విజేతకు బహుమానం రూ. కోటి
ప్రకటించిన పంజాబ్ సీఎం మాన్
చండీగఢ్: పంజాబ్ యువత కోసం కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)లాంటి క్విజ్ పోటీని నిర్వహించనున్నట్లు సీఎం భగవంత్ సింగ్ మాన్ శనివారం ప్రకటించారు. విజేతలకు రూ.కోటి నగదు బహుమతిని అందజేస్తామన్నారు. పంజాబ్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్వరూపం, గణితం, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో పాల్గొనే వారి విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేస్తామన్నారు. 15–30 ఏళ్ల మధ్య వయస్సు వారు ‘పంజాబ్ దా కరోడ్‌పతి’లో పాల్గొనేందుకు అర్హులని వివరించారు.
రన్నరప్‌గా నిలిచే నలుగురికి రూ.10 లక్షల చొప్పున, టాప్‌లో నిలిచే 8 మంది పోటీదారులకు రూ.5 లక్షలు చొప్పున, మరో 10 వేల మందికి కూడా బహుమతులను అందజేస్తామని సీఎం చెప్పారు. మొత్తం 11 రౌండ్లలో పోటీ ఉంటుందని, 9 రౌండ్లు ఆన్‌లైన్‌లోనూ, మిగతా రెండు రౌడ్లు ప్రత్యక్ష విధానంలోనూ పోటీ జరుగుతుందని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే వివిధ ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో వచ్చే ప్రశ్నలే ఈ క్విజ్‌లో ఉంటాయని, మొత్తం 50 వేల ప్రశ్నలను ఇందుకు గాను ఎంపిక చేశామని చెప్పారు. పదో రౌండ్‌ను డిసెంబర్ 17వ తేదీన 23 జిల్లాల్లో నిర్వహించి, గ్రాండ్ ఫినాలేకు టాపర్లను ఎంపిక చేస్తామన్నారు.


