సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజలకు సంక్షేమం అందిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు అధికారం అనేది ఇక కలేనని అన్నారు. కేటీఆర్ ఊహా ప్రపంచంలో బతుకుతున్నారని, సోషల్ మీడియా లోకంలోనే ఉంటున్నారని విమర్శించారు.
పార్టీ ఆర్గనైజేషన్ బలోపేతంపై పార్టీ ఇన్‌చార్జితో చర్చించామని భట్టి తెలిపారు. పార్టీలో విభేదాలు లేవని, అలాంటప్పుడు విభేదాలపై చర్చ ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. తెలంగాణ నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తోందని, అలాగే నీటి విషయంలో దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్‌ఎస్ తీరు ఉందని విమర్శించారు.
దాంతోపాటుగా.. బీఆర్‌ఎస్ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను బీఆర్‌ఎస్ కుప్పకూల్చిందని, వాటిని సరిదిద్దుతుంటే తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, ప్రతి పేద కుటుంబాన్ని వెతికి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా! : కోమటిరెడ్డి వెంకటరెడ్డి


