దీపావళి వేడుకల్లో ఈ నగరాలదే ప్రత్యేక శైలి.. ఎందుకో తెలుసా? | Diwali Celebrations Best Places In India | Sakshi
Sakshi News home page

దీపావళి వేడుకల్లో ఈ నగరాలదే ప్రత్యేక శైలి.. ఎందుకో తెలుసా?

Nov 2 2026 8:17 AM | Updated on Nov 2 2026 8:58 AM

Diwali Celebrations Best Places In India

పర్యటన

అయోధ్య – ఉదయ్‌పూర్‌

దీపావళి అంటే ఒక పండగ మాత్రమే కాదు. జీవితంలో సరికొత్త వెలుగును తీసుకువచ్చే అవకాశం. దీపావళి రోజున భారతదేశంలో ఒక్కో ప్రాంతం ఒక్కోలా ఉంటుంది. ప్రతి నగరం కొత్త కాంతితో వెలుగులు వెదజల్లుతుంది..

అయోధ్యలో భక్తి భావంతో, వారణాసిలో మోక్ష భావనతో, అమృత్‌సర్‌లో త్యాగంతో, ఉదయ్‌పూర్‌లో రాజసం ఉట్టిపడే శోభతో, కోల్‌కతాలో శక్తి ఆరాధనతో దీపావళి విభిన్నంగా జరుపుకుంటారు. ఈసారి వీలైతే ఈ ప్రదేశాలకు వెళ్లి కొత్తగా దీపావళిని సెలబ్రేట్‌ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.

అయోధ్య, ఉత్తర ప్రదేశ్‌
సరయూ నది ఒడ్డున నిలబడి చూస్తే ఘాట్‌ మొత్తం దీపాల సముద్రంలా కనిపిస్తుంది. రామ మందిరం వెలుగుల మధ్య నగరం అంతా నాడు శ్రీరాముడి రాకను నేటికీ సెలబ్రేట్‌ చేస్తున్నట్లు ఉంటుంది.

వారణాసి, ఉత్తర ప్రదేశ్‌
వారణాసిలో దీపావళి ఎంత బాగా జరుగుతుందో, దాని కంటే ఇంట్రెస్టింగ్‌గా దేవ్‌ దీపావళి అంటే కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది. గంగా ఘాట్లపై వెలిగే దీపాల వెలుగు నీటిపై పడితే మ్యాజికల్‌ వరల్డ్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది.

అమృత్‌సర్, పంజాబ్‌
దీపావళి సందర్భంగా గోల్డెన్‌ టెంపుల్‌ ప్రాంగణం దీపాలతో అందంగా ముస్తాబవుతుంది. సరస్సు చుట్టూ వెలిగే దీపాలు, వాటి ప్రతిబింబాలు చూడటానికి చాలా మంది దూరదూరం నుంచి వస్తుంటారు. పంజాబ్‌లో దీపావళిని బందీ ఛోడ్‌ దివస్‌గా కూడా జరుపుకుంటారు. మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ చెర నుంచి విడుదలైన ఆరవ సిక్కు గురువు శ్రీ గురు హరగోవింద్‌ సాహిబ్‌ జీ దీపావళి రోజే అమత్‌సర్‌ చేరుకున్నారు. అందుకే సిక్కులకు దీపావళి ఇంకా స్పెషల్‌ పండగ.

ఉదయ్‌పూర్, రాజస్థాన్‌
లేక్‌ పిచోలా నీటిపై తేలే దీపాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ వెలుగులో సిటీ ప్యాలెస్‌ బంగారంలా మెరుస్తుంది. రాజస్థాన్‌ లో వెలుగు అంటే కేవలం అందం మాత్రమే కాదు, గర్వం లేని మంచి వ్యక్తిత్వానికి ప్రతీక అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌
కోల్‌కతాలో దీపావళి రోజు కాళీ పూజ చేస్తారు. కుమార్టులీలో కాళీమాత విగ్రహాల నుంచి కాళీఘాట్‌ వరకు నగరం అంతా శక్తిమయం అవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో చీకటిని పారద్రోలవచ్చని భక్తులు నమ్ముతారు.

ఎలా వెళ్లాలి..

  • ఈ ఐదు ప్రదేశాలను ఒకే ట్రిప్‌ లో కవర్‌ చేయలేం. ఒక్కో డెస్టినేషన్‌ కి 3–5 రోజులు ప్లాన్‌ చేసుకుంటే బాగుంటుంది.

  • అయోధ్యకు హైదరాబాద్‌ నుండి డైరెక్ట్‌ ఫ్లైట్‌ లేదు, లక్నో వరకు ఫ్లైట్‌ వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గంలో వెళ్లాలి. ట్రైన్‌ లో అయోధ్య ధామ్‌ వరకు డైరెక్ట్‌ ట్రైన్స్‌ ఉన్నాయి.

  • వారణాసికి హైదరాబాద్‌ నుండి ఇండిగో డైరెక్ట్‌ ఫ్లైట్‌ ఉంది (2 గంటల ప్రయాణం).

  • అమృత్‌సర్‌కు డైరెక్ట్‌ ఫ్లైట్‌ లేదు, ఢిల్లీ మీదుగా కనెక్టింగ్‌ ఫ్లైట్‌ తీసుకోవాలి. ట్రైన్‌ లో గోల్డెన్‌ టెంపుల్‌ మెయిల్‌ బెస్ట్‌ ఆప్షన్‌.

  • ఉదయ్‌పూర్‌కు హైదరాబాద్‌ నుండి డైరెక్ట్‌ ఫ్లైట్‌ ఉంది. రోడ్డు మార్గంలో అయితే ఆరావళి కొండల మధ్య ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.

  • కోల్‌కతాకు హైదరాబాద్‌ నుండి డైలీ డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ ఉంటాయి.

ఎక్కడ ఉండాలంటే..
అయోధ్యలో సరయూ ఘాట్‌ దగ్గర హోమ్‌ స్టే, వారణాసిలో దశాశ్వమేధ్‌ ఘాట్‌ దగ్గర హెరిటేజ్‌ హవేలీ, అమృత్‌సర్‌లో గోల్డెన్‌ టెంపుల్‌ దగ్గర సరాయ్, ఉదయ్‌పూర్‌లో పిచోలా లేక్‌ దగ్గర హవేలీ, కోల్‌కతాలో ఉత్తర కోల్‌కతాలోని బెంగాలీ బారీ (పాత ఇల్లు) లో ఉంటే పండగ వైబ్‌ పూర్తిగా ఫీల్‌ అవుతారు.

ఆసక్తికరమైన విషయాలు..
1. అయోధ్య దీపోత్సవ్‌ లో 22 లక్షల దీపాలు వెలిగించి రికార్డ్‌ క్రియేట్‌ చేశారు.
2. వారణాసి దేవ్‌ దీపావళి అనేది దీపావళికి 15 రోజుల తర్వాత కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది.
3. అమృత్‌ సర్‌ లో దీపావళిని బందీ చోర్‌ దివస్‌ గా 1619 నుండి సెలబ్రేట్‌ చేస్తున్నారు.
4. ఉదయ్‌ పూర్‌ సిటీ ప్యాలెస్‌ దీపావళి లైటింగ్‌ చూడటానికి చాలా మంది వస్తారు.
5. కోల్‌ కతాలో దీపావళి రోజే కాళీ పూజ జరుగుతుంది, ఇది బెంగాల్‌లో పెద్ద పండగ.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు..
ఈ ప్రదేశాలను ఒకే ట్రిప్‌లో వరుసగా కవర్‌ చేయలేం. ఒక్కోసారి ఒక్కో డెస్టినేషన్‌ కి 5 డేస్‌ ప్లాన్‌ చేసుకుంటే బాగుంటుంది.

అయోధ్య: ఫ్లైట్‌ లో వెళ్లి రావడానికి రూ. 12,500 నుంచి రూ. 17,500 వరకు ఖర్చవుతుంది. ట్రైన్‌ లో అయితే రూ. 1,500 నుంచి రూ. 3,500 వరకు అవుతుంది. స్టే విషయానికి వస్తే బడ్జెట్‌ లో కావాలంటే రూ. 1,000 నుంచి రూ. 3,500, స్టాండర్డ్‌ రూమ్‌ కోసం రూ. 3,500 నుంచి రూ. 5,000 వరకు, ప్రీమియం రూమ్‌ రూ. 7,000 పైన లభిస్తుంది. ఫుడ్‌ కోసం రోజుకి రూ. 800 నుంచి రూ. 1,200 పడుతుంది.

వారణాసి: ఫ్లైట్‌ రిటర్న్‌ కి రూ. 13,500 నుంచి రూ. 15,500 వరకు, ట్రైన్‌ కి రూ. 1,200 నుంచి రూ. 3,000 వరకు అవుతుంది. స్టే బడ్జెట్‌ రూ. 2,000 నుంచి, స్టాండర్డ్‌ రూ. 4,000 నుంచి రూ. 5,500, ప్రీమియం హవేలీ రూ. 7,000 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది. ఫుడ్‌ రోజుకి రూ. 900 నుంచి రూ. 1,300 ఖర్చు అవుతుంది.

అమృత్‌సర్‌: ఫ్లైట్‌ రిటర్న్‌ రూ. 17,000 నుంచి రూ. 24,500 వరకు, ట్రైన్‌ రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు. బడ్జెట్‌ స్టే రూ. 1,500 నుంచి, స్టాండర్డ్‌ రూ. 3,500 నుంచి రూ. 5,000. ఫుడ్‌ రోజుకి రూ. 800 నుంచి రూ. 1,200 వరకు బడ్జెట్‌ కేటాయించాలి.

ఉదయ్‌పూర్‌: ఫ్లైట్‌ రిటర్న్‌ రూ. 14,000 నుంచి రూ. 16,500, ట్రైన్‌ రూ. 1,500 నుంచి రూ. 3,000. స్టే బడ్జెట్‌ రూ. 2,000 నుంచి రూ. 3,500, స్టాండర్డ్‌ రూ. 4,500 నుంచి రూ. 6,000, లేక్‌ వ్యూ ప్రీమియం రూ. 8,000 పైన. ఫుడ్‌ రోజుకి రూ. 500 నుంచి రూ. 1,500 ఖర్చు అవ్వవచ్చు.

కోల్‌కతా: ఫ్లైట్‌ రిటర్న్‌ రూ. 14,200 నుంచి రూ. 18,800, ట్రైన్‌ రూ. 1,500 నుంచి రూ. 3,500. స్టే బడ్జెట్‌ రూ. 1,500 నుంచి రూ. 3,000, స్టాండర్డ్‌ రూ. 4,000 నుంచి రూ. 6,000. ఫుడ్‌ రోజుకి రూ. 900 నుంచి రూ. 1,300 బడ్జెట్‌ కేటాయించవచ్చు.

బుకింగ్‌ టిప్‌..
ఫ్లైట్‌ రేట్లు 45–60 రోజులు ముందు బుక్‌ చేస్తే తక్కువ పడతాయి. అయితే దీపావళికి అంత సమయంలో లేదు కాబట్టి ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్‌ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్‌ అప్డేట్స్‌ స్వయంగా వెరిఫై చేసుకొని ప్లాన్‌ చేసుకోండి.
– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

ఇదీ చదవండి: ద్రౌపదీ వస్త్రాపహరణం శాపమా? కర్మ ఫలమా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement