అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడులకు సిద్ధమంటూ హెచ్చరించారు. మరో వైపు.. ఇంటర్నెట్ కేబుళ్లే టార్గెట్‌గా ఇరాన్.. ఈసారి యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే గల్ఫ్ సముద్రగర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లనే ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే జరిగితే యుద్ధ ప్రభావం కేవలం చమురు సరఫరాకే పరిమితం కాకుండా.. ప్రపంచ ఇంటర్నెట్ కనెక్టివిటీపై కూడా పడే ప్రమాదం ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామంటూ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. యుద్ధం ఏడో నెలకు చేరువవుతున్న వేళ.. అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఇరాన్ భద్రతా అధికారులు మీడియాకు వెల్లడించారు.
ఫ్లోరిడాలో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మనం మరో చిన్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టవచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా సైన్యం చేపట్టిన యుద్ధానికి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధాన్ని మళ్లీ తీవ్రతరం చేసే అవకాశాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
యుద్ధం కారణంగా అనిశ్చితి, పెరుగుతున్న ఇంధన ధరలు, మరోసారి దాడులు జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
శుక్రవారం అంతకుముందు వైట్‌హౌస్ సౌత్ లాన్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. యుద్ధాన్ని చాలా త్వరగా ముగించగలమంటూ వ్యాఖ్యానించారు. అయితే, వెంటనే యుద్ధాన్ని ముగించాలా? క్రమంగా దాని తీవ్రత తగ్గేలా వదిలేయాలా? అన్నది ప్రశ్నగా పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా కొనసాగుతోందని.. మనకు కావాల్సినవన్నీ లభిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ యుద్ధానికి సంబంధించి ట్రంప్.. గతంలో పలుమార్లు గడువులను ప్రకటించారు. వచ్చే నెలలో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వాటికి ముందు ఇరాన్‌పై దాడులు చేయబోమని ఈ నెల ప్రారంభంలో ఆయన వెల్లడించారు. అదే సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధికారులను ఉటంకిస్తూ.. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, అణు కేంద్రాలు, క్షిపణులు, డ్రోన్ల నిల్వలను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని పేర్కొంది.
ఇదీ చదవండి: అమెరికా దాడి చేస్తే.. ఇక అణ్వాయుధాలే


