ఛండీగఢ్: అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కొందరికి రాత్రికి రాత్రే కోట్లు వచ్చిపడితే.. మరికొందరికి ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఒక్క రూపాయి కూడా కలిసి రాదు. కానీ పంజాబ్‌కు చెందిన ఓ సాధారణ ట్రక్కు డ్రైవర్ కథ మాత్రం సినిమాను తలపిస్తోంది. పండుగ వచ్చిందంటే ఓ లాటరీ టికెట్ కొనడం ఆయనకు అలవాటు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. కుటుంబానికి కూడా తెలియకుండా కొనసాగించిన ఆ చిన్న అలవాటు.. చివరకు ఆయన జీవితాన్నే మార్చేసింది. కేవలం రూ.500 పెట్టి కొన్న టికెట్.. ఏకంగా రూ.12 కోట్ల సంపదను తెచ్చిపెట్టింది!
పంజాబ్‌లోని మొహాలీ జిల్లా డేరా బస్సీ ప్రాంతం హమ్యున్‌పూర్ గ్రామానికి చెందిన బల్జీందర్ సింగ్ వృత్తిరీత్యా ట్రక్కు డ్రైవర్. కొద్దిపాటి వ్యవసాయం కూడా చేస్తుంటారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఆయనకు 2010 నుంచి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంది. ఏ పండుగ వచ్చినా లాటరీ టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఎప్పటికైనా తనకూ అదృష్టం కలిసివస్తుందని ఆశపడేవారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా కొనసాగించారు.
#WATCH | Chandigarh: Baljinder Singh, a 45-year-old tipper driver from Hamayunpur village in Dera Bassi, wins the Rs 12 crore first prize in the Punjab State Dear Diwali Bumper 2026 lottery after buying a Rs 500 ticket from Handesra. He says, "I bought the ticket on November 10. I found out yesterday. I have been playing the lottery for 15 years. I had faith in God that I would win, and God has heard my prayers. I drive a tipper truck for a living, and we also do farming. I have two children, a younger brother, my father, and my wife. I want to do something for my children's future."
— ANI (@ANI) November 17, 2026
రూ.500 టికెట్.. రూ.12 కోట్ల సంచలనం!
ఈ ఏడాది దీపావళి సందర్భంగా కూడా బల్జీందర్ తన పాత అలవాటును కొనసాగించారు. మొహాలీలోని జిరాక్‌పూర్‌లో ఓ లాటరీ దుకాణానికి వెళ్లి రూ.500 పెట్టి దీపావళి బంపర్ టికెట్ కొనుగోలు చేశారు. ఆ టికెట్ తన జీవితంలోనే అతిపెద్ద మలుపు తీసుకొస్తుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. నవంబర్ 16న పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్-2026 లాటరీ డ్రా నిర్వహించారు. సోమవారం రాత్రి ఫలితాలు తెలుసుకున్న బల్జీందర్‌కు ఒక్కసారిగా నమ్మలేని వార్త ఎదురైంది. తాను కొనుగోలు చేసిన టికెట్‌కే మొదటి బహుమతి వచ్చిందని తెలిసింది. బహుమతి మొత్తం అక్షరాలా రూ.12 కోట్లు. 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అదృష్టం ఒక్కసారిగా ఆయన ఇంటి తలుపు తట్టింది.
పిల్లల చదువులకే తొలి ప్రాధాన్యం
ఈ ఆనందకర వార్తను తెలుసుకున్న బల్జీందర్ మంగళవారం లాటరీ కార్యాలయానికి వెళ్లి బహుమతి క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. ఇంత పెద్ద మొత్తం చేతికి వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా.. తన ఇద్దరు పిల్లల చదువుల కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేస్తానని చెప్పారు. ఇక ఆయన అదృష్టం గురించి గ్రామంలో తెలియడంతో హమ్యున్‌పూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. బల్జీందర్ ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
ఇదీ చదవండి: విధుల్లో ఉండగా సెల్‌ఫోన్లు వాడొద్దు


