అమృత్‌సర్: పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్ తన అమ్మమ్మ మాతా చరణ్ కౌర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శనివారం అమృత్‌సర్ చేరుకున్నారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ఆయనను స్వగ్రామం జల్లూపూర్ ఖేడాకు తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి గ్రామం వరకు పోలీసులను మోహరించారు.
మానవతా దృక్పథంతో అమృత్‌సర్ అదనపు సెషన్స్ కోర్టు నవంబర్ 21న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మూడు గంటల కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. ఈ సమయంలో పోలీసుల పర్యవేక్షణలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారు. నవంబర్ 22న తిరిగి అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు వెళ్లనున్నారు. అమృత్‌పాల్‌ను ఏడు వాహనాల కాన్వాయ్‌లో దిబ్రూగఢ్ జైలు నుంచి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి విమానంలో తొలుత ఢిల్లీకి, అనంతరం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు.
84 ఏళ్ల మాతా చరణ్ కౌర్ ఈ నెల 8న కన్నుమూశారు. అంతకుముందు నవంబర్ 14న కూడా అమృత్‌పాల్‌ను పంజాబ్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా తగిన విమాన సర్వీసులు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో సాధ్యపడలేదు. అనంతరం నవంబర్ 17న కోర్టు కొత్త ఆదేశాలు జారీ చేసింది. 2023 ఫిబ్రవరి 23న అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనతో అమృత్‌పాల్ వార్తల్లో నిలిచారు. తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్ విడుదలను కోరుతూ ఆయన మద్దతుదారులు బారికేడ్లను తొలగించి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఎస్పీ జుగరాజ్ సింగ్ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు అమృత్‌పాల్ కోసం గాలింపు చేపట్టారు. నెలకు పైగా పరారీలో ఉన్న ఆయనను 2023 ఏప్రిల్ 23న మోగా జిల్లా రోడే గ్రామంలో అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
ఇదీ చదవండి: గ్యాంగ్‌స్టర్ హత్య: మరో భారతీయునికి జీవిత ఖైదు


