అమెరికా దాడి చేస్తే.. ఇక అణ్వాయుధాలే | Iran MP wants permission to launch nuclear weapons against America | Sakshi
Sakshi News home page

అమెరికా దాడి చేస్తే.. ఇక అణ్వాయుధాలే

Oct 23 2026 9:15 PM | Updated on Oct 23 2026 9:21 PM

Iran MP wants permission to launch nuclear weapons against America

టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై ఎనిమిది నెలల కావస్తోన్నా ఇంకా యుద్ధం ముగింపు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ సీనియర్‌ ఎంపీ మహమ్మద్‌-సాలెహ్‌ జోకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తే అణ్వాయుధాలు ప్రయోగించేలా అనుమతివ్వాలని కోరారు.

ఇరాన్ పార్లమెంటు అంతర్గత వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మహమ్మద్-సాలెహ్ జోకర్  కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశ రక్షణ కోసం, శత్రువులను దాడి చేయకుండా నిరోధించేందుకు, అమెరికా ఇరాన్‌పై దాడి చేసిన సందర్భంలో అణ్వాయుధాల వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారులను కోరుతున్నాను” అని జోకర్ అన్నారు. 

అదే విధంగా అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) కింద కొనసాగుతున్న సహకారాన్ని కూడా ఇరాన్ నిలిపివేయాలని ఆయన అధికారులకు సూచించారు.

అంతేకాకుండా, ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సైన్యానికి తమ భూభాగాన్ని లేదా గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చే ఏ దేశమైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జోకర్ హెచ్చరించారు. అలాంటి దేశాలకు ఇరాన్ నుంచి “కఠినమైన ప్రతిస్పందన” ఉంటుందని, అవి “భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని” ఆయన స్పష్టం చేశారు.

అమెరికాతో ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ సీనియర్ అధికారులు వరుసగా చేస్తున్న హెచ్చరికల్లో జోకర్ వ్యాఖ్యలు తాజాగా చేరాయి. ఇరాన్‌పై తన లక్ష్యాలను పూర్తిచేసేందుకు మరోసారి దాడులు చేసే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

అబ్బాస్ అరాగ్చీ హెచ్చరిక
ఇదిలా ఉండగా, ఇరాన్‌పై తన లక్ష్యాలను పూర్తిచేయడానికి అమెరికా మరిన్ని సైనిక చర్యలు చేపట్టవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆదివారం స్పందించారు. గతంలో కూడా అమెరికా ఇరాన్‌పై దాడులు చేసి తన లక్ష్యాలను పూర్తిచేయాలని ప్రయత్నించిందని, అయితే ఆ తర్వాత ఇరాన్ మరింత బలంగా ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

“గతసారి మీరు ‘పని పూర్తిచేయాలని’ అనుకున్నప్పుడు, ఇరాన్ మరింత శక్తిమంతంగా బయటపడింది. మరోసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారా? రండి, స్వాగతం. అయితే జాగ్రత్తగా ఉండండి. మాకూ ఇంకా కొన్ని అసంపూర్తి పనులు ఉన్నాయి” అని అరాగ్చీ సామాజిక మాధ్యమంలో రాశారు.

ఇదీ చదవండి: దుండగుల కాల్పులు ఏడుగురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement