గడ్కరీ చెప్పిన కొత్త కారు.. నవంబర్ 26న లాంచ్ ఫిక్స్! | Nitin Gadkari Announces New Toyota Innova Flex Fuel Launch On Nov 26 | Sakshi
Sakshi News home page

గడ్కరీ చెప్పిన కొత్త కారు.. నవంబర్ 26న లాంచ్ ఫిక్స్!

Nov 5 2026 12:03 PM | Updated on Nov 5 2026 12:07 PM

Nitin Gadkari Announces New Toyota Innova Flex Fuel Launch On Nov 26

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా.. ఇన్నోవా కారును సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిని నవంబర్ 26న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

టయోటా లాంచ్ చేయనున్న ఈ కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇన్నోవా.. సాధారణ పెట్రోల్‌తో పాటు 100 శాతం ఇథనాల్ (E100)తో కూడా నడుస్తుంది. అంటే ఇకపై కేవలం పెట్రోల్‌పైనే ఆధారపడాల్సిన అవసరం లేదన్నమాట. ఈ విషయాన్ని ఢిల్లీలో జరిగిన ENRich 2026 సదస్సులో గడ్కరీ ప్రకటించారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ
సాధారణంగా ఇప్పుడు రోడ్డుపై కనిపించే కార్లు పెట్రోల్ లేదా డీజిల్ ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న కార్లలో పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ ఇథనాల్‌ను ప్రధానంగా చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారు చేస్తారు. టయోటా కొత్త ఇన్నోవాలో E100 ఇంధనాన్ని కూడా ఉపయోగించుకునే సదుపాయం ఉండనుంది. దీనివల్ల పెట్రోల్ వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇంధన దిగుమతుల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడటం కూడా కొంత తగ్గవచ్చు. తాను కూడా టయోటా అందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇన్నోవాను ఉపయోగిస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.

హైబ్రిడ్ టెక్నాలజీ
రాబోయే కొత్త ఇన్నోవాలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో పాటు.. టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉంది. అంటే.. ఇందులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. తక్కువ వేగంతో వెళ్లేటప్పుడు కేవలం ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇథనాల్‌కు అనుగుణంగా మార్పులు చేసి అందించవచ్చని తెలుస్తోంది. టయోటా ఇప్పటికే 2023లో ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ కారును ప్రదర్శించింది. ఇప్పుడు దానిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇన్నోవా హైక్రాస్‌ కొత్త లుక్
ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో పాటు, ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ కూడా నవంబర్ 26న విడుదల కానుంది. ఇందులో ముందు భాగంలో కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్, మారిన బంపర్లు, కొత్త టెయిల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లోనూ కొన్ని మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ స్థానంలో.. 12.3 అంగుళాల స్క్రీన్, అలాగే 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఫీచర్లపై టయోటా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయా?
భారతదేశంలో ఇథనాల్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం మారుతి వ్యాగన్‌ఆర్ E100 ఇంధనానికి అనుకూలంగా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగంలోనూ కొన్ని మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టయోటా ఇన్నోవా కూడా ఈ జాబితాలో చేరనుంది. ఇథనాల్ వినియోగం పెరిగితే పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే.. వాహనం నిర్వహణ ఖర్చులు, ఇంధనం లభ్యత, మైలేజీ వంటి అంశాల గురించి తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement