కరీంనగర్: బీజేపీ సోమవారం మహా పాదయాత్ర నిర్వహిస్తోంది. కరీంనగర్‌లో నిర్వహిస్తున్న ఈ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాలు, కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ ఈ భారీ ర్యాలీ చేపట్టింది.
ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారు. బీజేపీకి ప్రజల మద్దతు ఉంది. ఓట్‌చోరీ జరిగిందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. 3 కోట్ల మంది చనిపోయినవారి ఓట్లను తొలగించకూడదా? ఓట్‌చోరీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కేవలం జేబులో పెట్టుకుంటున్నారు. మేము గుండెల్లో పెట్టుకుంటున్నాం. ఎస్‌ఐఆర్‌పై ఇండియా కూటమి రాద్ధాంతం చేస్తోంది. చొరబాటుదారులు ఓట్లు వేస్తే అవకాశం కల్పించాలా ఏంటి?
తెలంగాణా సర్కార్ పని అయిపోయింది. రాబోయేది బీజేపీ సర్కారే. 2014లో మోదీ వంటి ప్రజా నాయకుణ్ని ప్రజలు గెలిపించుకున్నారు. మోదీ వచ్చాక ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. 2029లో కూడా మళ్లీ మోదీనే ప్రధానిగా గ్యారంటీ. రాహూల్ గాంధీ ఓ ప్రేక్షక పాత్రకు పరిమితం కావాల్సిందే. ప్రతి దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్న ప్రధానిని మోదీని తప్ప ఇంకెవర్నైనా చూశారా? అదీ ఆయన సైనికుల సంక్షేమం కోసం ఇచ్చే ప్రాధాన్యం. కాంగ్రెస్‌ది కుటుంబ వారసత్వం.. వారికే పూజ చేయాలనుకునే మనస్తత్వం. భారతీయుల విస్తృతమైన కలలు సాకారం కావాలంటే బీజేపీనే ఈ దేశంలో ఉండాలి. నషా ముక్త్ భారత్ కోసం అందరం పాటుపడాలి.’’ అని తెలిపారు.
అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు ఎస్ఐఆర్ చేపట్టారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు? మోదీ ఎన్నిక చెల్లకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా చెల్లదు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ మహా పాదయాత్ర’’ అని తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం కోసం కొట్లాడమంటోంది నా కరీంనగర్ గడ్డ. బీజేపీ ఎక్కడ అని ప్రశ్నించే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ గడ్డను ఓసారి చూడాలి. బీజేపీ కార్యకర్తల నిండా కొండగట్టు అంజన్న చందనం లాంటి రక్తం ప్రవహిస్తోంది. చనిపోయినవారి ఓట్లు పోతే తీయడం కరెక్టా, కాదా? పీవీ, ఎమ్మెస్సార్ చనిపోతే వారి ఓట్లు తొలగిస్తే తప్పా? బార్డర్ దాటి వచ్చి సంక్షేమ పథకాలు పొందితే.. వారిని తరిమి తరిమి కొట్టేవరకు వదిలిపెట్టం. దేశ ద్రోహులను వెనుకేసుకొస్తోంది పార్టీ కాంగ్రెస్’’ అని విమర్శల జల్లు కురిపించారు.


