పసిడి కొనుగోళ్లపై వినియోగదారుల తీరు
రేట్ల హెచ్చుతగ్గులే కారణం
డబ్ల్యూజీసీ వెల్లడి
ముంబై: పసిడి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో వినియోగదారులు వేచి చూసే ధోరణిలో ఉంటున్నారు. రేట్లు కాస్త స్థిరపడ్డాకే తీసుకోవచ్చని భావిస్తున్నారు. పండుగ సీజన్ ముందు పసిడి ఆభరణాల అమ్మకాలు భారీగా పరుగులు తీసినప్పటికీ ప్రస్తుతం డిమాండ్ నెమ్మదించడం ఇందుకు నిదర్శనమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. అయితే, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడే కొద్దీ డిమాండ్ మరింత పుంజుకుంటుందని వివరించింది.
పెట్టుబడులు, శుభకార్యాల కోసం కొనుగోళ్లు పెరుగుతాయని పేర్కొంది. కాకపోతే, రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం వల్ల సాధారణ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని వివరించింది. డబ్ల్యూజీసీ రీసెర్చ్ హెడ్ (ఇండియా) కవిత చాకో ఒక బ్లాగ్ పోస్టులో ఈ విషయాలు వివరించారు.
పరిశ్రమ వర్గాల ప్రకారం పండుగ సీజన్ ముందు వరకు బంగారు ఆభరణాలకు పటిష్టమైన డిమాండ్ కనిపించినప్పటికీ ఆగస్టు ఆఖరు నుంచి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు. ఆగస్టులో ఒక్కసారిగా ర్యాలీ చేసి, ఆ తర్వాత మళ్లీ తగ్గడంతో చాలా మటుకు వినియోగదారులు వేచి చూసే ధోరణికి మారారని, డి్రస్కెషనరీ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని కవిత పేర్కొన్నారు.
రిటైలర్లూ ఆచితూచి..
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిల్వలను పెంచుకోకుండా చిన్న రిటైలర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తయారీ సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లను తీసుకోవడంలో కూడా జాప్యం చేస్తున్నారు. తమకు వచ్చిన డిమాండ్ మేరకే నిల్వలను భర్తీ చేసుకుంటున్నారు. వివాహాలకు సంబంధించి తేలికపాటి జ్యుయలరీ వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. చిన్న వ్యాపారాలతో పోలిస్తే బడా రిటైలర్ల వద్ద మాత్రం డిమాండ్ మెరుగ్గా ఉంటోంది.
దీనితో అవి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, మార్కెటింగ్ కార్యక్రమాలు మొదలైనవి చేపడుతున్నాయి. వేగంగా అమ్ముడయ్యే ఉత్పత్తులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అమ్మకాల జోరు నెమ్మదించినప్పటికీ, పండుగ, వివాహాల సీజన్ సందర్భంగా వ్యాపారం మెరుగ్గానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
పాత బంగారానికి కొత్త ఆభరణాలు..
భౌతిక రూపంలో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ స్థిరంగా కొనసాగుతుండగా, కొందరు ఇన్వెస్టర్లు ఫిజికల్ నుంచి డిజిటల్ బంగారం వైపు మళ్లుతున్నట్లుగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డిమాండ్‌తో పోలిస్తే లభ్యత ఎక్కువగా ఉండటంతో దిగుమతయ్యే రేటు కన్నా దేశీయంగా రేట్లు రెండు శాతం తక్కువే ఉంటున్నాయని వివరించాయి. కొత్త ఆభరణాల కోసం పాత బంగారాన్ని మారి్పడి చేసుకుంటూ ఉండటం వల్ల స్థానికంగా సరఫరా పెరిగిందని, ఫలితంగా రేట్లు.. దిగుమతి ధర కన్నా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
అనధికారిక మార్గాల్లో లభిస్తుండటం కూడా ఇందుకు ఒక కారణమని వివరించాయి. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం ఆగస్టులో పసిడి దిగుమతుల విలువ నెలవారీగా 45 శాతం, వార్షికంగా 58 శాతం క్షీణించి 2.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి దిగుమతులు పరిమాణంపరంగా 15–20 టన్నుల మేర నమోదయ్యాయి. మొత్తం మర్చండైజ్ దిగుమతుల్లో పసిడి వాటా వార్షికంగా 9 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. డిమాండ్‌కి తగ్గట్లుగా దేశీయంగా తగినంత సరఫరా ఉన్నట్లుగా దీని ద్వారా తెలుస్తోందని విశ్లేషకులు తెలిపారు.


