అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు | Video Captures Gunmen Opening Fire At Jordan Church Funeral | Sakshi
Sakshi News home page

అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

Oct 24 2026 8:58 AM | Updated on Oct 24 2026 9:00 AM

Video Captures Gunmen Opening Fire At Jordan Church Funeral

జోర్డాన్‌లో దారుణం చోటుచేసుకుంది. చర్చిలో అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో 40 మంది గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. రాజధాని అమ్మాన్‌కు దక్షిణంగా సుమారు 180 కిలోమీటర్ల దూరంలోని కరక్‌ నగరంలో ఉన్న గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలను జోర్డాన్‌ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.

ఆ దృశ్యాల్లో ఇద్దరు వ్యక్తులు పిస్టళ్లతో చర్చి వద్దకు వచ్చి కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది. అనంతరం సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌తో వచ్చిన మరో వ్యక్తి కూడా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ముగ్గురూ చర్చి వైపు పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఘటన తర్వాత సాక్షులు తీసిన వీడియోల్లో చర్చి నేలపై పగిలిన అద్దాలు, రక్తపు మరకలు కనిపించాయి.

చర్చిలో అంత్యక్రియలకు హాజరైన దోర్ఘమ్‌ హలాసా మాట్లాడుతూ.. కార్యక్రమం ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఒక్కసారిగా భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయని తెలిపారు. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారని చెప్పారు. ఆ సమయంలో పరిస్థితి చాలా విచిత్రంగా.. భయానకంగా ఉందని వివరించారు.

అయితే, తాను నేరుగా దుండగులను చూడలేదని హలాసా తెలిపారు. అక్కడ నలుగురు దుండగులు ఉన్నట్లు ఇతరులు చెప్పారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారన్న విషయాన్ని అసోసియేటెడ్‌ ప్రెస్‌ స్వతంత్రంగా నిర్ధారించలేకపోయింది. జోర్డాన్‌ భద్రతా సంస్థలు కూడా వెంటనే పూర్తి వివరాలను వెల్లడించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు జోర్డాన్‌ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దుండగులు ఎవరైనా పట్టుబడ్డారా? కాల్పుల్లో మరణించారా? అనేది మాత్రం వెల్లడించలేదు. ఘటనపై వేగంగా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.

ఈ ఘటనలో గాయపడిన 40 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని జోర్డాన్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఇబ్రహీం అల్‌ బుదూర్‌ తెలిపారు. దాడి నేపథ్యంలో దేశంలో మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించినట్లు జోర్డాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ పెట్రా వెల్లడించింది. కరక్‌ నగరంలో క్రైస్తవులు మైనారిటీ వర్గంగా ఉన్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ఉగ్ర దాడులు చోటుచేసుకున్నాయి.

2016లో కరక్‌లోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించే క్రూసేడర్‌ కోటతో పాటు పలు ప్రాంతాల్లో దుండగులు.. పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఆ ఘటనల్లో ఏడుగురు పోలీసు అధికారులతో సహా మొత్తం 10 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. అనంతరం భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి దుండగులను హతమార్చాయి.

ఇదీ చదవండి: ఇరాన్‌ బిగ్‌ ప్లాన్‌.. ట్రంప్‌ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement