సర్వీసెస్‌’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు ద్విచక్ర వాహనాలను అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రయాణికుల రవాణాకు అనుమతిస్తే సుమారు 15 నుంచి 20 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రాల నిర్ణయమే కీలకం

  • కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసినంత మాత్రాన దేశవ్యాప్తంగా ప్రైవేటు బైక్‌ ట్యాక్సీలకు ఆటోమేటిక్‌గా అనుమతి లభించినట్లు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2025 జులై 1న కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లోని క్లాజ్‌ 23 ప్రకారం, తుది నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది.

  • మోటార్‌ వెహికల్స్‌ యాక్ట్‌–1988లోని సెక్షన్‌ 67(3) కింద నాన్‌-ట్రాన్స్‌పోర్ట్‌ మోటార్‌సైకిళ్లను అగ్రిగేటర్‌ సంస్థలతో అనుసంధానించి ప్రయాణికులను చేరవేసేందుకు రాష్ట్రాలు అనుమతించవచ్చు.

  • ఇందుకోసం అగ్రిగేటర్‌ సంస్థల నుంచి రోజువారీ, వారం లేదా పక్షంవారీ ప్రాతిపదికన రుసుములు వసూలు చేసే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది.

  • ఇప్పటికే రాష్ట్రాల రవాణా కమిషనర్లతో ఈ అంశంపై చర్చించామని, ప్రైవేటు బైక్‌ల వినియోగానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు గడ్కరీ వెల్లడించారు.

గిగ్‌ వర్కర్లు, డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట

  • కొత్త మార్గదర్శకాలు కేవలం వాహనాల అనుమతులకే పరిమితం కాకుండా అగ్రిగేటర్‌ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లు, గిగ్‌ వర్కర్ల ఆర్థిక, సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి.

  • సొంత వాహనం కలిగిన డ్రైవర్‌కు ప్రయాణ ఛార్జీలో కనీసం 80 శాతం వాటా దక్కాలి.

  • ప్రతి డ్రైవర్‌కు కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి.

  • ఒకే సంస్థకు పరిమితం కాకుండా పలు అగ్రిగేటర్‌ ప్లాట్‌ఫామ్‌లలో పనిచేసే వెసులుబాటు.

  • డ్రైవర్లకు 40 గంటల ఇండక్షన్‌ శిక్షణ; ఫిర్యాదుల పరిష్కారానికి 24 గంటల గ్రీవెన్స్‌ అధికారి ఏర్పాటు.

  • దీనికితోడు వాహనాలకు చెల్లుబాటయ్యే రిజిస్ట్రేషన్‌, థర్డ్‌ పార్టీ బీమా, పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.

పట్టణ ట్రాఫిక్‌కు చెక్‌

మహానగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, పార్కింగ్‌ కొరత, అధిక ప్రయాణ వ్యయాలకు బైక్‌ ట్యాక్సీలు సమర్థవంతమైన పరిష్కారమని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా బస్సులు, ఆటోలు సరిగా అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఉపయోగపడుతుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి, విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవడానికి డిజిటల్‌ ఆధారిత రవాణా వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని అధికారిక ప్రకటనలో గడ్కరీ పేర్కొన్నారు. మహిళా లబ్ధిదారులు, గిగ్‌ వర్కర్ల అనుభవాలను ప్రస్తావిస్తూ.. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం సమాంతరంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: పసిడి ధర నేలచూపు.. వెండికీ తప్పని పతనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement