నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే! | Cruise Tourism In India - Travel, Cost And Experience | Sakshi
Sakshi News home page

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

Nov 2 2026 8:47 AM | Updated on Nov 2 2026 9:10 AM

Cruise Tourism In India - Travel, Cost And Experience

ట్రావెల్‌

క్రూయిజ్‌

అందరికీ అందుబాటులోనేనా?

చుట్టూ నీరు.. దగ్గరగా అలల సవ్వడి.. ముఖాన్ని తాకే చల్లని సముద్రపు గాలి.. దూరంగా కనిపించే సూర్యోదయం, సముద్రంలోకి జారిపోయే సూర్యాస్తమయం.. ఒకవైపు సంగీతం, మరోవైపు రుచికరమైన వంటకాలు.. విలాసవంతమైన గదులు, స్విమ్మింగ్‌ పూల్స్, వినోద కార్యక్రమాలు..! ఇదేదో కలల ప్రపంచం కాదు.. సముద్రంపై తేలియాడే ఓ భారీ విహార నౌకలో అడుగుపెడితే కనిపించే దృశ్యాలు. విమానంలో గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవడం ఒక అనుభవమైతే.. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ, ప్రయాణాన్నే ఓ పండుగలా మార్చుకోవడం మరో అనుభూతి. అదే క్రూయిజ్‌ పర్యాటకం.

ఒకప్పుడు విదేశాల్లోని సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సాగరయానం.. ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ముంబై, గోవా, కొచ్చి, చెన్నై వంటి తీర్రపాంతాల నుంచి క్రూయిజ్‌ టూరిజం అవకాశాలు పెరుగుతుండటం.. దేశీయ నదీ క్రూయిజ్‌లకు కూడా ప్రాధాన్యం లభిస్తుండటంతో ఈ రంగంపై ఆసక్తి పెరుగుతోంది. మరి క్రూయిజ్‌ ప్రయాణం అంటే ఏమిటి? ఎంత ఖర్చవుతుంది? మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ అనుభూతిని ఆస్వాదించవచ్చా? వివరాలు చూద్దామా?

క్రూయిజ్‌ పర్యాటకం అంటే ఏమిటి?
సముద్రంలో ప్రయాణంతోపాటు బస, భోజనం, వినోదం, విశ్రాంతి, పర్యాటక ప్రాంతాల సందర్శన.. ఇలా ఎన్నో అనుభవాలను ఒకే విహారయానంలో అందించే విధానమే క్రూయిజ్‌ పర్యాటకం. క్రూయిజ్‌ను సముద్రంపై తేలియాడే నగరంగా పోల్చవచ్చు. సాధారణంగా క్రూయిజ్‌లు పది నుంచి 12 అంతస్తులతో విశాలమైన, విలాసవంతమైన సౌధాలను తలపిస్తాయి.

వందలాది గదులు, వివిధ రకాల రెస్టారెంట్లు, విశ్రాంతి, వ్యాయామశాలలు, స్విమ్మింగ్‌ పూల్స్, హాట్‌ టబ్స్‌తోపాటు సంగీత ప్రదర్శనలు, లైవ్‌ షోలు, పిల్లల ఆటస్థలాలు, డీజే డ్యాన్సుల వంటి బోలెడు వినోద కార్యకలాపాలు ఉంటాయి. వీటితోపాటు క్యాసినో, బార్లు కూడా ఉంటాయి.

క్రూయిజ్‌ ప్రయాణం ఎలా చేయాలి?

  • మొదటిసారి క్రూయిజ్‌లో ప్రయాణించాలనుకునేవారు కొన్ని విషయాలు తెలుసుకుంటే ప్రక్రియ సులభమవుతుంది. రెండు లేదా మూడు రాత్రుల చిన్న ప్రయాణమా? నాలుగు నుంచి ఆరు రాత్రుల ద్వీపయాత్రా? లేక ఎక్కువ రోజులు సాగే అంతర్జాతీయ క్రూయిజా? అనేది నిర్ణయించుకోవాలి.

  • తక్కువ ధరలో ప్రయాణించాలనుకునేవారు ఇంటీరియర్‌ గదిని ఎంచుకోవచ్చు. సముద్రాన్ని గది నుంచే చూడాలంటే ఓషన్‌  వ్యూ లేదా బాల్కనీ గదిని పరిశీలించవచ్చు.

  • ప్రయాణికుల వివరాలు నమోదు చేసి, వర్తించే చార్జీలు చెల్లించి, బుకింగ్‌ నిర్ధారణ పొందాలి. ప్రయాణానికి అవసరమైన గుర్తింపు పత్రాలు, బుకింగ్‌ వివరాలు వెంట ఉంచుకోవాలి.

మధ్యతరగతికి అందించాలనే..
ఖరీదైన క్రూయిజ్‌ ప్రయాణాన్ని మధ్యతరగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సాగుతున్నాం. అందుకే రవాణా, వసతి, ఆహారం, లిక్కర్‌ అన్నీ కలిపి రోజుకు రూ.10వేల కంటే తక్కువలోనే అందిస్తున్నాం. మూడు రోజుల ప్యాకేజీ నుంచి 34 రోజుల ప్యాకేజ్‌ వరకు అందిస్తున్నాం. ప్రస్తుతం మావి రెండు క్రూయిజ్‌లు కార్యలాపాలు సాగిస్తున్నాయి. సన్‌ క్రూయిజ్‌ వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుంది.

– జుర్గెన్‌ బైలమ్, కోర్డేలియా క్రూయిజెస్‌ సీఈఓ, ప్రెసిడెంట్‌

ఎంత ఖర్చవుతుంది?
క్రూయిజ్‌ అంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిందేనని భావించేవారు ఉన్నారు. కానీ అన్ని క్రూయిజ్‌ల ధరలు ఒకేలా ఉండవు. ప్రయాణ వ్యవధి, గది రకం, సీజన్‌, నౌక, ప్యాకేజీలో చేర్చిన సేవల ఆధారంగా ఖర్చు మారుతుంది.

ఉదాహరణకు కోర్డేలియా స్కై క్రూయిజ్‌లో ముంబై నుంచి గోవా ఎంచుకుంటే.. దానికి సంబంధించిన టికెట్‌ ధరలు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. టికెట్‌ ధరలో కేబిన్‌ ఫేర్, సర్వీస్‌ ట్యాక్స్‌ అండ్‌ లెవీస్, ఫ్యూయల్‌ సర్‌ చార్జీ, జీఎస్టీ కలిపి ఉంటాయి. ఇందులో కేబిన్‌ ఫేర్‌ అనేది కీలకం. నౌకలో కింది డెక్‌ నుంచి పైకి వెళ్లే కొద్దీ కేబిన్‌ ఫేర్‌ పెరుగుతుంది.

అలాగే విండో, బాల్కనీ ఉన్న రూముల ధరలు ఎక్కువగా ఉంటాయి. కిటికీలు, బాల్కనీ వ్యూ లేని ఇంటీరియర్‌ స్టేట్‌ రూమ్స్‌ అన్నింటి కంటే తక్కువ ధరలో ఉంటాయి. బడ్జెట్‌లో వెళ్లాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు. కోర్డేలియా సంస్థ ప్రస్తుతం కిడ్స్‌ ఫ్రీ, సెకండ్‌ గెస్ట్‌ ఫ్రీ వంటి ఆఫర్లు ఇస్తోంది. అలాగే బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వర్తింపజేసుకుంటే ముంబై నుంచి గోవా ప్రయణానికి (మూడు రోజులు, రెండు రాత్రులు) ఇద్దరు వ్యక్తులకు కనిష్టంగా రూ.50 వేల నుంచి రూ.60వేల వరకు అవుతుంది.

ఫుడ్‌ సంగతేంటి?
టికెట్‌ తీసుకుని క్రూయిజ్‌లోకి ప్రవేశించిన దగ్గర నుంచి తిరిగి దిగేవరకు ఫుడ్‌ అంతా వాళ్లే చూసుకుంటారు. శాఖాహారుల కోసం ప్రత్యేక రెస్టారెంట్‌ ఉంటుంది. మద్యం ప్రియులకు కావాల్సినంత లిక్కర్‌ కూడా ఉచితంగానే ఇస్తారు. అయితే, ప్రీమియం బ్రాండ్ల వంటి ఖరీదైన మద్యం కావాలంటే అదనంగా చెల్లించాల్సిందే.

చెల్లింపులెలా?
కోర్డేలియా క్రూయిజ్‌లో చెల్లింపులన్నీ డాలర్లలో జరుగుతాయి. క్రూయిజ్‌లో ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరికీ ఓ యాక్సెస్‌ కార్డు ఇస్తారు. ఈ కార్డులోకి క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులతో డాలర్లను లోడ్‌ చేయించుకోవాలి. క్రూయిజ్‌ నుంచి వచ్చేసేటప్పుడు కార్డులో మిగిలిన ఉన్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు. అయితే, క్యాసినోలో మాత్రం గేమ్స్‌ ఆడాలంటే అక్కడ ఉన్న క్యాష్‌ కౌంటర్లలో నగదు లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపి కాయిన్‌ ్స తీసుకోవాలి.

ఫోన్‌ సిగ్నల్, వైఫై మాటేంటి?
క్రూయిజ్‌ సముద్రంలోకి వెళ్లిన తర్వాత మొబైల్‌ సిగ్నల్స్‌ ఉండవు. క్రూయిజ్‌లో శాటిలైట్‌ లింక్డ్‌ కమ్యూనికేషన్‌ ఉంటుంది. వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఉచితంగా ఇవ్వరు. కనిష్టంగా ఐదు డాలర్ల నుంచి వైఫై ప్యాకేజీలు మొదలవుతాయి.

సీ సిక్‌నెస్‌ ఉంటుందా?
సముద్రపు అలల వల్ల కొందరికి వికారం, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. అయితే, క్రూయిజ్‌లు చాలా పెద్ద నౌకలు కావడం వల్ల అలలకు ఊగడం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అందువల్ల భయపడాల్సిన పనిలేదు. క్రూయిజ్‌ ప్రయాణానికి రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తగిన ప్యాకేజీని ఎంచుకుని, అదనపు ఖర్చులను ముందుగానే అంచనా వేసుకుంటే మధ్యతరగతి కుటుంబాలూ ఈ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
– కొండ్రెడ్డి సత్య కిశోర్‌

ఇదీ చదవండి: దీపావళి వేడుకల్లో ఈ నగరాలదే ప్రత్యేక శైలి.. ఎందుకో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement