వాళ్లు స్టార్ హీరోలే కావొచ్చు! కానీ చట్టాన్ని ఉల్లంఘించారు
స్టార్ హీరోలు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్.. కానీ చట్టం ముందు ఇవేవీ పనిచేయవని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే స్పష్టం చేశారు. వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు కూడా నిబంధనలకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు విమల్ యాడ్ వ్యవహారంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘మీ దృష్టిలో వాళ్లు స్టార్లు కావొచ్చు. కానీ ఈ కేసులో నా దృష్టిలో వాళ్లు కేవలం అడ్వర్టైజర్లు మాత్రమే. చట్టాన్ని ఉల్లంఘించినవారిగానే చూస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుంటుంది’’ అని తుకారాం ముండే అన్నారు. సెలబ్రిటీలు ప్రకటనల్లో నటించే ముందు తాము ప్రచారం చేస్తున్న ఉత్పత్తి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. తయారీదారుడిదే మొత్తం బాధ్యత అని చెప్పడం సరికాదన్నారు.మహారాష్ట్ర ఎఫ్‌డీఏ గ్రేటర్ ముంబై విభాగం ఆగస్టు 11న షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ ఇలాచీ పేరుతో వచ్చిన ప్రకటన పరోక్షంగా విమల్ పాన్ మసాలాను ప్రచారం చేస్తోందన్నది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో పాన్ మసాలా నిషేధం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నటులు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.ఇద్దరి నుంచి సమాధానం.. ఒకరిపై చర్యలుముగ్గురు నటుల్లో ఇద్దరు నోటీసులకు సమాధానం ఇచ్చారని ముండే తెలిపారు. అయితే ఎవరెవరు స్పందించారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఒక నటుడు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని, ఆ వ్యక్తిపై అడ్జుడికేషన్, ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. షారుఖ్ ఖాన్ టీమ్ స్పందించిందా? అనే ప్రశ్నకు.. ‘‘నాకు ఖచ్చితంగా తెలియదు’’ అని ముండే పేర్కొన్నారు.బాధ్యత తయారీదారుడిదేనా?ప్రకటనలో నటించినంత మాత్రాన బాధ్యత ఉండంటూ ఆ నటులు, వాళ్ల అభిమానులు వాదించడంపైనా ముండే స్పందించారు. ఫుడ్ సేఫ్టీ చట్టం, 2018 రెగ్యులేషన్స్ ప్రకారం.. ప్రకటనదారుల బాధ్యతల గురించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. తాము ప్రచారం చేస్తున్న ఉత్పత్తిపై తగిన పరిశీలన చేయాల్సిన బాధ్యత ఎండార్సర్లకు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదని, చట్టపరమైన బాధ్యత కూడా అని ముండే స్పష్టం చేశారు.ఢిల్లీ హైకోర్టులోనూ దక్కని ఊరటఈ వ్యవహారంలో వమల్ ఇలాచీ మాస్టర్ లైసెన్సీ పీబీ అగ్రో ఎల్ఎల్పీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 14న కొట్టివేసింది. ముంబై ఎఫ్‌డీఏ జారీ చేసిన నోటీసులను సవాలు చేసే విషయంలో ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన అంశాలు మహారాష్ట్రలోనే ఉన్నందున అక్కడి న్యాయస్థానమే సరైన వేదికగా కోర్టు అభిప్రాయపడింది. ఇటు ఆస్పత్రి వస్తువుల ధరలపైనా ఫోకస్కొన్ని హాస్పిటల్ కన్జ్యూమబుల్స్పై 150 నుంచి 2,800 శాతం వరకు మార్కప్ ఉన్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించిందని తెలిపారు. ఉదాహరణగా రూ.11కు కొనుగోలు చేసిన ఇంట్రావీనస్ సెట్‌కు రూ.325 ఎంఆర్పీ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)ని కోరినట్లు వెల్లడించారు. అయితే వైద్య చికిత్సలో నిత్యం ఉపయోగించే ఇలాంటి వస్తువులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలా అనే అంశాన్ని అన్ని వర్గాలతో చర్చించాల్సి ఉందని ముండే చెప్పారు. ఇది వ్యవస్థాగత దోపిడీగా పరిగణించవచ్చా ? లేదా? అనేది NPPA తదుపరి పరిశీలనలో తేలుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మహిళలు గ్యాస్ మొద్దును ఎత్తలేరా?-సుప్రీం కోర్టు