న్యూఢిల్లీ: పండగ సీజన్ సందర్భంగా దేశీయంగా డిమాండ్ నెలకొనడంతో అక్టోబర్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జోరుగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలా రూ. 2 లక్షల కోట్ల స్థాయిని అధిగమించి, రూ. 2.31 లక్షల కోట్లకు ఎగిశాయి. వార్షిక ప్రాతిపదికన గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 23 శాతం పెరిగాయి.
ఏప్రిల్‌లో నమోదైన రికార్డు స్థాయి రూ. 2.43 లక్షల కోట్ల తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇది రెండోసారి. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీ రూ. 42,935 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ రూ. 51,340 కోట్లు, సమీకృత జీఎస్‌టీ రూ. 1.37 లక్షల కోట్లపైగా ఉన్నాయి. జీఎస్‌టీ రిఫండ్‌లు 6.5 శాతం పెరిగి రూ. 27,934 కోట్లకు చేరాయి. రిఫండ్‌లు పోగా నికర వసూళ్లు 26 శాతం పెరిగి రూ. 2.03 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.


