త్వరలో దేశం మెుత్తం దీపావళి సంబురాలు జరుపుకోబోతుంది. దీంతో దేశం మెుత్తం పాల ఉత్పత్తులు, మిఠాయిలు ఇతరాత్రా తీపి పదార్థాలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని బ్లాక్ మార్కెట్ రెచ్చిపోతుంది. నాసిరకం ఆహర పదార్థాలతో పాటు గడువు ముగిసిన స్వీట్లను అమ్ముతూ వినియోగదారులను ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎఫ్‌డీఏ డైరెక్టర్ తుకారం ముండే పలు ప్రాంతాల్లోని ఆహార పదార్థాల గోదాములపై రైడ్ నిర్వహించారు.
దీపావళి వచ్చిందంటే స్వీట్లు, పాల ఉత్పత్తులు, పండుగకు సంబంధించిన చిరుతిళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. పండుగ సందర్భంగా మిఠాయి దుకాణాలు రకరకాల స్వీట్లతో కళకళలాడుతుంటాయి. అయితే ఈ పండుగ సందడిలో ఆహార పదార్థాల నాణ్యత, భద్రతపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కల్తీ స్వీట్లు, స్వీట్ల తయారీలో కృత్రిమ రంగుల అధిక వినియోగం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ వంటి అంశాలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అధికారులు ఆహర పదార్థాలు నిలువ ఉంచే గోదాములపై కీలక తనిఖీలు చేపట్టారు. ఈ వివరాలను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే వెల్లడించారు. భివాండి, అంబర్‌నాథ్, పడ్ఘా ప్రాంతాల్లోని పలు గోదాములపై అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సుమారు నెలన్నర రోజుల పాటు ఈ గోదాముల కార్యకలాపాలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ పరిశీలనలో కొన్ని గోదాముల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు అధికారిక రికార్డుల్లో నమోదు చేస్తున్నప్పటికీ, వాస్తవంగా వాటిని రహస్యంగా తిరిగి ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. .
ఈ దాడుల్లో కోట్ల రూపాయల విలువైన పాడైపోయిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 మందిని అరెస్టు చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ధ్వంసం చేయకుండా తిరిగి విక్రయిస్తున్న వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ దాడులతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వాణిజ్య గోదాములు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలకు ఎఫ్‌డీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. విక్రయించడానికి ఏమాత్రం పనికిరాని ఆహార పదార్థాలు తిరిగి వినియోగదారుల వద్దకు చేరకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాంటి ఆహార పదార్థాలను తిరిగి ప్యాకింగ్ చేయడం, వాటిని మళ్లీ విక్రయించడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఆదేశాల్లో పేర్కొంది. ముదురు రంగుల్లో కనిపించే స్వీట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దీపావళి సందర్భంగా స్వీట్ల నాణ్యతపై కూడా ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే పలు సూచనలు చేశారు. ముఖ్యంగా స్వీట్లు, పండుగకు సంబంధించిన చిరుతిళ్లపై తయారీ తేదీ, గడువు తేదీ (Expiry Date) తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను పాటించని వారిపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
అలాగే స్వీట్ల తయారీలో కృత్రిమ రంగులను అధికంగా వినియోగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముదురు రంగుల్లో కనిపించే మోతీచూర్ లడ్డూలను కొనుగోలు చేసే విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వీట్లకు ఆకర్షణీయమైన రంగులు తీసుకురావడానికి అధిక మోతాదులో కృత్రిమ రంగులు కలపడం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
కొనుగోలుదారులకు జాగ్రత్తలు
దీపావళి పండుగ సమయంలో స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్వీట్ల ప్యాకెట్లపై గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలి. తయారీ తేదీ, ప్యాకింగ్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అసాధారణంగా ముదురు రంగుల్లో కనిపించే స్వీట్లను కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రైతులకు డబ్బులొచ్చాయి


