ఢిల్లీ: ఉపగ్రహాల కంటికి చిక్కకుండా సాయంత్రం వేళల్లో పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాలు జరుగుతున్నట్లు నాసా శాస్త్రవేత్త హిరెన్ జెత్వా వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు పంజాబ్-హర్యానాలో సుమారు 34,000 పంట దహనాలు జరిగాయని నాసా శాస్త్రవేత్త బయటపెట్టారు. సాంప్రదాయ ఉపగ్రహాలు (మోడిస్, విఐఆర్‌ఎస్) మధ్యాహ్నం 1:30 గంటల సమయంలోనే పరిశీలన చేస్తున్నందున తక్కువగా లెక్కలు ఉన్నాయని.. ఉపగ్రహాలకు దొరకకుండా సాయంత్రం 4-5 గంటలకు పొలాలను రైతులు కాలుస్తున్నట్లు గుర్తించారు. చాలా ఘటనలు ఉప గ్రహాలు గుర్తించలేక పోతునట్లు తేలింది.
అధికారిక గణాంకాల కంటే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయని నాసా శాస్త్రవేత్త హిరెన్ జెత్వా హెచ్చరించారు. అధికారిక సంస్థ సీఏక్యూఎం గణాంకాల ప్రకారం పంజాబ్‌లో ఈ సీజన్‌లో 4,459 పంట దహనాల మాత్రమే నమోదయ్యాయి. నాసా శాస్త్రవేత్త లెక్కల ప్రకారం అక్టోబర్ 1 నుంచి నవంబర్ 9 వరకు పంజాబ్-హర్యానాలో సుమారు 34,000 పంట దహనాలు జరిగినట్లు తేలింది. పంజాబ్‌లో తరన్ తరణ్ జిల్లాలో అత్యధికంగా 654 అగ్ని ప్రమాదాలు నమోదు కాగా, అధికారులు 1,228 కేసుల్లో జరిమానాలు విధించగా.. 884 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు మరోసారి శీతాకాలంలో కాలుష్యంలో చిక్కుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాంతంలో కాలానుగుణంగా వాయు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన పంట వ్యర్థాల దహనం తీవ్రత.. అధికారిక గణాంకాలు సూచిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టడంలో పురోగతి సాధించామని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నప్పటికీ.. ఈ సీజన్‌లో అధికారిక సంస్థలు ఇప్పటివరకు 4,459 పొలాల్లో మంటలు చెలరేగినట్లు నమోదు చేశాయి. అయితే, నాసా శాస్త్రవేత్త ఉపగ్రహ ఆధారంగా చేపట్టిన పరిశోధన ప్రకారం వాస్తవ సంఖ్య దీనికి అనేక రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది.
నవంబర్ 8 వరకు ఉన్న సీఏక్యూఎం నివేదిక ప్రకారం.. ఈ సీజన్‌లో పంజాబ్‌లో 4,459 పంట వ్యర్థాల దహనం ఘటనలు నమోదయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తర్న్‌తరన్‌లో అత్యధికంగా 654 పంట వ్యర్థాల దహనం ఘటనలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఫిరోజ్‌పూర్‌లో 592, సంగ్రూర్‌లో 488, బటిండాలో 406, పాటియాలాలో 288 ఘటనలు నమోదయ్యాయి. క్షేత్రస్థాయి తనిఖీల్లో తర్న్‌తరన్‌లో 306 ప్రాంతాల్లో, ఫిరోజ్‌పూర్‌లో 247 ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టినట్లు ఆధారాలు గుర్తించారు.
ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వివాదం.. ఎవరీ అలిస్ హువాంగ్?


