న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులకు సంబంధించి 0.4 శాతం ఎండీఆర్ విధించాలన్న నిర్ణయానికి అమెరికా ఒత్తిడే కారణమన్న ఆరోపణలను ఆర్థిక శాఖ ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన, తప్పుదోవ పట్టించే ఆరోపణలను పేర్కొంది. ఈ విషయంలో ఎన్‌పీసీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం రూపే కార్డులతో పోలిస్తే ఇతర విదేశీ క్రెడిట్ కార్డులకు ఎలాంటి అదనపు ప్రయోజనాలూ ఉండవని స్పష్టం చేసింది.
రూపేకి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల యూపీఐ వ్యవస్థలో అమెరికన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు పోటీపడలేకపోతున్నారంటూ యూఎస్‌టీఆర్ (అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్) 2026 రిపోర్ట్ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడం చోటు చేసుకున్న నేపథ్యంలో విమర్శకుల ఆరోపణలు, ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘యూపీఐ వ్యవస్థలో రూపే క్రెడిట్ కార్డులకు మాత్రమే అనుమతి ఉంటుందని సెపె్టంబర్ 15 నాటి ఎన్‌పీసీఐ సర్క్యులర్ స్పష్టం చేస్తోంది. భారత్‌లో యూజర్లు రూపే క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించాలనే విధానం చాలా స్పష్టంగా ఉంది. బైటి ఒత్తిళ్ల వల్ల ఎండీఆర్‌ను ప్రవేశపెట్టారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం‘ అని ఎక్స్‌లో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) పోస్ట్ చేసింది. అధిక విలువ చేసే లావాదేవీలపై ఎండీఆర్‌ని ప్రవేశపెట్టడం వల్ల మరిన్ని దేశీ సంస్థలు యూపీఐ వ్యవస్థలో పని చేసేందుకు ముందుకు వస్తాయని పేర్కొంది.
ఫోన్‌పేకి ప్రయోజనం..
ఎండీఆర్ విధింపుతో ఫోన్‌పే అత్యధికంగా లబ్ధి పొందవచ్చని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. యూపీఐ లావాదేవీల్లో 45 శాతం వాటా ఫోన్‌పేదే ఉన్నట్లు పేర్కొన్నారు. 2023లో 12 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ పలికినప్పటికీ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో 2026 మార్చిలో తలపెట్టిన ఐపీవోని ఫోన్‌పే వాయిదా వేసింది. తాజాగా ఎండీఆర్ నుంచి వచ్చే ఆదాయంతో సంస్థ వేల్యుయేషన్ భారీగా పెరుగుతుందని శ్రీవాస్తవ వివరించారు.
ఫోన్‌పే, గూగుల్‌పే దేశీయంగా 80 శాతం పైగా యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయి. అమెజాన్, ఇతర విదేశీ ప్లాట్‌ఫాంలు కూడా విస్తరిస్తున్నాయి. ‘ప్రజా ధనంతో భారతీయ సంస్థలు, బ్యాంకులు నిర్మించిన యూపీఐ మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడానికి అమెరికన్ టెక్నాలజీ కంపెనీలకి భారత్ ఇప్పటికే భారీ స్థాయిలో యాక్సెస్ ఇస్తోంది. ఈ ప్లాట్‌ఫాంలలో భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కోట్ల కొద్దీ ప్రజలు ఖర్చు చేసే ధోరణులకు సంబంధించిన గణాంకాలు కూడా వాటికి చేరుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులపై ఎండీఆర్ భారాన్ని మోపితే వారు అంతిమంగా దాన్ని వినియోగదారులకు బదలాయిస్తారు. ఈ మార్పులన్నీ కూడా భారత్‌లో అమెరికన్ వీసా, మాస్టర్‌కార్డ్‌ల వ్యాపారాన్ని యూపీఐ, రూపే కార్డులు దెబ్బతీస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికాకే ప్రయోజనం చేకూర్చేవిగా ఉన్నాయి. ఎండీఆర్ విధించే బదులుగా యూపీఐతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్న అగ్రగామి విదేశీ సంస్థలు ఒక్కో దానికి వార్షికంగా ఓ 100 మిలియన్ డాలర్ల పారి్టసిపేషన్ ఫీజు విధించాలి‘ అని శ్రీవాస్తవ చెప్పారు.


