ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశమైంది. బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పడిపోతున్నాయని చాలామంది ఆందోళన చెందుతున్న వేళ.. తాను మాత్రం మరిన్ని కొనుగోలు చేశానని చెబుతున్నారు.
అసలు సమస్య ఏమిటంటే?
మార్కెట్ పడిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, తాను నమ్మిన పెట్టుబడులను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశంగా చూస్తానని అభిప్రాయపడ్డారు. అయితే.. కియోసాకి దృష్టిలో అసలు సమస్య బంగారం, వెండి లేదా బిట్‌కాయిన్ ధరలు తగ్గడం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ అప్పులు పెరుగుతుండటమే అసలు ఆందోళనకరమైన విషయమని చెబుతున్నారు.
ముఖ్యంగా.. అమెరికా అప్పులు పెరుగుతుండటంపై కియోసాకి ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పాలకులు అవసరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని, విద్యావ్యవస్థలో కూడా డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కల్పించడం లేదని విమర్శించారు.
ఫియట్ కరెన్సీ
మరో ముఖ్యమైన అంశం ఫియట్ కరెన్సీ (Fiat Money). అంటే.. భారత రూపాయి, అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ అధికారంతో చెలామణిలో ఉండే కరెన్సీ. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు డబ్బు సరఫరాను పెంచినప్పుడు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది.
ఉదాహరణకు, గతంలో రూ.100తో కొనుగోలు చేసిన వస్తువులు ఇప్పుడు అదే ధరకు దొరకకపోవచ్చు. అందుకే కష్టపడి సంపాదించిన డబ్బును కేవలం నగదు రూపంలో దాచుకోవడం కంటే బంగారం, వెండి వంటి ఆస్తుల గురించి కూడా ఆలోచించాలని కియోసాకి అభిప్రాయపడుతున్నారు.
WHY WORRY? People paniced when gold, silver, Bitcoin crash. I bought more. Why? Because the real problem is the growing size of global debt, especially the USA, the incompetence of our leaders to do what really needs to be done, an education that teaches nothing, zero, nada about money, and the initial purpose of any fiat money (Fake money) which is to steal the wealth of the people who work for money, and save fake money. Can”t wait for the next crash of gold, silver, Bitcoin. Take care
— Robert Kiyosaki (@theRealKiyosaki) November 4, 2026


