57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్
హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పరిరక్షించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. గురువారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాయతీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతలకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అమాయకుల ఆధార్, పాన్ వివరాలను దుర్వినియోగం చేస్తూ నకిలీ రిజి్రస్టేషన్లు, బోగస్ ఇన్‌వాయిస్‌ల ద్వారా అక్రమ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందుతున్న ముఠాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై తీవ్ర ప్రభావం: మోటార్ వాహనాలు, ఇన్‌పుట్ సర్వీసులకు సంబంధించి చేసే మార్పుల వల్ల తెలంగాణకు కేంద్ర అంచనాల ప్రకారమే ఏటా సుమారు రూ.800 కోట్ల ఆదాయ ప్రభావం పడుతుందని, రాష్ట్ర సొంత అంచనాల ప్రకారం ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా 35 శాతం ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ పథకాలు, పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణ దెబ్బతింటుందని చెప్పారు.
సమావేశంలో కీలక ప్రతిపాదనలు
⇒ స్క్రాప్ రంగంలో జరుగుతున్న పన్ను ఎగవేతలు, అమాయకుల వివరాల దుర్వినియోగం (గుర్తింపు దొంగతనాలు) వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి పేదల ప్రయోజనాలు కాపాడేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలి.
⇒ ఐటీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌లో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రాంతీయ కార్యాలయాలను నెలకొల్పాలి.
⇒ కౌన్సిల్ పునర్వ్యవస్థీకరించే కమిటీల్లోనూ, అధికారుల స్టాండింగ్ కమిటీల్లోనూ తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
⇒జీఎస్టీ ఆదాయం అంతిమంగా ప్రజలదేనని, కేంద్ర–రాష్ట్రాల పరస్పర విశ్వాసంతోనే ఈ వ్యవస్థ సఫలమవుతుందని భట్టి అన్నారు.


