ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటన ప్రకారం ఫెయిర్‌నెస్ వాడిన 17 ఏళ్ల బాలిక కిడ్నీ దెబ్బతినడంతో పాటు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో మరో కీలక పరిణామం చేసుకుంది. మలప్పురం జిల్లాలోని అరీకోడ్ పోలీసులు ఉగ్రపురం ప్రాంతానికి చెందిన బాధిత బాలిక ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి ఈ కేసును నమోదు చేశారు. పోలీసులు ఆ క్రీమ్ తయారీదారుడిపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ ఆదివారం రాష్ట్రవ్యాప్త తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ సౌందర్య సాధనాలు (కాస్మెటిక్స్), ప్రోటీన్ పౌడర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేని ఇలాంటి సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తులు పాకిస్థాన్ మరియు మంగళూరు-కాసరగోడ్ ప్రాంతాల నుండి వస్తున్నాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. .
ఎఫ్‌ఐఆర్ (FIR) ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటనను చూసిన ఆ బాలిక 'ఎఫ్ ట్యూన్' (F Tune) అనే పేరుతో విక్రయిస్తున్న క్రీమ్‌ను కొనుగోలు చేసింది. మలప్పురంలోని ఆస్టర్ మిమ్స్ మదర్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం, మొటిమలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో ఈ క్రీమ్ సహాయపడుతుందని పేర్కొన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచార వీడియోలను చూసి ఆ బాలిక ఆ క్రీమ్‌ను ఆర్డర్ చేసి వాడింది. ఇది ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉన్న క్రీమ్ వాడటం వల్లే బాలిక శరీరంలో మెర్క్యురీ స్థాయిలు విపరీతంగా పెరిగి అనారోగ్యానికి గురైందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రీమ్‌లో మానవ ఆరోగ్యానికి అత్యంత హానికరమైన పాదరసం (మెర్క్యురీ) పరిమితికి మించి ఉందని, దీనివల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిసి కూడా తయారీదారుడు కల్తీకి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రీమ్ వాడిన తర్వాత బాలికకు కిడ్నీ దెబ్బతినడం సహా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్య చికిత్స కోసం ఆమె ఇప్పటివరకు దాదాపు రూ. 1 లక్ష వరకు ఖర్చు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఈ క్రీమ్ తయారీదారుడిని నిందితుడిగా చేరుస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం మరియు కేరళ పోలీస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
నా కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి : సలీం
ఈ బాలిక వ్యవహారం వెలుగులోకి రావడంతో దాదాపు 10 ఏళ్ల క్రితం తనకెదురైన అనుభవం గురించి ప్రముఖ గాయకుడు సలీం కొడత్తూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గతంలో ఒక స్కిన్-లైటెనింగ్ క్రీమ్ వాడటం వల్ల 'మెంబ్రేనస్ నెఫ్రోపతి' అనే కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించారు. తాను ఈ సమస్యతో బాధపడ్డానని, నెలల తరబడి చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని సలీం తెలిపారు. ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడిన తర్వాత తీవ్రమైన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. కొన్ని నెలల్లోనే, అతని కనురెప్పలు, కాళ్లు వాపుకు గురయ్యాయి మరియు అతని రోగనిరోధక శక్తి కూడా తగ్గింది. శరీరంలో అల్బుమిన్ తగ్గడం వల్లే ఈ సమస్య వచ్చిందని సలీం చెప్పారు. కిడ్నీ బయాప్సీ తర్వాత తనకు 'మెంబ్రేనస్ నెఫ్రోపతీ' అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. దీని చికిత్స కోసం ఆయన కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అనారోగ్యం, సమస్యలు, ముఖ్యంగా నిద్రలేమి, తనని ఇంకా వేధిస్తున్నాయనీ, రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నా, కొన్నిసార్లు నిద్రకు మందులు వేసుకోవాల్సి వస్తుందంటూ వాపోయాడు. శరీరంలో ఈ ప్రోటీన్ ఇలాగే తగ్గుతూ ఉంటే, అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయ వచ్చని వైద్యులు హెచ్చరించారు.


