భీమవరం: కూటమి నాయకులు పైకి ఐక్యతారాగం ఆలపిస్తున్నా, క్షేత్రస్థాయిలో విభేదాల కుంపట్లు మాత్రం చల్లారడం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వం ఎన్నికల్లో ఐక్యతను ప్రకటిస్తున్నప్పటికీ, దిగువ స్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కూటమి నేతల మధ్య ఉన్న ఈ అనైక్యత భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది.
బీజేపీ గైర్హాజరు
జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శనివారం భీమవరంలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ ఐక్యతా సమావేశానికి బీజేపీ నాయకులు గైర్హాజరయ్యారు. అంతేకాకుండా, టీడీపీ, జనసేన నాయకులు కనీసం బీజేపీ కండువా కూడా వేసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా జనసేనకు చెందిన డాక్టర్ చుండూరి మల్లేశ్వరిని ప్రకటించారు. 52 కౌన్సిలర్ పదవుల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని ప్రకటించి, 32 వార్డుల్లో బీజేపీ తరఫున నామినేషన్లు వేయించారు. మరోవైపు, సీట్లు దక్కని కొందరు జనసేన నేతలు రెబల్స్‌గా బరిలో నిలవగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ కుమారుడు ధనుంజయ 39వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మంత్రి ప్రకటనపై బీజేపీలో అసంతృప్తి
మున్సిపల్ సీట్ల కేటాయింపులో బీజేపీకి తీవ్ర అవమానం జరిగిందని ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఆ తర్వాత పట్టించుకోలేదని సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. కనీసం రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ కుమారుడికే కౌన్సిలర్ సీటు ఇప్పించలేకపోయారని, అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలవాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు.
ఆత్మీయ సమావేశంలో కానరాని బీజేపీ
భీమవరంలో నిర్వహించిన ఎన్‌డీఏ ఆత్మీయ సమావేశం కేవలం జనసేన, టీడీపీ సమావేశంలాగే సాగిందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల జెండాలు పట్టుకుని, మెడలో బీజేపీ కండువా కూడా వేసుకుని తిరిగే టీడీపీ, జనసేన నేతలు.. ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్న ఈ సమావేశంలో ఒక్కరు కూడా బీజేపీ కండువా ధరించకపోవడం గమనార్హం. బీజేపీతో సఖ్యత లోపించడం, పలు చోట్ల జనసేన నేతలు రెబల్స్‌గా బరిలో నిలవడం కూటమి గెలుపు అవకాశాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


