యూఎస్‌లో విదేశీలు ఉద్యోగాలు చేసేందుకు ఉపయోగించే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత హెచ్1బీ వ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టంగా మారిందని, అవసరమైతే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయడానికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా.. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో, తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించేందుకు కొన్ని కంపెనీలు ఈ వీసా విధానాన్ని ఉపయోగిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
అమెరికన్ ఉద్యోగాలపై ప్రభావం
ఒక అమెరికన్ అకౌంటెంట్‌కు ఏడాదికి 60 వేల డాలర్లు చెల్లించే కంపెనీ, అదే పనిని 45 వేల డాలర్లకు విదేశీ ఉద్యోగితో చేయించుకుంటే అది అత్యుత్తమ ప్రతిభను తీసుకురావడం కాదని వాన్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి విధానం అమెరికన్ల ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. హెచ్1బీ ద్వారా అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీ నిపుణులను తీసుకురావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని వివరించారు.
ఇదే సమయంలో హెచ్1బీ దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు విధించడాన్ని వాన్స్ సమర్థించారు. తక్కువ ఖర్చుతో విదేశీ ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశంతో.. కంపెనీలు హెచ్1బీను ఉపయోగించకుండా నిరోధించడమే ఈ భారీ ఫీజు లక్ష్యమని చెప్పారు. అలాగే.. అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ఎంపికలో అధిక జీతాలు వచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, దరఖాస్తు చేస్తున్న కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించాయా? లేదా?.. అనే విషయాన్ని కూడా పరిశీలించేలా నిబంధనలను కఠినతరం చేస్తోంది.
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై ఆసక్తి
హెచ్1బీ వీసాలు ఐటీ నిపుణులకు ఎంతో ముఖ్యమైనవి కావడంతో.. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్‌లో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లేదా అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ టెక్ నిపుణులపై భవిష్యత్తులో ఈ నిబంధనల ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కూడా హెచ్1బీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దానిపై ప్రభుత్వం మరింత కఠినమైన నియంత్రణలు తీసుకొస్తోంది.
ఇదిలా ఉండగా.. కొన్ని H-1B దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల ఫీజుపై అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఫీజును అమలు చేసే సమయంలో ప్రభుత్వం అనుసరించాల్సిన పరిపాలనా ప్రక్రియలను పాటించలేదనే వాదనలు కోర్టుల్లో వినిపించాయి. దీంతో.. ఫీజు అమలుపై న్యాయపరమైన ఆంక్షలు వచ్చాయి.
ఇదీ చదవండి: గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?


