సముద్రంపైనా ప్రకటనల తెరలు  | Maharashtra Plans Floating Billboards Along Mumbai Coastline | Sakshi
Sakshi News home page

సముద్రంపైనా ప్రకటనల తెరలు 

Nov 3 2026 5:54 AM | Updated on Nov 3 2026 5:54 AM

Maharashtra Plans Floating Billboards Along Mumbai Coastline

మహారాష్ట్ర మారిటైమ్‌ బోర్డ్‌ (ఎంఎంబీ) నిర్ణయంపై మండిపడుతున్న ప్రజలు 

ముంబై: ముంబై అనగానే గుర్తొచ్చేది సముద్రం.. చల్లని గాలి, గాలిలో ఉప్పు వాసన. ప్రతి సాయంత్రం ఆ ప్రకాశవంతమైన సముద్రంలో సూర్యుడు అస్తమించడం.. సూర్యాస్తమయం తర్వాత, అనుభవం మారిపోతుంది. చిక్కటి నల్లని సముద్రానికి అడ్డంగా, వెండి మేఘాలు నెమ్మదిగా నగరం వైపు తేలుతూ వస్తాయి. మెరైన్‌ డ్రైవ్, వర్లీ, దాదర్, శాంతాక్రూజ్, జుహు లేదా ఉత్తరాన ఉన్న రాతి, ఇసుక తీరాలలో సమయం గడిపిన వారికి, ఈ సముద్రం దాదాపు ధ్యానం చేసిన అనుభూతినిస్తుంది. 

ఇక వర్షాకాలంలో, ఆకాశంలో మేఘాలు గుమిగూడి నగరం వైపు కదులుతాయి. ఇది కూడా ఒక అరుదైన దృశ్యం. నగరపు హడావిడి, విభజనలు, అధికార పోరాటాల నుంచి ముంబై వాసులకు ఉపశమనాన్ని ఇచ్చేది విశాల సముద్రమే. నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఈ వ్యూ ఉండదు. ఈ దృశ్యం కోసమే.. ముంబై తీరప్రాంతంలో, 400 చదరపు అడుగుల పరిమాణంలో ఉండే అపార్ట్‌మెంట్ల ఫ్లాట్స్‌ ధరలు కోట్లలో ఉంటాయి. 

ఈ ప్రకృతి రమణీయత కోసం కోట్లు పెట్టి.. సీవ్యూ అపార్ట్‌మెంట్లలో ఇళ్లు కొనుక్కుంటారు.  కానీ నిరాటంకమైన ఈ సముద్ర దృశ్యానికి తెరపడనుంది. ఈ సహజ దృశ్యాలను దూరం చేస్తూ, సీవ్యూను తేలియాడే ఎల్‌ఈడీ ప్రకటనలు ఆక్రమించనున్నాయి. సముద్రాన్ని కూడా వాణిజ్య ప్రదేశంగా మార్చే ప్రణాళిక జరుగుతోంది. ప్రముఖ సముద్ర తీర ప్రాంతాలలో తేలియాడే ప్రకటనలను అనుమతించాలన్న మహారాష్ట్ర మారిటైమ్‌ బోర్డ్‌ (ఎంఎంబీ)నిర్ణయం తీసుకుంది. 

ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం అంతటా ప్రకటనల ఏర్పాటు కోసం ఎంఎంబీ సెప్టెంబర్‌లో 19 టెండర్లను జారీ చేసింది. ప్రకటనల ప్రతిపాదిత ప్రదేశాల్లో జుహు బీచ్, లోటస్‌ జెట్టీ, వర్లీలోని బాంద్రా–వర్లీ సీ లింక్‌ జెట్టీ, కార్టర్‌ రోడ్, మార్వే జెట్టీ ఉన్నాయి. ప్రామాణిక ప్రకటనల ప్రదర్శన సుమారు 40 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు ఉంటుంది. ఎంఎంబీ నిర్ణయాన్ని తీరప్రాంతంలో ఉండే ప్రజలు, కాంక్రీట్‌ జంగల్‌నుంచి ఉపశమనం కోసం సముద్ర తీరాలను సందర్శించే ముంబై వాసులు విమర్శిస్తున్నారు. 

తమ జీవిత పొదుపు మొత్తాన్ని వెచ్చించి, దశాబ్దాల పాటు ఈఎంఐలు చెల్లిస్తూ ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఈ నిర్ణయం మరింత బాధ కలిగిస్తోంది. అయితే, ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో హోర్డింగ్‌ టెండర్లను వక్రీకరించారని, ప్రతిపాదించిన నాలుగు ఫ్లోటింగ్‌ హోర్డింగ్‌ల్లో, రెండు సీ లింక్‌ సమీపంలో ఇప్పటికే ఉన్న నిర్మాణాలు కాగా, రెండు మాత్రమే కొత్తవని ఓడరేవుల శాఖ మంత్రి, ఎంఎంబీ ఛైర్మన్‌ నితేష్‌ రానా అన్నారు. అయితే, ఒక్క ప్రకటనైనా సరే.. సముద్రతీరాన్ని పాడుచేస్తుందని స్థానికులు అంటున్నారు.  

సముద్రాన్నీ అమ్మేస్తున్నారు.. 
శబ్ద కాలుష్యంలాగే కాంతి కాలుష్యం ప్రమాదకరమైనది. ఈ స్క్రీన్ల నుంచి వెలువడే ఎల్‌ఈడీ కాంతి సముద్ర ఉపరితలం నుంచి 40 మీటర్ల లోతు వరకు చేరుతుంది. అది సముద్ర జీవరాశికి, దానితో పాటు మొత్తం సముద్ర ఆహార గొలుసుకు అంతరాయం కలిగిస్తుంది. నీటిపై ఒక్క బిల్‌బోర్డ్‌ ఉన్నా అది కూడా ఎక్కువే. దాదాపు ప్రతి ఖాళీ స్థలానికి వెల నిర్ణయించబడిన నగరంలో, ప్రజలు ఏమీ కొనకుండా నేరుగా చూడగలిగే అతికొద్ది ప్రదేశాల్లో సముద్రం ఒకటి. కానీ ఇప్పుడు, దీన్ని కూడా అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.’ 
    – సుమైరా అబ్దులాలీ, పర్యావరణవేత్త  

ప్రకటనలను ఆపాలి: సీఎం ఫడ్నవిస్‌కు ఆదిత్య ఠాక్రే లేఖ 
ఈ ప్రతిపాదనను ఆపాలని కోరుతూ శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. ‘ఈ నిర్ణయం అత్యంత బాధ్యతారహితమైనది. ముంబై సౌందర్యాన్ని పాడుచేసేది. కాలుష్యం కారణంగా ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల నుంచి సముద్రాన్ని చూడటం కష్టంగా మారింది. తేలియాడే ప్రకటనలు మిగిలిన దృశ్యాలను కూడా అడ్డుకుంటాయి. హోర్డింగ్‌ కాంట్రాక్టర్లకు మద్దతు ఇచ్చే ఈ అసంబద్ధమైన నిర్ణయం’అని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement