బంగారం కొనాలా...ఆగాలా... | Should I buy gold today or wait for a price drop, sakshi wealth story | Sakshi
Sakshi News home page

బంగారం కొనాలా...ఆగాలా...

Aug 17 2026 6:09 AM | Updated on Aug 17 2026 6:09 AM

Should I buy gold today or wait for a price drop, sakshi wealth story

మళ్లీ భగ్గుమంటున్న ధర 

రికార్డు స్థాయి నుంచి పతనం 

ఇప్పుడు మళ్లీ రీబౌండ్‌ 

ధర తగ్గినపుడు భయం...పెరుగుతున్నా భయమే 

కొందామా...కొన్నాళ్లు ఆగుదామా.. 

పెట్టుబడికోసమైతే ఒకేసారి కొనొద్దు 

ధరకంటే ఇప్పుడు వ్యూహం ముఖ్యం

ప్రతిరోజూ కోట్ల మంది ఇవాళ గోల్డ్‌ రేటు ఎంత అని ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేస్తుంటారు. లక్షల మంది తమ స్నేహితులను, తెలిసినవాళ్లని, ఇప్పుడు బంగారం కొనొచ్చా...మరికొంత కాలం ఆగాలా అని ప్రశ్నిస్తుంటారు. ప్రతిరోజూ ధర ఇంకాస్త పడుతుందేమో అనిపిస్తుంది. అంతలోనే మరింత పెరిగితే అవకాశం మిస్‌ అవుతుందేమో అనే భయం కలుగుతుంది. 

ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ సంప్రదాయం కోసం కొనేవారికి, పెట్టుబడి చేసేవారికి ఇది సాధారణంగా కలిగే సందేహం. మరి ఇప్పుడు బంగారం ధర చూసి షాక్‌ అవుతున్నారా... ఇంకా పెరిగేముందే కొనేయాలని  ఆలోచిస్తున్నారా... అయితే సాక్షి వెల్త్‌ మిమ్మల్ని ఈరోజే కొనండి అని చెప్పదు. కానీ సరైన నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన విషయాలను క్లియర్‌గా వివరిస్తుంది.                       

బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో ఇప్పుడే కొనాలా లేక ధర తగ్గేవరకు వేచి చూడాలా? అనే ప్రశ్న ప్రతి కొనుగోలుదారుడిని వెంటాడుతోంది.అయితే బంగారం కొనడంలో కేవలం ఈరోజు రేటుమాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశీయ డిమాండ్, మేకింగ్‌ చార్జీలు, కొనుగోలు ఉద్దేశం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 

సరైన సమయంలో సరైన అవగాహనతో బంగారం కొంటేనే అది ఆభరణంగా మాత్రమే కాకుండా భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విలువైన ఆస్తిగా మారుతుంది. 2026 ప్రారంభంలోనే  వినియోగదారులకు గోల్డ్‌ ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ చూపించింది. జనవరిలో దాదాపు రూ.2 లక్షల దాకా ఎగసిన బంగారం ధర అమాంతంగా చల్లబడింది. మార్చిలో 1.30 లక్షలస్థాయికి పడిపోయింది. గరిష్టం నుంచి 23 శాతం కరెక్షన్‌. కానీ కథ అక్కడితో ముగియలేదు.జూన్‌లోకూడా పతనం చూసిన పసిడి ధర ఆగస్టులో మళ్లీ పైకి పరుగు ప్రారంభించించింది. 

ఇదే బంగారం అసలు స్వభావం. పరుగులో ఉన్నపుడు ఆకాశమే హద్దులా కనిపిస్తుంది. పడిపోతున్నపుడు ఇంకా పతనమవుతుందేమోనని భయం పుట్టిస్తుంది. బంగారం ధర పెరుగుతున్నపుడు ఇంత ధరలో  ఎలా కొనగలం అని ఆగుతాం.తగ్గుతున్నపుడు ఇంకాస్త తగ్గాక కొందాంలే అని మళ్లీ వాయిదా వేస్తాం..ఊహించినట్టే కొన్నిరోజులకు బంగారం ధర భారీగా తగ్గుతుంది. అయితే అప్పుడు మళ్లీ కొత్త అనుమానం..కొనేశాక ధర ఇంకా పడితే అని ఆందోళన కలుగుతుంది.బంగారం విషయంలో ప్రతి వినియోగదారుడు/పెట్టుబడిదారుడు ఎదుర్కొనే సమస్య ఇదే.  

 ధర పడినపుడు భయపడినవారు. మళ్లీ పెరుగుతుంటే కూడా అదే భయంతో ఉన్నారు.  ఇంకా పెరిగిపోతుందేమో అనే అంచనాలతో కొందరు కొనడానికి పరుగులు తీస్తున్నారు.కానీ పెరుగుతున్న ధరను చూసి తొందరపడడం ఎంత ప్రమాదమో భారీ కరెక్షన్‌ను చూసి దూరంగా ఉండడం కూడా అంతే అవివేకం. బంగారం ఒకప్పటిలా కేవలం ఆభరణం కోసమే కాదు. 

ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయి కదలికలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీరేట్ల నిర్ణయాలతో కదిలే ఒక ఆస్తి.అందుకే ఇప్పుడు కొనాలా?అన్న ఆలోచన కంటే ఎందుకు కొంటున్నాం, ఎంత కొంటున్నాం, ఏరూపంలో కొంటున్నాం? అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధర నేరుగా పైకి వెళ్లడంలేదు. భారీ ర్యాలీ. తర్వాత భారీ కరెక్షన్, మళ్లీ ర్యాలీ. ఇదే దాని ప్రయాణం. అందుకే బంగారం విషయంలో అసలు ప్రశ్న ఇపుడు ధర ఎంత అని కాదు ఇప్పుడు పెట్టుబడి వ్యూహం ఏమిటి అని? 

ఆగస్టులో ర్యాలీ ఎందుకు 
ఇటీవలి బంగారం ర్యాలీకి కారణం ఒకటి కాదు. అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీరేటు అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాలు , సురక్షిత పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నడిమాండ్, సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు ఇలా అనేక అంశాలు కలిసి బంగారాన్ని పైకి ఎగదోశాయి. అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి పెరిగినపుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సేఫ్‌ హెవెన్‌ ఆస్తిగా చూస్తారు. ఇదే సమయంలో దేశీయంగా మరో అంశం పనిచేస్తుంది. అది రూపాయి కదలికలు. డాలరుతో రూపాయి బలహీన పడినా, బలపడినా అది బంగారం ధరను ప్రభావితం చేస్తుంది. అధిక ధరల కాలంలో ఆభరాణాల డిమాండ్‌ ఒత్తిడికి గురైనా   బార్లు, కాయిన్లు ఈటీఎఫ్‌లలో పెట్టుబడి డిమాండ్‌ బలంగానే కొనసాగుతోంది. 

బంగారం ఎందుకు పడింది 
ఇదే పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన కీలకపాఠం.బంగారం ఎంత బలమైన ఆస్తి అయినా అది పడదని కాదు. జనవరిలో రికార్డు స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ, మార్కెట్‌ అంచనాల్లో మార్పులు, డాలర్‌/వడ్డీరేట్ల ప్రభావం వంటి అంశాలు కలిసి బంగారం ధరపై ఒత్తిడి తెచ్చాయి. జీవితకాల గరిష్టస్థాయికి చేరిన కొన్ని వారాల్లోనే పసిడి 23 శాతం పతనమైంది.పెట్టుబడిదారులకు ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక .

 బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే నమ్మకంతో మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయకూడదు. బంగారం మళ్లీ 2 లక్షలకు పెరుగుతుంది అనో, మళ్లీ లక్షకి పడిపోతుందనో ఇలా ఏ దిశగా ఆలోచించినా ప్రమాదకరమే. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ కూడా బంగారం ధర అంచనాల్లో ఒకే లక్ష్యాన్ని చెప్పలేదు. ప్రస్తుత స్థాయి నుంచి సాధారణ పరిస్థితుల్లో సుమారు 5 శాతం అటూ ఇటూ కదిలే అవకాశముందని మాత్రమే తెలిపింది. 

ఆర్థిక మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, తక్కువ వడ్డీరేట్ల అంచనాలు కారణంగా బంగారంధర మరింత పైకి వెళ్లే అవకాశముందని నివేదికలో పేర్కొంది. మరోవైపు బలమైన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న బాండ్‌ యీల్డ్స్, ప్రశాంతమైన స్టాక్‌ మార్కెట్లు ఉంటే బంగారం ధర వెనక్కి రావచ్చని కూడా తెలిపింది. అంటే బంగారానికి పైకి పెరిగే కారణాలు ఎన్ని ఉన్నాయో కిందికి దిగే కారణాలు కూడా అన్నీ ఉన్నాయి.అందుకే పెట్టుబడిదారులు బంగారం ధర టార్గెట్‌ ఎంత? కంటే  కొనుగోలు విధానం ఎలా ఉండాలి అని మాత్రమే ఆలోచించాలి.

ఇప్పుడు ఏం చేయాలి?
బంగారంలో పెట్టుబడి చేయాలనుకుంటే ఒక్కసారిగా మొత్తం పెట్టుబడి పెట్టొద్దు. ఉదాహరణకి మీదగ్గర రూ.5 లక్షలు ఉంటే ఒకేసారి కొనడం సరికాదు.. ఎందుకంటే ధర 10 శాతం పడితే మీ పెట్టుబడిలో రూ.50000 పోతుంది.దీంతో మానసిక ఒత్తిడి మొదలవుతుంది.అందుకే ఐదు లక్షలను ఐదు విడతలుగా లక్ష చొప్పున ధర పడినపుడల్లా కొనుగోలు చేయడం సరైన నిర్ణయం ఇలా విడతల్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం మార్కెట్‌ టైమింగ్‌ అనుసరించడం మాత్రమే కాదు..మార్కెట్‌ టైమింగ్‌ ప్రమాదాన్నికూడా తగ్గించే వ్యూహం.

ఆభరణమా?పెట్టుబడా?
బంగారం కొనుగోలు విషయంలో ఈ రెండిటినీ ఎప్పుడూ కలపొద్దు..బంగారం కొనేటప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే ..ఆభరణాలు కొని బంగారంలో పెట్టుబడి పెట్టినట్టే అని అనుకోవడం. ఆభరణాల ధరలో బంగారం విలువతో పాటు మేకింగ్‌ చార్జీలు, వేస్టేజ్, జీఎస్‌టీ ఇతర పన్నులు అన్ని కలిసి ఉంటాయి. విక్రయించే సమయంలో ఈ ఖర్చు తిరిగి రాదు.

 పెట్టుబడే లక్ష్యమైతే గోల్డ్‌ ఈటీఎఫ్,గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్, గోల్డ్‌ బాండ్స్, కాయిన్లు, బార్లు, బిస్కట్ల రూపంలో అవసరానికి అనుగుణంగా  కొనే మార్గాలు పరిశీలించవచ్చు. అయితే ప్రతి ఉత్పత్తికి లిక్విడిటీ, టాక్సేషన్, ట్రాకింగ్‌ డిఫెరెన్స్‌ వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి బంగారం ఒక్కటే అయినా పెట్టుబడి ఏ రూపంలో చేస్తున్నామనేది చాలా ముఖ్యం. పెట్టుబడి పెట్టేవారికి అత్యంత ఉపయోగకరమైన వ్యూహం గరిష్టధరను ఊహించి కొనడం కాదు..ధరల హెచ్చుతగ్గులను తట్టుకునేవిధంగా పెట్టుబడిని నిర్మించడం.

పెట్టుబడిదారుడి కోసం గోల్డ్‌ చెక్‌ లిస్ట్‌
→ బంగారం ఎందుకు కొనాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి 
→ ఆభరణం కోసమా? పెట్టుబడా? రెండిటినీ వేరు చేయాలి 
→ మొత్తం డబ్బును ఒకేసారి పెట్టొద్దు 
→ ధర పెరుగుతున్నపుడు ఫోమోకు లోనుకావద్దు 
→ ధర పడుతుంటే భయంతో అమ్మొద్దు 
→ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా 10 శాతం వరకు ఉండాలి 
→ గోల్డ్‌ ఈటీఎఫ్‌/ఫిజికల్‌ గోల్డ్‌ మధ్య ఖర్చులు, లిక్విడిటీ, పన్నులు పోల్చండి 
→ స్వల్పకాలిక ధర అంచనాలను దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంగా మార్చొద్దు.

ఇప్పుడే కొనాలా?
ఆభరణం కొనడం అవసరం అయితే... అంటే పెళ్లి, ఏదైనా పూజా కార్యక్రమం వంటి నిర్దిష్ట అవసరం ఉంటే తక్కువ ధరకి దొరికేవరకూ  వాయిదా వేయడం కంటే అవసరాన్ని బట్టి కొనుగోలును చేయడం మంచిది. అదే పెట్టుబడి కోసమైతే  ఒకే రోజు ధరను చూసి పెట్టుబడి పెట్టకుండా విడతలవారీగా చేయడం సరైన విధానం. ఇప్పటికే కుటుంబ ఆస్తిలో బంగారం ఎక్కువగా ఉంటే ఆశతో అదనంగా మళ్లీ కొనడం కన్నా అది మొత్తం ఆస్తిలో ఎంత శాతం ఉందో చూసి పెట్టుబడి చేయడం ఉత్తమం. పసిడి ర్యాలీ సమయంలో వినియోగదారులకు కలిగే ప్రమాదకరమైన భావన ఏంటంటే ఫోమో (FOMO & Fear of Missing out) అంటే ఇప్పుడు కొనకపోతే రేపు ఇంకా ఖరీదవుతుంది. అవకాశాన్ని కోల్పోతాం అనే భావన. ఈ ఆలోచనతో పెట్టుబడిలోకి దిగడం ప్రమాదకరం. బంగారం మనకు చెప్పే పెద్ద పాఠం ఇదే..ధర పెరిగినపుడు ఉత్సాహంతో పరుగెత్తి కొనద్దు, ధర పడిపోతున్నపుడు భయంతో అమ్మొద్దు.

ఫైనల్‌ వార్నింగ్‌
బంగారం కథ ఇంకా ముగియలేదు. బంగారం కొనేవారు ‘ఇంకా ఎంత పెరుగుతుంది?‘ అనే ప్రశ్నతో చూడడం పొరపాటు. ఎందుకంటే 2026లో అది ఇప్పటికే ఒక పాఠం నేరి్పంది. రూ. 1.35 లక్షల నుంచి 1.79 లక్షలకి పెరిగి అక్కడినుంచి వారాల వ్యవధిలోనే 1.38 లక్షలకి పతనమైంది.మళ్లీ కొన్ని నెలల్లో 1.55 లక్షలకు చేరుకుంది. అందుకే  సరైన రోజున కొనడంలో కాదు ..సరైన పద్ధతిలో కొనడం ద్వారానే బంగారంలో విజయం సాధించగలుగుతాం.  

– సాక్షి, వెల్త్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement