మిగతా ఖనిజాలకు లేనిది.. బంగారానికే ఎందుకు? | Gold Dollar History 35 Dollars Per Ounce | Sakshi
Sakshi News home page

మిగతా ఖనిజాలకు లేనిది.. బంగారానికే ఎందుకు?

Nov 2 2026 2:12 PM | Updated on Nov 2 2026 3:12 PM

Gold Dollar History 35 Dollars Per Ounce

బంగారం(పసిడి) అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? ఇంట్లో చిన్న శుభకార్యం జరిగినా, పెళ్లి వేడుక వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది బంగారు ఆభరణాలే. పండుగలు, పుట్టినరోజులు, పెళ్లిళ్లు.. ఇలా ప్రత్యేక సందర్భంలోనూ బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అయితే భూమిలో బంగారం ఒక్కటే ఖనిజం కాదు. వెండి, ప్లాటినం, వజ్రాలు వంటి విలువైన సంపదలు కూడా ఉన్నాయి. అయినా వీటన్నింటినీ వెనక్కి నెట్టి బంగారమే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది? వేల ఏళ్ల చరిత్ర నుంచి నేటి ఆర్థిక వ్యవస్థ వరకు పరిశీలిస్తే దీని వెనుక ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తాయి.

బంగారంపై మనుషులకు మక్కువ ఇప్పటిది కాదు. వేల ఏళ్ల క్రితమే ప్రాచీన ఈజిప్టు, మెసొపొటేమియా, రోమన్‌ నాగరికతల్లో బంగారాన్ని ఆభరణాలు, దేవతా విగ్రహాలు, రాజభవనాల అలంకరణకు ఉపయోగించేవారు. అలాగే, ఈజిప్టు రాజులు బంగారాన్ని సంపదకు, అధికారానికి చిహ్నంగా భావించేవారని పరిశోధనలు చెబుతున్నాయి.

క్రీస్తుపూర్వం 1323లో మరణించిన ఫారో టుటన్‌ఖామున్‌ సమాధిలో లభించిన బంగారు ముసుగు ఇందుకు నిదర్శనమని చరిత్రకారుల అంచనా. అయితే ప్రాచీన లిడియా రాజ్యంలో క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దంలోనే బంగారం, వెండి మిశ్రమంతో నాణేలను తయారు చేశారని, ఇలా రాజుల ఆభరణాలు, నాణేలు, సంపద నిల్వల రూపంలో బంగారం ప్రాధాన్యం క్రమంగా పెరుగుతూ వచ్చిందని చరిత్రకారుల చెబుతున్నారు.

తరాలు మారినా మెరుపు తగ్గని ప్రత్యేకత!
బంగారానికి ఇంతటి విలువ రావడానికి దాని రసాయన లక్షణాలు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. సాధారణ ఇనుము గాలి, తేమకు గురైతే తుప్పు పడుతుంది. వెండి కూడా కొంతకాలానికి రంగు మారుతుంది. కానీ బంగారం మాత్రం గాలి, నీటితో సులభంగా ఎలాంటి చర్య జరపదు. దాంతో వేల ఏళ్లపాటు ఉన్నా దాని మెరుపు చాలావరకు అలాగే ఉంటుంది. అంతేకాదు.. బంగారం చాలా మెత్తగా ఉండటంతో పలుచటి రేకులుగా, సన్నని తీగలుగా మార్చుకోవచ్చు. కరిగించి మళ్లీ కొత్త ఆభరణాలుగా తయారు చేయవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ లక్షణాల కారణంగానే బంగారం తరతరాల పాటు ఉపయోగపడే సంపదగా మారింది. ఒకసారి కొనుగోలు చేసిన ఆభరణాన్ని అవసరమైనప్పుడు తిరిగి విక్రయించుకోవడం లేదా కొత్త రూపంలోకి మార్చుకోవడం కూడా సాధ్యమవుతోంది.

అరుదైన లభ్యత.. పెరుగుతున్న విలువ!
భూమిలో బంగారం చాలా తక్కువ మోతాదులో లభిస్తుంది. దాన్ని గుర్తించడం, తవ్వి బయటకు తీయడం, శుద్ధి చేయడం కూడా ఖర్చుతో కూడుకున్న పని.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు తవ్వి తీసిన బంగారం మొత్తం సుమారు 2.22 లక్షల టన్నులు. ఈ బంగారాన్నంతటినీ ఒకేచోట కరిగించి ఘనాకార రూపంలో ఉంచితే.. దాని పొడవు, వెడల్పు, ఎత్తు ఒక్కొక్కటి సుమారు 22.6 మీటర్లు మాత్రమే ఉంటాయని, అంటే ఇంతటి విలువైన సంపద మొత్తం ఒక చిన్న భవనం అంతటి స్థలంలోనే ఇమిడిపోతుందని 'వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌' తాజా అంచనా.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఇప్పటివరకు తవ్విన బంగారంలో ఎక్కువ భాగం ఇప్పటికీ ఏదో ఒక రూపంలో అందుబాటులోనే ఉంది. కొత్తగా తవ్వి తీసే బంగారం పరిమాణం పరిమితంగా ఉండటంతో దానికి డిమాండ్‌ కొనసాగుతోంది. ఆభరణాల నిపుణుల అంచనా ప్రకారం.. అరుదైన లభ్యతతో పాటు తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉండటం కూడా బంగారానికి ప్రత్యేక గుర్తింపును తెస్తుంది.

డబ్బుకు ప్రత్యామ్నాయంగా.. దేశాల దగ్గర బంగారు నిల్వలు!
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ కరెన్సీ విలువను బంగారంతో ముడిపెట్టేవి. దీనినే 'గోల్డ్‌ స్టాండర్డ్‌' అంటారు. 1944లో కుదిరిన బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందం ప్రకారం... అమెరికా డాలర్‌ విలువను ఔన్స్‌(1 ట్రాయ్‌ ఔన్స్‌ = 31.1035 గ్రాములు) బంగారానికి 35 డాలర్లుగా నిర్ణయించారు.

అయితే 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ డాలర్‌ను బంగారంగా మార్చుకునే విధానాన్ని నిలిపివేశారు. దీంతో పాత వ్యవస్థ క్రమంగా ముగిసింది. అయినప్పటికీ బంగారంపై దేశాల నమ్మకం తగ్గలేదు. నేటికీ కేంద్ర బ్యాంకులు తమ నిల్వల్లో భాగంగా బంగారాన్ని భద్రపరుస్తున్నాయి. కరెన్సీ విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులు వంటి పరిస్థితుల్లో బంగారం ఒక రక్షణాత్మక పెట్టుబడిగా ఉపయోగపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

వజ్రాలు, ప్లాటినం ఉన్నా.. బంగారానికే ఎందుకంత డిమాండ్‌?
వజ్రాలు, ప్లాటినం కూడా విలువైనవే. అలాగే, ప్లాటినం చాలా అరుదైన లోహం. వజ్రాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉంది. అయితే వజ్రాల ధర వాటి పరిమాణం, రంగు, స్వచ్ఛత, నాణ్యతను బట్టి మారుతుంది. ప్లాటినం వినియోగం ప్రధానంగా ఆభరణాలు, పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. రాగి, ఇనుము వంటి లోహాలకు నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో విపరీతమైన అవసరం ఉన్నప్పటికీ వాటి లభ్యత, ఉత్పత్తి బంగారంతో పోలిస్తే ఎక్కువ.

మరోవైపు బంగారం ఆభరణాలు, పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల నిల్వలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు.. ఇలా వివిధ రంగాల్లో ఉపయోగపడుతోంది. దీంతో బంగారానికి ఉన్న వేల ఏళ్లనాటి చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం, సులభంగా విక్రయించుకోగలగడం వంటి అంశాల కారణంగా దాని డిమాండ్‌ను నిలబెడుతున్నాయిని నిపుణులు చెబుతున్నారు.

అయితే, బంగారం ధరను దాని అరుదైన లభ్యత ఒక్కటే నిర్ణయించదు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌, సరఫరా, డాలర్‌ విలువ, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, యుద్ధాలు, ఆర్థిక పరిస్థితులు కూడా ధరపై ప్రభావం చూపుతాయి. దాంతో కొన్ని సందర్భాల్లో ధరలు భారీగా పెరిగితే.. మరికొన్ని సమయాల్లో తగ్గుతుంటాయి. ప్రస్తుతం కూడా ఇటువంటి పరిస్థితే కొనసాగుతుంది.

ఈ క్రమంలో ఒకసారి చరిత్రను పరిశీలించి చూసినట్లయితే... బంగారం కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే మిగిలిపోలేదు. అది కుటుంబ సంపదకు, ఆర్థిక భద్రతకు, సంప్రదాయాలకు ప్రతీకగా మారింది. 'అరుదైన లభ్యత, చెక్కుచెదరని నాణ్యత, తరతరాలుగా కొనసాగుతున్న నమ్మకం.. ఈ మూడింటి కలయికే బంగారాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. దాంతో తరాలు మారినా, కాలం మారినా పసిడిపై మనుషుల మక్కువ మాత్రం కొనసాగుతూనే ఉందని' చరిత్రకారులు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: మూలధన లాభాలు.. పన్ను చెల్లించాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement