breaking news
mumbai sea area
-
సముద్రంపైనా ప్రకటనల తెరలు
ముంబై: ముంబై అనగానే గుర్తొచ్చేది సముద్రం.. చల్లని గాలి, గాలిలో ఉప్పు వాసన. ప్రతి సాయంత్రం ఆ ప్రకాశవంతమైన సముద్రంలో సూర్యుడు అస్తమించడం.. సూర్యాస్తమయం తర్వాత, అనుభవం మారిపోతుంది. చిక్కటి నల్లని సముద్రానికి అడ్డంగా, వెండి మేఘాలు నెమ్మదిగా నగరం వైపు తేలుతూ వస్తాయి. మెరైన్ డ్రైవ్, వర్లీ, దాదర్, శాంతాక్రూజ్, జుహు లేదా ఉత్తరాన ఉన్న రాతి, ఇసుక తీరాలలో సమయం గడిపిన వారికి, ఈ సముద్రం దాదాపు ధ్యానం చేసిన అనుభూతినిస్తుంది. ఇక వర్షాకాలంలో, ఆకాశంలో మేఘాలు గుమిగూడి నగరం వైపు కదులుతాయి. ఇది కూడా ఒక అరుదైన దృశ్యం. నగరపు హడావిడి, విభజనలు, అధికార పోరాటాల నుంచి ముంబై వాసులకు ఉపశమనాన్ని ఇచ్చేది విశాల సముద్రమే. నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఈ వ్యూ ఉండదు. ఈ దృశ్యం కోసమే.. ముంబై తీరప్రాంతంలో, 400 చదరపు అడుగుల పరిమాణంలో ఉండే అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ ధరలు కోట్లలో ఉంటాయి. ఈ ప్రకృతి రమణీయత కోసం కోట్లు పెట్టి.. సీవ్యూ అపార్ట్మెంట్లలో ఇళ్లు కొనుక్కుంటారు. కానీ నిరాటంకమైన ఈ సముద్ర దృశ్యానికి తెరపడనుంది. ఈ సహజ దృశ్యాలను దూరం చేస్తూ, సీవ్యూను తేలియాడే ఎల్ఈడీ ప్రకటనలు ఆక్రమించనున్నాయి. సముద్రాన్ని కూడా వాణిజ్య ప్రదేశంగా మార్చే ప్రణాళిక జరుగుతోంది. ప్రముఖ సముద్ర తీర ప్రాంతాలలో తేలియాడే ప్రకటనలను అనుమతించాలన్న మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ (ఎంఎంబీ)నిర్ణయం తీసుకుంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా ప్రకటనల ఏర్పాటు కోసం ఎంఎంబీ సెప్టెంబర్‌లో 19 టెండర్లను జారీ చేసింది. ప్రకటనల ప్రతిపాదిత ప్రదేశాల్లో జుహు బీచ్, లోటస్ జెట్టీ, వర్లీలోని బాంద్రా–వర్లీ సీ లింక్ జెట్టీ, కార్టర్ రోడ్, మార్వే జెట్టీ ఉన్నాయి. ప్రామాణిక ప్రకటనల ప్రదర్శన సుమారు 40 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు ఉంటుంది. ఎంఎంబీ నిర్ణయాన్ని తీరప్రాంతంలో ఉండే ప్రజలు, కాంక్రీట్ జంగల్నుంచి ఉపశమనం కోసం సముద్ర తీరాలను సందర్శించే ముంబై వాసులు విమర్శిస్తున్నారు. తమ జీవిత పొదుపు మొత్తాన్ని వెచ్చించి, దశాబ్దాల పాటు ఈఎంఐలు చెల్లిస్తూ ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఈ నిర్ణయం మరింత బాధ కలిగిస్తోంది. అయితే, ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో హోర్డింగ్ టెండర్లను వక్రీకరించారని, ప్రతిపాదించిన నాలుగు ఫ్లోటింగ్ హోర్డింగ్‌ల్లో, రెండు సీ లింక్ సమీపంలో ఇప్పటికే ఉన్న నిర్మాణాలు కాగా, రెండు మాత్రమే కొత్తవని ఓడరేవుల శాఖ మంత్రి, ఎంఎంబీ ఛైర్మన్ నితేష్ రానా అన్నారు. అయితే, ఒక్క ప్రకటనైనా సరే.. సముద్రతీరాన్ని పాడుచేస్తుందని స్థానికులు అంటున్నారు. సముద్రాన్నీ అమ్మేస్తున్నారు.. శబ్ద కాలుష్యంలాగే కాంతి కాలుష్యం ప్రమాదకరమైనది. ఈ స్క్రీన్ల నుంచి వెలువడే ఎల్ఈడీ కాంతి సముద్ర ఉపరితలం నుంచి 40 మీటర్ల లోతు వరకు చేరుతుంది. అది సముద్ర జీవరాశికి, దానితో పాటు మొత్తం సముద్ర ఆహార గొలుసుకు అంతరాయం కలిగిస్తుంది. నీటిపై ఒక్క బిల్బోర్డ్ ఉన్నా అది కూడా ఎక్కువే. దాదాపు ప్రతి ఖాళీ స్థలానికి వెల నిర్ణయించబడిన నగరంలో, ప్రజలు ఏమీ కొనకుండా నేరుగా చూడగలిగే అతికొద్ది ప్రదేశాల్లో సముద్రం ఒకటి. కానీ ఇప్పుడు, దీన్ని కూడా అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.’ – సుమైరా అబ్దులాలీ, పర్యావరణవేత్త ప్రకటనలను ఆపాలి: సీఎం ఫడ్నవిస్‌కు ఆదిత్య ఠాక్రే లేఖ ఈ ప్రతిపాదనను ఆపాలని కోరుతూ శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. ‘ఈ నిర్ణయం అత్యంత బాధ్యతారహితమైనది. ముంబై సౌందర్యాన్ని పాడుచేసేది. కాలుష్యం కారణంగా ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల నుంచి సముద్రాన్ని చూడటం కష్టంగా మారింది. తేలియాడే ప్రకటనలు మిగిలిన దృశ్యాలను కూడా అడ్డుకుంటాయి. హోర్డింగ్ కాంట్రాక్టర్లకు మద్దతు ఇచ్చే ఈ అసంబద్ధమైన నిర్ణయం’అని విమర్శించారు. -
నిర్లక్ష్యానికి మూల్యం!
సంపాదకీయం మన తీరప్రాంత రక్ష క వ్యవస్థ పటిష్టతను ప్రశ్నార్థకంచేస్తూ మరో ప్రమాదం జరిగింది. ముంబై తీరప్రాంతంలో బుధవారం జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్నలో మంటలు చెలరేగి ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన వెనువెంబడే జరిగిన మరో అసాధారణ ఉదంతం కూడా అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ప్రమాదానికి నైతిక బాధ్యతవహిస్తూ నావికాదళ ప్రధానాధికారి చీఫ్ అడ్మిరల్ డీకే జోషి తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెనువె ంటనే ఆ రాజీనామా ఆమోదం కూడా పొందింది. గత ఆరునెలల కాలంలో నావికాదళంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం ఇది పదోసారి. ఇందులో మూడు ప్రమాదాలు జలాంతర్గాములకు సంబంధించినవి. గత ఏడాది ఆగస్టులో జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురక్షక్లో పేలుళ్లు సంభవించి 18మంది నావికాదళ సిబ్బంది మరణించారు. అటు తర్వాత వరసబెట్టి చిన్నా పెద్దా ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మన దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మలచడానికి త్రివిధ దళాల సిబ్బంది అత్యంత క్లిష్టమైన పరిస్థితులమధ్య అను నిత్యమూ ప్రమాదాలతో సావాసం చేస్తున్నారు. అలాంటివారికి అవసరమైన అత్యాధునిక సామగ్రిని అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న పర్యవసానంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రక్షణ దళాల్లో చేరేవారు ఆ బాధ్యతల్లో ఇమిడివున్న ప్రమాదాలేమిటో, పొంచివున్న ప్రాణాంతక పరిణామాలేమిటో తెలుసుకునే అందులో చేరతారు. శత్రువుతో తలపడే క్రమంలో ఎదురయ్యే ఇలాంటివాటన్నిటినీ వారు ఎదుర్కోవడానికి సిద్ధమే. కానీ, ప్రాణాలను పణంగా పెట్టే పనిలో ఉన్నారు గనుక వారిని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టడమో లేదా అలాంటి పరిస్థితులున్నా పట్టించుకోక పోవడమో చేస్తే వారు ఎవరికి చెప్పుకోవాలి? రక్షణ దళాల అవసరాలపై పాలకుల్లో ఉన్న నిర్లక్ష్య ధోరణి, నిర్ణయరాహిత్యమూ, దాదాపు ప్రతి రక్షణ ఒప్పందంలోనూ చోటుచేసుకుంటున్న కుంభకోణాలు... ఇవన్నీ ప్రమాదాలకు హేతువులవుతున్నాయి. వాస్తవాలు ఇవికాగా, వీటిలో ఏ ఒక్కదాని తోనూ సంబంధమూలేని చీఫ్ అడ్మిరల్ డీకే జోషి రాజీనామా చేయాల్సిరావడం బాధాకరమైన విషయం. అయితే, రక్షణ దళాల అవసరాలను తీర్చడంలో అత్యంత మందకొడిగా వ్యవహరిస్తున్నట్టు అపఖ్యాతిపాలైన యూపీఏ ప్రభుత్వం ఆయన రాజీనామాను మాత్రం ఆగమేఘాలమీద ఆమోదించింది! డీకే జోషి 38 సంవత్సరాల సర్వీసు కాలమంతా మచ్చలేనిది. యుద్ధ నౌకలను ముందుండి నడిపించడంలోనూ, శత్రు జలాంతర్గాముల పనిపట్టడంలోనూ ఆయన చరిత్ర ఉన్నతమైనది. ఇటు రక్షణమంత్రి ఏకే ఆంటోనీకి కూడా నిజాయితీపరుడన్న పేరుంది. కానీ, రక్షణరంగ అవసరాలను పట్టించుకోవడంలో, తీర్చడంలో ఈ నిజాయితీ అక్కరకు రాలేదు. ఏ జలాంతర్గామినైనా రెండు దశాబ్దాలకు మించి వాడకూడదని నిపుణులు చెబుతారు. ఆ ప్రమాణాలతో తూకంవేసి చూస్తే మన నావికాదళానికున్న 13 జలాంతర్గాముల్లో కనీసం అయిదు పూర్తి వార్ధక్యంలో ఉన్నవే. కానీ, వాటి కి మరమ్మతులు చేసి మళ్లీ మళ్లీ వినియోగించాలనుకోవడమే ప్రమాదాలకు ప్రధాన హేతువు. మన నావికాదళం దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన సామగ్రి అవసరమని కోరి చాలాకాలమైంది. ఇందులో రూ. 50,000 కోట్లు వ్యయమయ్యే 6 జలాంతర్గాములు, రూ. 20,000 కోట్లు అవసరమయ్యే 16 బహుళవిధ హెలికాప్టర్లు, రూ. 5,000 కోట్లు కాగల 9 మధ్యశ్రేణి నిఘా విమానాలు వగైరాలున్నాయి. ఇంకా ఆ జాబితాలో మైన్స్వీపర్లు, జలాంతర్గాములు ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వినియోగించే రెస్క్యూ వెసల్స్, ఫ్రైగేట్స్, నావీ శాటిలైట్లున్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ నావికాదళానికి చేరలేదు. 2008లో రష్యాలో ప్రమాదానికిలోనై 20 మంది సిబ్బంది మరణానికి దారితీసిన జలాంతర్గామినే మన దేశం కొనుగోలు చేసి ఐఎన్ఎస్ చక్ర పేరుతో దాన్ని నావికాదళంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మంటలు ఎగిసిపడిన సింధురత్నను కూడా రష్యానుంచే కొనుగోలుచేశారు. దాన్ని గత ఏడాదే తొలగించాల్సి ఉండగా మరమ్మతులు చేసి మళ్లీ వాడటం ప్రారంభించారు. ఎన్నడో 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సింధురక్షక్లో సంచరించినప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వినియోగించడం కోసమని అమెరికానుంచి అప్పటికప్పుడు సహాయ నౌకను అరువు తెచ్చుకోవాల్సివచ్చింది. ఇంత పెద్ద దేశాన్ని కంటికి రెప్పలా రక్షించడానికి అవసరమయ్యే సామగ్రిని సమకూర్చడంలో పాలకులు తీవ్రంగా విఫలమవుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన రూ. 18లక్షల కోట్ల బడ్జెట్లో రక్షణ రంగానికి రూ. 2.24 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అంతేకాదు... మొత్తం బడ్జెట్లో రక్షణ రంగ వాటా13శాతం. రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాల్లో స్కాంలున్నాయని గుప్పుమన్నాక అవి నిలిచిపోయాయి. కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేలా గత ఏడాది జూన్‌లో కొత్త విధానాన్ని రూపొందించారు. అయితే, మన యుద్ధ సన్నద్ధత సరిగాలేదని కాగ్ చెప్పిన ఏడెనిమిదేళ్లకు గానీ ఇది సాధ్యపడలేదు. 2012నాటికి కనీసం 12 కొత్త జలాంత ర్గాముల్ని సమకూర్చుకోవాలని 1999లో నిర్ణయించినా గత పదేళ్లలో కొత్తది ఒక్కటీ రాలేదు. ఒకపక్క మన పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లు సాగరజలాల్లో రక్షణ పాటవాన్ని పెంచుకుంటూ సవాళ్లు విసురుతుంటే మనం మాత్రం ఆనాటికానాటికి క్షీణిస్తున్నాం. ఈ దుస్థితిని గుర్తెరిగి ఇప్పటికైనా ప్రభుత్వం లోపాలను గుర్తెరగాలి. పటిష్ట కార్యాచరణకు దిగాలి.


