త్వరలో నాలుగు కోచ్‌ల రైళ్లు ఆరు కోచ్‌లుగా మార్పు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంఎంఓపీఎల్ నిర్ణయం
నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం అంగీకారం
దాదర్: ముంబైలోని వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్ మెట్రో–1 మార్గంలో ప్రయాణించే రైళ్లకు త్వరలో అదనంగా రెండు కోచ్‌లు జోడించనున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నాలుగు కోచ్‌లతో నడుస్తున్న రైళ్లను ఆరు కోచ్‌లుగా మార్చాలని ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కొత్త కోచ్‌ల కొనుగోలుకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు సంస్థ వెల్లడించింది. నిధులు అందిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించనుంది.
మెట్రో–1తో దాదర్ స్టేషన్‌పై రద్దీ తగ్గుదల
వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్ మెట్రో–1 మార్గం 11.4 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. 2014, జూన్ 8న ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ మార్గంలో ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాల నుంచి వచ్చే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ మెట్రో మార్గం ఎంతో కీలకంగా మారింది. గతంలో రైల్వే మార్గాలు మారేందుకు దాదర్ స్టేషన్ వరకు రావాల్సి ఉండేది. మెట్రో–1 అందుబాటులోకి వచ్చిన తరువాత అంధేరీ, ఘాట్కోపర్ ప్రాంతాల్లోనే రైళ్లు మారే సౌకర్యం ఏర్పడింది. దీంతో దాదర్ స్టేషన్‌పై ప్రయాణికుల రద్దీ కొంతమేర తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతోంది.
ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా..
ప్రస్తుతం ఈ మార్గంలో నాలుగు కోచ్‌లతో కూడిన రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. మరోవైపు ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతుండటంతో రద్దీ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనంగా రెండు కోచ్‌లు జోడించాలని పలువురు ప్రయాణికులు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ముంబై, ఉపనగరాల్లోని ఇతర మెట్రో మార్గాల్లో ఆరు లేదా ఎనిమిది కోచ్‌ల రైళ్లు నడుస్తుండగా, మెట్రో–1లో మాత్రం ఇప్పటికీ నాలుగు కోచ్‌ల రైళ్లే సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి రైలుకు మరో రెండు కోచ్‌లు జోడించి ఆరు కోచ్‌లతో నడపాలని ఎంఎంఓపీఎల్ ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: సముద్రంపైనా ప్రకటనల తెరలు
నిధులు అందగానే కొత్త కోచ్‌ల కొనుగోలు
మెట్రో–1 ప్రాజెక్టు నిర్వహణ, రైళ్ల రాకపోకల నియంత్రణ బాధ్యతలను ఎంఎంఓపీఎల్ నిర్వహిస్తోంది. అదనపు కోచ్‌ల కొనుగోలుకు గతంలోనే ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అయితే నిధుల కొరత కారణంగా కొత్త కోచ్‌ల కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగలేదు. పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపిన అనంతరం నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. భవిష్యత్తులో ఈ మార్గంలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఆరు నుంచి ఏడు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌లు అందుబాటులోకి వస్తే రైళ్ల ప్రయాణ సామర్థ్యం పెరగడంతో పాటు రద్దీ సమయాల్లో ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం లభించనుంది.


