సాక్షి, ముంబై: ముంబై బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సంచలన నిర్ణయంం తీసుకుంది. దీపావళి సందర్భంగా చోటుచేసుకున్న వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో, ముంబై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నగరంలో రాకెట్లు ,ఆకాశంలో పేలే బాణసంచా కాల్చడాన్ని నిషేధించింది. ఈ నిషేధం నవంబర్ 9 నుండి నవంబర్ 25 రాత్రి 11:59 గంటల వరకు అమల్లో ఉంటుందని బీఎంసీ ప్రకటించింది.
బీఎంసీ పరిధిలోని అన్ని నివాస భవనాలు, భవనాల పైకప్పులు (రూఫ్‌టాప్‌లు), బాల్కనీలు ,మురికివాడల ప్రాంతాల్లో ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అలాగే రాకెట్ల , ఆకాశంలో పేలే టపాసులు తప్ప మిగిలిన సాధారణ బాణసంచా కాల్చడం మునుపటి చట్టాలు, కోర్టుల నిబంధనలకు లోబడి ఉంటుంది. అదనపు మున్సిపల్ కమిషనర్ ప్రాజక్తా వర్మ-లవాంగరే జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, ఆకాశంలోకి ఎగిరే రాకెట్లు గృహాల బాల్కనీలు, విండోలు లేదా సులభంగా మంటలు అంటుకునే పదార్థాలపై పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. భారీ జనాభా, ఎత్తైన భవనాలు, ఇరుకైన రహదారులు ఉన్న ముంబైలో ఇటువంటి ప్రమాదాలు ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాలికపై హత్యాచారం : నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం
పౌరులు బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని, నివాస ప్రాంతాల వద్ద బాణసంచా కాల్చొద్దని ముంబై మేయర్ రీతు తవ్డే విజ్ఞప్తి చేశారు. అలాగే రాకెట్ల వల్ల ఇళ్లలో అగ్నిప్రమాదాలు కలిగించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన (UBT) నాయకుడు ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు.
దీపావళి రాత్రి నగరంలో చోటుచేసుకున్న మూడు భారీ అగ్నిప్రమాదాలలో పలు గుడిసెలు, దుకాణాలు, ఒక గ్యారేజీ మరియు ఒక వాణిజ్య భవనంలోని భాగాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టా, పిక్నిక్ స్పాటా!? హర్ష్ గోయెంకా అసహనం


