దీపావళి వేళ స్వీట్లపై తేనెటీగల దండు దాడి.. అందరూ నిస్సహాయులే | Feast For Bees At Haryana Sweet Shop Owner Suffers Rs 2 Lakh Loss | Sakshi
Sakshi News home page

దీపావళి వేళ స్వీట్లపై తేనెటీగల దండు దాడి.. అందరూ నిస్సహాయులే

Nov 9 2026 8:18 PM | Updated on Nov 9 2026 8:28 PM

Feast For Bees At Haryana Sweet Shop Owner Suffers Rs 2 Lakh Loss

దీపావళి పండుగ వేళ హరియాణాలోని ఓ స్వీట్‌ షాపు యజమానికి ఊహించని నష్టం ఎదురైంది. దుకాణం బయట విక్రయానికి ఉంచిన స్వీట్లపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో సుమారు రూ.2 లక్షల విలువైన స్వీట్లు నష్టపోయినట్లు యజమాని తెలిపాడు. తేనెటీగల కారణంగా వినియోగదారులు కూడా దుకాణం వైపు వెళ్లేందుకు భయపడ్డారు.

హరియాణాలోని ఫతేహాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వీట్ల విక్రయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఫతేహాబాద్‌లోని థానా రోడ్డులో ఫవారా చౌక్ సమీపంలో ఓ దుకాణం యజమాని ప్రత్యేకంగా బయట స్టాల్ ఏర్పాటు చేశాడు. వివిధ రంగుల్లో ఉన్న స్వీట్లను విక్రయానికి సిద్ధంగా ఉంచాడు. వాటిలో చాలా వరకు పంచదార పాకంలో ముంచిన స్వీట్లు ఉన్నాయి.

అయితే, స్వీట్ల నుంచి వెలువడిన వాసనకు ఆకర్షితమైన పెద్ద సంఖ్యలో తేనెటీగలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నాయి. బయట స్టాల్‌లో ఉంచిన స్వీట్లపై వాలడంతోపాటు వాటిపై ఉన్న పాకాన్ని తినడం ప్రారంభించాయి. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. తేనెటీగల గుంపును చూసిన వినియోగదారులు దుకాణం దగ్గరకు వెళ్లేందుకు వెనుకాడారు.

తరిమేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో పెద్ద సంఖ్యలో తేనెటీగలు స్వీట్ల ట్రేలపై వాలడం కనిపిస్తోంది. ఒక్కో ట్రేపై గుంపులుగా చేరి స్వీట్లపై తిరుగుతున్నాయి. దీంతో గులాబీ, గోధుమ, తెలుపు రంగుల్లో ఉన్న స్వీట్లు కూడా కనిపించనంతగా తేనెటీగలు కప్పేశాయి. వాటిని తరిమేందుకు దుకాణంలోని ఓ ఉద్యోగి ప్రయత్నించాడు. అయినప్పటికీ అవి అక్కడి నుంచి వెళ్లలేదు. చివరకు బొగ్గు పొగ పెట్టి తరిమేందుకు కూడా సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.

తేనెటీగల దాడితో చుట్టుపక్కల కొనుగోళ్లకు వచ్చిన వినియోగదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఎవరూ స్వీట్లు కొనుగోలు చేసేందుకు దుకాణానికి రాలేదని యజమాని తెలిపాడు. దీపావళికి కొద్దిసేపటి ముందే ఈ ఘటన జరగడంతో దుకాణ యజమానితోపాటు స్వీట్లు తయారుచేసే సిబ్బంది కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పండుగ సమయంలో మంచి అమ్మకాలు జరుగుతాయని ఆశించిన వ్యాపారికి ఈ ఘటన ఆర్థికంగా పెద్ద దెబ్బ తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement