వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సంచలన నివేదిక
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారైన భారతదేశంలో పసిడి దిగుమతి సుంకాలను పెంచడం ప్రతికూల పరిణామాలకు దారితీస్తోంది. పన్ను భారాన్ని తప్పించుకోవడానికి అక్రమ మార్గాలు చూసుకుంటున్న కొందరు వ్యాపారుల కారణంగా దేశంలోకి అక్రమ/అనధికారిక బంగారం ప్రవాహం రికార్డు స్థాయిలో పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, మూడో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) దేశంలోకి అనధికారిక మార్గాల్లో వచ్చిన బంగారం ఏకంగా 1500 శాతానికి పైగా పెరిగినట్లు స్పష్టమైంది.
1500 శాతం పెరుగుదల
‘మెటల్స్ ఫోకస్’ గణాంకాలను ఉటంకిస్తూ డబ్ల్యూజీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది మూడో త్రైమాసికంలో కేవలం మూడు మెట్రిక్ టన్నులుగా ఉన్న అనధికారిక పసిడి దిగుమతులు ఈ త్రైమాసికంలో ఏకంగా 50 మెట్రిక్ టన్నులకు చేరాయి. దిగుమతి సుంకం పెరిగినప్పుడల్లా పన్నులు ఎగవేసేందుకు స్మగ్లింగ్, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అనధికారికంగా తెప్పించే విధానాలు తీవ్రమవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు, విదేశీ మారక ద్రవ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం బంగారం, వెండిపై పన్నును 15 శాతానికి పైగా పెంచిన సంగతి తెలిసిందే.
బిల్లులు లేని నగదు లావాదేవీలు
దిగుమతి పన్నుల భారం పెరగడంతో రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లలో బిల్లులు లేకుండా జరిగే నగదు లావాదేవీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వినియోగదారులు కూడా పన్ను మినహాయింపు కోసం రసీదులు లేకుండా బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుండటంతో బులియన్ మార్కెట్ కదలికలను ప్రభుత్వ అధికారులు నిఘా పెట్టడం కష్టతరంగా మారుతోంది.
పండుగల వేళ బలహీనంగా డిమాండ్
సాధారణంగా దసరా, దీపావళి, వివాహాల సీజన్ ఉండే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పసిడి కొనుగోళ్లు పుంజుకుంటాయి. కానీ ఈసారి అధిక ధరలు, సుంకాల ప్రభావంతో మొత్తం బంగారం డిమాండ్ మందగించే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూజీసీ తెలిపింది. వ్యాపారులు సైతం ధరల్లో రాబోయే మార్పులను గమనిస్తూ కొనుగోళ్లలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భారతీయ కుటుంబాల సాంస్కృతిక, ఆర్థిక మూలాల్లో బంగారం భాగమైన నేపథ్యంలో పన్ను విధానాలను మరింత సరళీకృతం చేయడమో లేదా నిఘా వ్యవస్థను బలోపేతం చేయడమో చేయకపోతే అనధికారిక బంగారం మార్కెట్ దేశ రాబడికి నష్టం చేకూరుస్తుందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: బ్యాంక్‌కు రూ.80 కోట్లకు పైగా కుచ్చుటోపీ


