రెండు విషపు సూదులు.. అయినా చావలేదు! | Christa Gail Pike not Tennessee first failed execution | Sakshi
Sakshi News home page

రెండు విషపు సూదులు.. అయినా చావలేదు!

Oct 2 2026 6:41 AM | Updated on Oct 2 2026 7:33 AM

Christa Gail Pike not Tennessee first failed execution

‘తానొకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలచిందంటారు’’ క్రిస్టా పైక్‌ విషయంలో ఇది మరోసారి రుజువైంది. ఎంత విచిత్రం కాకపోతే...  ముప్ఫై ఏళ్ల నాటి హత్యకు మరణశిక్ష పడటం ఏమిటి?. చంపేద్దామని... ఒకటి కాదు, రెండు... విషపు సూదులు గుచ్చినా పైక్‌ నిక్షేపంగా... గురకపెడుతూ కనిపించడం ఏమిటి? నిజంగా విడ్డూరమే!. 

అగ్రరాజ్యం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మరణ శిక్షల అమలు కొనసాగుతూనే ఉంది. ఈ విషయం కొత్త కాదు కానీ... చట్టం విధించిన శిక్ష అమలు చేయడం బెడిసికొట్టడం మాత్రం ఇదే మొదటిసారి అయి ఉంటుంది. యాభై ఏళ్ల క్రిస్టా పైక్‌ సుమారు 31 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నారు. టెన్నిసీ రాష్ట్రంలోని నాక్స్‌విల్లేలో 1995లో కొల్లీన్‌ స్లెమ్మర్‌ అనే 19 ఏళ్ల యువకుడి హత్య పెను సంచలనం సృష్టించింది. ఈ నేరానికి గాను క్రిస్టాకు అతిపిన్న వయసులోనే మరణ శిక్ష పడింది కూడా.

 అయితే కేసు స్టేట్, ఫెడరల్‌ కోర్టుల్లో అప్పీళ్లకు వెళ్లడం, క్రిస్టా మానసిక పరిస్థితి బాగా లేదని, చిన్నప్పటి అనుభవాల కారణంగానే ఆమె హింసకు పాల్పడిందని న్యాయవాదులు ప్రతి దశలోనూ వాదించడం, మరికొన్ని కారణాల వల్ల క్రిస్టాకు పడ్డ మరణ శిక్షను అమలు చేయడం ఇప్పటివరకూ వీలు కాలేదు. అన్ని రకాల అప్పీళ్లు ముగిసిన నేపథ్యంలో సెపె్టంబరు 30వ తేదీ బుధవారం రాత్రి విషపు ఇంజెక్షన్లు ఇచ్చి మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. 

నాష్‌విల్లేలోని రివర్‌బెండ్‌ మ్యాక్సిమమ్‌ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూషన్‌లో ఇందుకు తగ్గ ఏర్పాట్లూ జరిగాయి కానీ... అధికారులు క్రిస్టా పైక్‌కు రెండు ఇంజెక్షన్లయితే ఇచ్చారు కానీ... ఆమె గుండె ఆగిపోలేదు. కొట్టుకుంటూనే ఉంది. మరణాన్ని ధ్రువీకరించేందుకు దగ్గరకు వెళ్లిన సాక్షులకు ఆమె పెడుతున్న గురక కూడా వినిపించిందట. బిత్తరపోయిన అధికారులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

ఆమె ఆరోగ్య పరిస్థితిపై కచ్చితమైన సమాచారం ఏదీ లేనప్పటికీ బతికే ఉందని మాత్రం తెలిసింది. అయితే... ఈ వ్యవహారమిప్పుడు రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతోంది. చచ్చినంత పనై బతికిపోయిన క్రిస్టాపై మరోసారి మరణ శిక్ష అమలు చేస్తారా? ఇలా చేయడం నైతికంగా సరైందేనా? అని న్యాయ నిపుణులు, మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా మరణశిక్ష అమలు విఫలం కావడం రాజ్యాంగ పరమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని ఒక న్యాయవాది వ్యాఖ్యానించారు.     

 – టెన్నిసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement