మాన్సా: పంజాబ్‌లోని ఓ కుటుంబానికి నిన్నటి దీపావళి జీవితంలోనే మరిచిపోలేని పండుగగా మారింది. అదృష్టం తలుపు తట్టి ఏకంగా రూ.1.5 కోట్లను ఇచ్చింది. ఇంతటితో ఆ కుటుంబపు ఆనందాల వెల్లువ ఆగలేదు. కోట్ల రూపాయల లాటరీ గెలిచిన రోజే ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఒకే రోజు రెండు అపురూపమైన శుభవార్తలు ఆ కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తాయి.
పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. బుఢ్లాడా సమీపంలోని సైదేవాలా గ్రామానికి చెందిన హర్మన్ కౌర్ పేరుతో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. భీఖీ రోడ్డులో ధన్నా సింగ్ నిర్వహిస్తున్న లాటరీ స్టాల్‌లో రూ.200 విలువైన నెలవారీ లాటరీ టికెట్ తీసుకున్నాడు. శనివారం ఓ వ్యక్తి హర్మన్ కౌర్ పేరుతో ఈ టికెట్ కొనుగోలు చేసినట్లు స్టాల్ నిర్వాహకుడు ధన్నా సింగ్ వెల్లడించారు.
రూ.200 టికెట్‌తో కోటికి పైగా బహుమతి!
లాటరీ ఫలితాల్లో హర్మన్ కౌర్ పేరుతో కొనుగోలు చేసిన టికెట్‌కు ఏకంగా రూ.1.5 కోట్ల మొదటి బహుమతి దక్కింది. అయితే ఈ ఆనందకరమైన సందర్భంలో చిన్న ఆందోళన కూడా ఎదురైంది. పుట్టిన పాప ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల కోసం చిన్నారిని తీసుకెళ్లారు. ఈ భారీ బహుమతి గెలుచుకున్న కుటుంబాన్ని లాటరీ స్టాల్‌కు ఆహ్వానించి, సత్కరిస్తామని నిర్వాహకుడు ధన్నా సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: రియాద్‌పై హౌతీల దాడి.. సౌదీలో హై అలర్ట్!


