తిట్టడు... గొడవపడడు... ఈ భర్త నాకొద్దు! కారణం తెలిస్తే షాకే! | UAE Strange Divorce Cases Makeup Love | Sakshi
Sakshi News home page

తిట్టడు... గొడవపడడు... ఈ భర్త నాకొద్దు! కారణం తెలిస్తే షాకే!

Nov 1 2026 8:41 AM | Updated on Nov 1 2026 8:41 AM

UAE Strange Divorce Cases Makeup Love

ఫండే

లీగలాటా

మోతాదు మించితే ఏదైనా ప్రమాదమే, చివరికి ప్రేమ అయినా మంచితనమైనా! మితిమీరితే ఇబ్బందిగా అనిపిస్తోందేమో.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తోందేమో... ఓ భార్యకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భర్త అతిప్రేమ ఆమెను ఇబ్బంది పెట్టింది. తట్టుకోలేకపోయింది... కనీసం తిట్టడు... ఏ విషయానికీ గొడవపడడు... దేనికీ ఎదురుచెప్పడు. ఇలాంటి భర్తతో కలిసి ఉండలేనని వాపోయింది. విడాకులు మంజూరు చేయాలని కోర్టును వేడుకుంది...

సాధారణంగా భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు. పట్టించుకోవడం లేదని భార్యలు ఫిర్యాదు చేస్తుంటారు. వంటలో సాయం చేయడం లేదని, చీటికీ మాటికీ కసురుకుంటున్నాడని రుసరుసలాడతారు. ప్రేమ చూపడం లేదని వాపోతుంటారు. అయితే ఇదో రివర్స్‌ కేసు. భర్త తనతో అసలు గొడవ పడడం లేదని, అన్ని పనులు తానే చేస్తున్నాడనేది ఆ భార్య ఫిర్యాదు.

తాను కోప్పడినా తిరిగి ఏమీ అనకపోగా తన పైనే జాలి చూపుతున్నాడు. ఇది తట్టుకోలేకపోతున్నానన్నది ఆమె ఆవేదన. తాను కోరుకున్న విధంగా తన సంసారిక జీవితం సాగడం లేదని. తనకు విముక్తి కల్పించాలని పుజైరాకు చెందిన ఓ మహిళ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని షరియా కోర్టులో విడాకుల పిటిషన్‌ దాఖలు చేసింది.

అంతా ఓకే.. కానీ
కూరకు తాలింపు, చీరకు జాడింపు ఎంత అవసరమో... సంసారం అన్నాక దంపతుల మధ్య ప్రేమ, ఆప్యాయతలతో పాటు గిల్లికజ్జాలు, మూతివిరుపులు, అలకపాన్పులు ఉంటేనే సరదాగా ఉంటుందని పేర్కొంది. భర్త తన పట్ల చూపుతున్న ప్రేమ, ఆప్యాయత  అన్నీ బాగున్నా... వీటితో పాటు అప్పుడప్పుడు ఇద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు, మాట పట్టింపులు, భేదాభిప్రాయాలు, అలకలు కోరుకుంటున్నట్టు కోర్టుకు విన్నవించింది. ఇవి కూడా ఉంటేనే సంసారం బాగుంటుందని లేకపోతే వైవాహిక జీవితం చప్పగా సాగుతుందని పేర్కొంది.

కాలు కూడా విరిగింది..
భార్య ఫిర్యాదుతో ఆ భర్త ఆశ్చర్యపోయాడు. తాను ఆమెను సంతోషంగా ఉంచడానికే ఇలా చేశానన్నాడు. భార్య అభ్యర్థనను అంగీకరించొద్దని కోర్టుకు విన్నవించాడు. బరువు గురించి తన భార్య కామెంట్‌ చేయగా కఠిన ఆహార నియమాలు, వ్యాయామాలు చేశానని చెప్పాడు. ఈ క్రమంలో తన కాలికి ఫ్రాక్చర్‌  కూడా అయిందని తెలిపాడు. 
ఇరు పక్షాల వాదనలు విన్న ఫుజైరా కోర్టు... భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉందని, ఇరువురు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

మేకప్‌ కరిగింది.. బంధం ముగిసింది
‘మేకప్‌’ ఓ జంట మధ్య వివాదం రేపింది.  సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లిన వారి మధ్య చిచ్చుపెట్టింది. చివరికి వారి వివాహ బంధం విచ్ఛిన్నానికి కారణమైంది. 2016లో యూఏఈలో జరిగిన ఈ వింత ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలేం జరిగింది
షార్జా నగరంలోని ప్రముఖ అల్‌ మమ్జార్‌ బీచ్‌కు కొత్తగా పెళ్లయిన ఓ అరబ్‌ జంట వెళ్లింది. ఇద్దరూ కలిసి సముద్రంలో స్నానం చేయడానికి వెళ్లారు. కొద్దిసేపు జలకాలాడారు. ఆ అలల ధాటికి భార్య ముఖంపై ఉన్న మేకప్‌ పూర్తిగా తొలగిపోయింది.

ఆమె పెట్టుకున్న కృత్రిమ  కనురెప్పలు, కలర్‌ కాంటాక్ట్‌ లెన్స్‌ నీళ్లలో కొట్టుకుపోయాయి. దీంతో ఆమె అసలు రూపం బయటపడింది. ఆమె ముఖాన్ని చూసి భర్త మొదట గుర్తు పట్టలేదు. తర్వాత షాక్‌కు గురయ్యాడు.  పెళ్లికి ముందు, పెళ్లిలో మేకప్‌ వేసుకుని తనను మోసం చేసిందని ఆగ్రహించాడు. తమ బంధాన్ని కొనసాగించలేనని తేల్చి చెప్పాడు.

ఫలించని మధ్యవర్తిత్వం..
ఈ ఘటనతో వధువు మానసికంగా కుంగిపోయింది. దీంతో ఆమెకు సైకాలజిస్ట్‌ డాక్టర్‌ అబ్దుల్‌ అజీజ్‌ అసఫ్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చాడు. ‘తన నిజరూపం గురించి భర్తకు చెప్పాలని ఆమె భావించిందని అయితే అందుకు సరైన సమయం కోసం వేచి చూస్తోందని’ ఈలోపు ఇలా జరిగిపోయిందని ఆయన వెల్లడించాడు. వారిద్దరి మధ్య సయోధ్య కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భర్త రాజీ యత్నాలను అంగీకరించలేదు. ఆమెతో కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. ఈ వింత కారణంతో వారి వివాహ బంధం ముగిసిపోయింది.

- దిలీప్‌ మాదిరెడ్డి

ఇదీ చదవండి: వేగనిజం అంటే ఏంట్రా అబ్బాయ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement