ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా
ఘాట్లు, ఆలయాలు, భక్తుల సౌకర్యాలకు రూ.1,115 కోట్లతో పనులు
పుష్కరాల లోగో, నినాదం రూపకల్పనలో ప్రజలకు అవకాశం
మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు–2027ను తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా నిర్వహిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ విదేశాల నుంచి ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
సోమవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో పుష్కరాల లోగో, నినాదం రూపకల్పనపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాల కోసం ఘాట్లు, ఆలయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర భక్తుల సౌకర్యాలకు రూ.1,115 కోట్లతో పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
‘దక్షిణ గంగ’గా భక్తులు భావించే గోదావరి తీరం వెంబడి బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.324 కోట్లు, భద్రాచలానికి రూ.276 కోట్లు, కాళేశ్వరానికి రూ.198 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.
పుష్కరాల ఆధ్యాత్మిక విశిష్టత, గోదావరి పవిత్రత, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఆ భావాన్ని ప్రతిబింబించే లోగో, నినాదం రూపకల్పనలో విద్యార్థులు, కళాకారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా ముగ్గురు సభ్యుల బృందంగా పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు.
లోగో, నినాదాన్ని కలిపి ఒకే ఎంట్రీగా నవంబర్ 30లోగా సమర్పించాలి. సృజనాత్మకత, ప్రత్యేకత, పుష్కరాల భావానికి అనుగుణంగా ఉండటం, వివిధ ప్రచార మాధ్యమాల్లో ఉపయోగించుకునే వీలు వంటి అంశాల ఆధారంగా రాష్ట్రస్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. మొదటి మూడు స్థానాలకు వరుసగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులు ఇవ్వనున్నారు. తొలి 100 ఎంట్రీలకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహోత్సవం ప్రత్యేకతను కళాత్మకంగా ఆవిష్కరించాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్


