రహస్య భేటీ కలకలం.. సౌదీకి ట్రంప్‌ హ్యాండిచ్చినట్టేనా? | Houthis Rising Offensive Puts Saudi Arabia In A Fix As US Holds Direct Talks With Rebels, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రహస్య భేటీ కలకలం.. సౌదీకి ట్రంప్‌ హ్యాండిచ్చినట్టేనా?

Sep 18 2026 8:02 AM | Updated on Sep 18 2026 9:00 AM

Saudi Arabia Faces New Threat as US Holds Talks With Houthis

యెమెన్‌లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ సౌదీ అరేబియాకు కొత్త తలనొప్పి మొదలైంది. ఒకవైపు హౌతీ దళాలు ఎర్ర సముద్ర తీరంలో కీలక ప్రాంతాలపై పట్టు బిగిస్తూ సౌదీ చమురు రవాణా మార్గాలకు ముప్పుగా మారుతున్నాయి. మరోవైపు.. సౌదీకి ప్రధాన మిత్రదేశమైన అమెరికా మాత్రం హౌతీలతో నేరుగా చర్చలు జరుపుతోంది. ఒమన్‌ రాజధాని మస్కట్‌లో అమెరికా అధికారులు, హౌతీ ప్రతినిధులు రహస్యంగా సమావేశమైనట్లు Reuters వెల్లడించింది. ఈ రహస్య భేటీ ఇప్పుడు గల్ఫ్‌ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అమెరికా-హౌతీల మధ్య నిజంగానే ఏదైనా అవగాహన కుదిరిందా? అదే జరిగితే.. సౌదీకి మిగిలేది ఎవరు? అనే ప్రశ్న ఎదురవుతోంది.

ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలు ఇటీవల యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగారు. వ్యూహాత్మకంగా కీలకమైన బాబ్‌ ఎల్‌-మండేబ్‌ జలసంధికి సమీపంలోని ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకున్నారు. ఈ మార్గం సౌదీ చమురు ఎగుమతులతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా కీలకమైనది. హౌతీల దాడులు ఏకంగా సౌదీ నగరాలు, ఇంధన మౌలిక వసతుల వరకు విస్తరించాయి. ఇటీవలి ఘర్షణల్లో సౌదీ, హౌతీ బలగాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి.

మస్కట్‌లో అమెరికా-హౌతీల భేటీ
ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధికారులు హౌతీ ప్రతినిధులతో ఒమన్‌లో సమావేశమయ్యారు. ఒమన్‌ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ భేటీలో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల మధ్య గతంలో కుదిరిన కాల్పుల విరమణను కొనసాగించడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. హౌతీ ప్రతినిధులు అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హామీ ఇచ్చినట్లు Reuters పేర్కొంది. అదే సమయంలో సౌదీ నౌకలపై దాడులు కొనసాగించే అవకాశం ఉందన్న సమాచారం వెలువడింది.

వాన్స్ కీలక ప్రకటన.. 
ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా హౌతీలతో నేరుగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే ఈ చర్చలు పూర్తిస్థాయి ఒప్పందానికి దారితీశాయా? అన్నది ఇంకా స్పష్టంగా లేదు. అమెరికా ప్రధాన ప్రాధాన్యత ఎర్ర సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కొనసాగించడమేనని వాషింగ్టన్‌ స్పష్టం చేసింది.

సౌదీ ఒంటరిగా మిగిలిపోతుందా?
ఇదిలా ఉండగా.. దాడులు జరుగుతున్నా హౌతీలపై నేరుగా సైనిక చర్యకు అమెరికా ఇప్పటివరకు వెనుకంజ వేస్తుండటం సౌదీకి కీలక సమస్యగా మారింది. సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అమెరికా సాయం కోరినప్పటికీ వాషింగ్టన్‌ ప్రత్యక్ష దాడులకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇంటెలిజెన్స్‌ పంచుకోవడం, టార్గెటింగ్‌ విషయంలో సహకారం అందించే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ మద్దతున్న యెమెన్‌ బలగాలు హౌతీలను నిలువరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హౌతీల తాజా ముందడుగు సౌదీ భద్రత, చమురు ఎగుమతులు, బాబ్‌ ఎల్‌-మండేబ్‌ మార్గంపై ఒత్తిడిని పెంచింది.

ప్రస్తుత హౌతీల దూకుడు, సౌదీ మిత్రబలగాల వైఫల్యం, అమెరికా నేరుగా హౌతీలతో చర్చలు జరపడం.. ఇవన్నీ రియాద్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అయితే అమెరికా-హౌతీల మధ్య అధికారిక ఒప్పందం కుదిరిందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాయాన ప్రయోజనాలకు హామీ లభిస్తే.. సౌదీ ప్రయోజనాలు మాత్రం పక్కకు నెట్టబడే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన నెలకొంది. దీంతో హౌతీలను ఎదుర్కొనే విషయంలో సౌదీ తదుపరి వ్యూహం ఏంటి? అమెరికా మద్దతు ఎంతవరకు ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ఇదీ చదవండి: పాక్‌ తీరు మారలేదు.. భారత్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement