కోజికోడ్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేరళ క్యాటరింగ్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్, కట్టెల ధరలు పెరగడంతో నిర్వాహకులు నష్టాలను చవిచూస్తున్నారు. ఆరు నెలల క్రితం రూ.80గా ఉన్న చికెన్ బిర్యానీ తయారీ ఖర్చు ప్రస్తుతం రూ.140కి చేరింది. సంప్రదాయ కేరళ విందు (సద్యా) తయారీకి రెండు రకాల పాయసంతో కలిపి గతంలో రూ.120 ఖర్చవగా, ఇప్పుడు దాదాపు రూ.200కు చేరుకుంది.
బియ్యం, కొబ్బరి నూనె, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, మసాలా దినుసులు, చేపలు, మాంసం ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు వంట గ్యాస్, కట్టెల ధరల పెరుగుదల భారంగా మారింది. కేరళలో సుమారు 4 వేల లైసెన్స్‌డ్ క్యాటరింగ్ సంస్థలు ఉండగా.. వీటిపై దాదాపు 1.5 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు.
పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు నెలల ముందే ఆర్డర్లు తీసుకుంటారు. అప్పటి ధరల ఆధారంగా భోజన ప్యాకేజీల రేట్లు నిర్ణయిస్తారు.
సరుకుల ధరలు పెరగడంతో అదనపు భారాన్ని నిర్వాహకులే భరించాల్సి వస్తోంది. దీంతో గతంలో ఒప్పందం చేసుకున్న కార్యక్రమాలను నష్టాలకే పూర్తి చేస్తున్నారు. పశ్చిమాసియా ఘర్షణలకు ముందు బాగా నడిచిన క్యాటరింగ్ యూనిట్లు ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకున్నాయని ఆల్ కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీకే రాధాకృష్ణన్ తెలిపారు. కొన్ని సంస్థలు వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నూడుల్స్ తిని ఏడేళ్ల బాలిక మృతి


