కుటుంబ సంప్రదాయంగా వచ్చిన ఓ బిర్యానీ రెసిపీని వ్యాపార అవకాశంగా మార్చుకుని కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. రమ్య రవి, శ్వేతా రవి 2020లో కేవలం రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఆర్‌ఎన్‌ఆర్ (RNR) దొన్నె బిర్యానీ ప్రస్తుతం సుమారు రూ.10 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది.
చిన్న క్లౌడ్ కిచెన్‌తో ప్రారంభం
తమ బామ్మ తయారు చేసే సంప్రదాయ కర్ణాటక శైలి దొన్నె బిర్యానీ రుచిని మరింత మందికి పరిచయం చేయాలనే ఆలోచనతో సోదరీమణులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలో నవంబర్ 2020లో బెంగళూరులో కేవలం 200 చదరపు అడుగుల క్లౌడ్ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. ఒక వంటమనిషి, ఇద్దరు సహాయకులతో మొదలైన ఈ వ్యాపారం తొలి నెలలోనే 10,000కు పైగా ఆర్డర్లను అందుకుంది.
ప్రత్యేకమైన ప్యాకేజింగ్‌తో గుర్తింపు
ఖరీదైన రెస్టారెంట్ ఏర్పాటు చేయడానికి బదులుగా, ఆహారాన్ని ఇంటికే అందించే విధానంపై సోదరీమణులు దృష్టి పెట్టారు. అరటి ఆకులో బిర్యానీని చుట్టి, ప్రత్యేకమైన టిన్ బాక్సుల్లో అందించడం ద్వారా తమ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. నాణ్యత, పరిశుభ్రత, రుచిలో స్థిరత్వానికి ప్రాధాన్యమిస్తూ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించారు.
ప్రస్తుతం ఆర్‌ఎన్‌ఆర్ దొన్నె బిర్యానీకి బెంగళూరులో 14 క్లౌడ్ కిచెన్లతో పాటు ఒక ప్రత్యేక రెస్టారెంట్ ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బిర్యానీతో పాటు చికెన్ నెయ్యి రోస్ట్, మటన్ బోన్ సూప్, ఎల్నీరు (కొబ్బరి నీళ్లు) పాయసం వంటి వంటకాలనూ అందిస్తున్నారు. కేవలం రూ.5 లక్షల పెట్టుబడితో మొదలైన ఈ ప్రయాణం, కుటుంబ వంటకానికి సరైన వ్యాపార నమూనా, నాణ్యత, వినియోగదారుల అభిరుచిని జోడిస్తే ఎంతటి అవకాశాలు సృష్టించవచ్చో చూపిస్తోంది.
ఇదీ చదవండి: బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవడమే పాపమా?


