కొలంబియా: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మరో పంజాబీ సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదు పడింది. 2022లో విస్లర్‌లోని ఓ హోటల్ వెలుపల బ్రదర్స్ కీపర్స్ గ్యాంగ్ సభ్యుడు మెనిందర్ ధాలివాల్, అతడి స్నేహితుడు సతీందర్ గిల్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో 29 ఏళ్ల గుర్‌సిమ్రన్ సాహోటాకు బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు రెండు జీవిత ఖైదులు విధించింది. ధాలివాల్ హత్యలో ఫస్ట్ డిగ్రీ, గిల్ హత్యలో సెకండ్ డిగ్రీ నేరం కింద శిక్ష ఖరారు చేసింది.
ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని న్యాయమూర్తి మిరియం గ్రాపర్ స్పష్టం చేశారు. 25 ఏళ్ల వరకు పెరోల్‌కు అర్హత ఉండదని వెల్లడించారు. అలాగే జీవితకాలం ఆయుధాలు కలిగి ఉండకుండా నిషేధం విధించడంతోపాటు డీఎన్‌ఏ నమూనా ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో మరో నిందితుడు తన్వీర్ ఖఖ్ (25)కు బుధవారం జీవిత ఖైదు విధించారు. అతడికి కూడా 25 ఏళ్ల వరకు పెరోల్ అవకాశం లేదు. 2022 జులై 24న జరిగిన ఈ హత్యలు గ్యాంగ్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో భాగమని కెనడా పోలీసులు నిర్ధారించారు. సెప్టెంబర్‌లో నాలుగు వారాల విచారణ అనంతరం జ్యూరీ ఇద్దరినీ దోషులుగా తేల్చింది.
ఇదీ చదవండి: Peru: 6.9 తీవ్రతతో భూకంపం.. వీధుల్లోకి జనం పరుగులు!


