కర్ణాటకలో ఇటీవల పాల ధరల పెంపు నిర్ణయం వెలువడిన కొంత సమయానికే రవాణా రంగంపై మరో భారం పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి ఈ కొత్త ఛార్జీలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని రోడ్డు రవాణా సంస్థల పరిధిలో ప్రయాణ రుసుములు 35 శాతం వరకు పెరగడం ప్రయాణికులను నిరాశకు గురిచేస్తోంది. కాగా, ఇటీవల సాధారణ టోన్డ్ పాలు ధర ఇదివరకు లీటరుకు రూ.46 ఉండగా రూ.54కి పెంచారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్ల కాలంలో బస్సు ఛార్జీలు పెరగడం ఇది రెండోసారి. ప్రస్తుత సవరణ ప్రకారం.. కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్‌టీసీ) బస్సుల్లో సగటున 23 శాతం వరకు ఛార్జీలు పెరగగా, బెంగళూరు నగర రవాణా సంస్థ (బీఎంటీసీ) సిటీ బస్సుల్లో ఈ పెరుగుదల ఏకంగా 33 నుంచి 35 శాతం వరకు ఉంది.
డీజిల్ ధరలే కారణం
ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ రవాణా శాఖ వర్గాలు మాత్రం సంస్థల మనుగడ కోసం ఈ నిర్ణయం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో ఆర్టీసీ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని అధికారులు వెల్లడించారు. ‘ఆర్టీసీ సంస్థలను లాభాల ఆర్జన కోసం కాకుండా వాటిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ఛార్జీల పెంపు చేపట్టాం’ అని ప్రభుత్వ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.
ప్రయాణికులపై భారం ఇలా..
బీఎంటీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి మెజెస్టిక్ నుంచి శివాజీనగర్ వెళ్లేందుకు గతంలో రూ.12 ఉండగా, అది ఇప్పుడు రూ.18కి చేరింది. అలాగే మెజెస్టిక్ - యశ్వంత్‌పూర్ రూట్ ఛార్జీ రూ.18 నుంచి రూ.25కి పెరిగింది. వజ్ర ఏసీ బస్సుల గరిష్ట ఛార్జీని రూ.75 నుంచి రూ.90కి, ఎయిర్‌పోర్ట్ ‘వాయు వజ్ర’ సర్వీసుల గరిష్ట ఛార్జీని రూ.405 నుంచి రూ.425కి సవరించారు. కేఎస్‌ఆర్టీసీ సర్వీసుల్లో దూర ప్రాంతాలకు వెళ్లే సాధారణ, రాజహంస బస్సుల ఛార్జీలు కూడా దూరానికి అనుగుణంగా పెరిగాయి. బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారం తప్పడం లేదు.
మహిళలకు యథావిధిగానే..
అయితే, మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే ‘శక్తి’ పథకం కింద నాన్-లగ్జరీ బస్సుల్లో కొనసాగుతున్న ఉచిత సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉచిత ప్రయాణ పథకం వల్ల రవాణా సంస్థలపై పడుతున్న ఆర్థిక భారాన్ని పూడ్చుకునేందుకే మిగతా ప్రయాణికులపై ఛార్జీల భారం మోపుతున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిత్యావసరాలు, పాలు, రవాణా ఛార్జీలు అన్నీ ఒకేసారి పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు బడ్జెట్ ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను నడిపించే ప్రభుత్వాలు ప్రయాణికులపై ఈ స్థాయిలో భారం మోపడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: డబ్బును దాచుకుంటే దరిద్రం!?


