రష్యా ఆంక్షల బిల్లు.. చూశారా ట్రంప్‌ డబుల్‌ గేమ్‌! | US Targets Russia Oil Buyers But Carves Out Uranium Exception for Itself | Sakshi
Sakshi News home page

రష్యా ఆంక్షల బిల్లు.. చూశారా ట్రంప్‌ డబుల్‌ గేమ్‌!

Sep 18 2026 7:34 AM | Updated on Sep 18 2026 7:39 AM

US Targets Russia Oil Buyers But Carves Out Uranium Exception for Itself

రష్యాపై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధమైంది. రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అధికారం ఇచ్చే బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. దీంతో రష్యా చమురు కొనుగోలులో కీలకంగా ఉన్న భారత్‌, చైనాలకు 100 శాతం వరకు టారిఫ్‌ ముప్పు పొంచి ఉంది. అయితే.. ఇదే బిల్లులో అమెరికాకు అనుకూలంగా ఉన్న మరో కీలక నిబంధన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ట్రంప్‌ సర్కార్‌ ‘లిండ్సే ఓ. గ్రాహమ్‌ శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌–2026’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు చమురు, గ్యాస్‌ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఆ ఆదాయాన్ని తగ్గించడంతో పాటు.. రష్యాతో ఇంధన వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడమే బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా అధికారులు(అధ్యక్షుడు పుతిన్‌ సహా..), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగం, ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ‘షాడో ఫ్లీట్‌’పై కూడా కఠిన చర్యలకు ఇందులో అవకాశం కల్పించారు. 

అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు 262–159 ఓట్లతో ఆమోదం పొందింది. ఇందులో 203 మంది రిపబ్లికన్లు, 58 మంది డెమొక్రాట్లు, ఒక ఇండిపెండెంట్‌ సభ్యుడు అనుకూలంగా ఓటేశారు. అంతకుముందే సెనేట్‌ కూడా ఈ బిల్లును 86–11 ఓట్లతో ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్‌ డెస్క్‌కు చేరగా.. ఆయన సంతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అసలు ట్విస్ట్‌ ఇదే..
రష్యా నుంచి చమురు కొనే దేశాలపై భారీ టారిఫ్‌లకు సిద్ధమైన అమెరికా.. అందులో తనకు అనుకూలంగా ఓ సెక్షన్‌ను జత చేర్చుకుంది. అవసరమైన రష్యా యురేనియం విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంచుకుంది. అయితే బిల్లులోని సెక్షన్‌ 111 రష్యా నుంచి యురేనియం దిగుమతులపై ఇప్పటికే ఉన్న అమెరికా ఆంక్షలను అమలు చేయాలని చెబుతోంది. రష్యా ప్రభుత్వ అణు సంస్థ రోసాటమ్‌, దాని అనుబంధ/వారస సంస్థల నుంచి వచ్చే యురేనియం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది.

కానీ అదే బిల్లులోని సెక్షన్‌ 114 మాత్రం కొన్ని ముఖ్యమైన మినహాయింపులను ఇచ్చింది. అమెరికా–రష్యా మధ్య కుదిరిన పౌర అణు సహకార ఒప్పందాల కింద జరిగే కొన్ని కార్యకలాపాలకు ఈ ఆంక్షలు వర్తించవు. అలాగే అణు రియాక్టర్లలో ఉపయోగించే కొన్ని రకాల లో-ఎన్‌రిచ్డ్‌ యురేనియం (LEU) దిగుమతులకు కూడా మినహాయింపు ఉంది. నిబంధనల ప్రకారం కొన్ని వైద్య ఐసోటోపుల దిగుమతులకు కూడా వెసులుబాటు కల్పించారు. అంటే రష్యాతో అణు రంగంలో ప్రతి లావాదేవీని పూర్తిగా నిలిపివేసేలా ఈ బిల్లు లేనేలేదన్నమాట.

అమెరికాకు ఎందుకంత అవసరం?
రష్యాపై ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అణు ఇంధన రంగంలో మాత్రం మాస్కో పాత్ర ఇప్పటికీ పెద్దదే. 2025లో అమెరికా పౌర అణు విద్యుత్‌ సంస్థలు మొత్తం 12.71 మిలియన్‌ సెపరేటివ్‌ వర్క్స్‌ యూనిట్స్‌ (SWU) మేర ఎన్‌రిచ్‌మెంట్‌ సేవలను కొనుగోలు చేశాయి. అందులో రష్యా నుంచి వచ్చినవి 3.284 మిలియన్‌ ఎస్‌డబ్ల్యూయూ.. అంటే సుమారు 26 శాతం. అమెరికా దేశీయ ఎన్‌రిచ్‌మెంట్‌ సేవల వాటా సుమారు 23 శాతంగా ఉంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ కూడా అమెరికాకు ఎన్‌రిచ్‌మెంట్‌ సేవలు అందిస్తున్నాయి. 

యురేనియం కొంటే సరిపోదు..
అణు ఇంధనం తయారీ ప్రక్రియ ముడి చమురు లాంటిది కాదు. గనుల నుంచి తీసిన యురేనియంను నేరుగా చాలా వాణిజ్య అణు రియాక్టర్లలో ఉపయోగించలేరు. ముందుగా కన్వర్షన్‌, ఎన్‌రిచ్‌మెంట్‌ వంటి పలు దశలు దాటాలి. ఈ ఎన్‌రిచ్‌మెంట్‌ సామర్థ్యంలో రష్యా చాలా కాలంగా ప్రపంచంలో కీలక స్థానంలో ఉంది. అందుకే రష్యాతో విస్తృత ఆర్థిక సంబంధాలను తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నా.. అణు విద్యుత్‌ రంగానికి అవసరమైన ఇంధన సరఫరాను ఒక్కసారిగా దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు.

2024లోనే రష్యా యురేనియంపై నిషేధం
ఈ ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. అమెరికా 2024 మేలో రష్యా యురేనియం ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. అయితే దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీలు మినహాయింపులు కోరుకునే అవకాశం కల్పించింది. ఈ మినహాయింపు వ్యవస్థ 2028 జనవరి 1 వరకు కొనసాగేందుకు అవకాశం ఉంది.

అదే సమయంలో అమెరికా దేశీయ అణు ఇంధన సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు 2.72 బిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించింది. దీని లక్ష్యం కూడా రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడమే. అయితే రష్యా చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లకు మార్గం వేస్తూనే.. తన అణు విద్యుత్‌ రంగానికి అవసరమైన కొన్ని రష్యా యురేనియం సరఫరాలకు మాత్రం మినహాయింపులు ఉంచింది. ఇలా.. ఒకే బిల్లులో అమెరికా రెండు రకాల విధానాలను అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

భారత్‌, చైనా.. టారిఫ్‌లపై సస్పెన్స్‌
రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం ఈ బిల్లుతో ట్రంప్‌కు దక్కింది. రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలే ఈ విషయంలో ప్రభావితం కానున్నాయి. అయితే భారత్‌ మాత్రం రష్యా ఆయిల్‌ విషయంలో తగ్గేదే లేదని చెబుతోంది. జాతి ప్రయోజనాల కోసం తాము ఆలోచిస్తామని.. అదే సమయంలో ఈ టారిఫ్‌ ముప్పు గురించి అమెరికాతో చర్చిస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్‌ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. 

ఇదీ చదవండి: డయానా ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement