ధరలు తగ్గడంతో జ్యువెలరీ షాపుల్లో సందడి
కస్టమ్స్ డ్యూటీ పెంపు ప్రభావం నుంచి కోలుకుంటున్న నగల మార్కెట్
పెళ్లిళ్లు, పండుగల సీజన్‌కు ముందే పెరుగుతున్న ఫుట్‌ఫాల్స్
లైట్ వెయిట్, వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు అధిక డిమాండ్
రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు కొంతకాలంగా వినియోగదారులను కొనుగోళ్లకు దూరం ఉంచాయి. అయితే ఇటీవల ధరల మంట కొంతమేర చల్లబడడంతో దేశీయ జ్యువెలరీ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. డాలర్ల వినియోగం కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కస్టమ్స్ డ్యూటీ కారణంగా కొన్నినెలలు మందగించిన జ్యువెలరీ డిమాండ్ ఇప్పుడు వేగంగా పుంజుకుంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ధరల తగ్గుదలతో పాటు, భారతీయ కుటుంబాల్లో ప్రతి శుభకార్యానికి బంగారానికి ఉన్న సాంస్కృతిక బంధం జ్యువెలరీ మార్కెట్‌ను మళ్లీ పరుగులు తీయిస్తోంది.
బంగారం దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 6–15 శాతానికి పెంచిన తర్వాత కొనుగోలుదారులు నగల షాపింగ్‌కు బ్రేక్‌నిచ్చారు. వేచిచూసేధోరణి అవలంబించారు. ఇటీవల బంగారం భారీగానే తగ్గడంతో ప్రస్తుత ధరల వద్ద తిరిగి కొనుగోలు చేసేందుకు మార్కెట్లో అడుగుపెడుతున్నారని ప్రముఖ ఆభరణాల సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రా. బంగారం ధర చారిత్రక గరిష్టస్థాయి రూ.1,85,000 తాకిన తర్వాత తిరిగి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఒక్క జూన్ నెలలోనే బంగారం ధర 8% కన్నా తగ్గడం నగల ప్రియులకు ఊరటనిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జువెలరీ షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.
పెళ్లిళ్లు, పండుగల సీజన్‌పై ఆశలు
బంగారం డిమాండ్ 70%కి పైగా పడిపోయినప్పటికీ ధరలు కొంత తగ్గిన తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, మార్కెట్‌లో ఫుట్‌ఫాల్స్ పెరగడం, నగల విక్రయాలు పుంజుకోవడం జ్యూవెలరీ రంగానికి మళ్లీ మంచిరోజులొచ్చాయని బంగారం వర్తకులు భావిస్తున్నారు.కొన్ని నెలలుగా అమ్మకాలు తగ్గి వెలవెలబోయిన జ్యువెలరీ పరిశ్రమ ఇప్పుడు వచ్చే శ్రావణం, దసరా, దీపావళి, వివాహాల సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అధిక ధరల కారణంగా తక్కువ వెయిటేజ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వైపు మళ్లిన వినియోగదారులు మళ్లీ మేలిమి బంగారు నగలు, సంప్రదాయ ఆభరణాల కొనుగోలుకు ఉత్సాహం చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. భారతదేశంలో బంగారం కొనడం కేవలం పెట్టుబడే కాదు, సంప్రదాయం కూడా. మార్కెట్ బలంగా కోలుకుంటోందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొంటున్నారు. రానున్న పండుగ సీజన్ ఆభరణాల మార్కెట్‌కు మళ్లీ బంగారు కాంతులు తెస్తుందని ఆశిస్తున్న రిటైలర్లు షాపుల విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నారు. టైటన్ కొత్తగా 77 స్టోర్లను, కల్యాణ్ జ్యూవెలర్స్ 524 స్టోర్లకు నెట్‌వర్క్‌ను విస్తరించింది.
దూసుకెళుతున్న జ్యువెలరీ షేర్లు
క్యూ1 ఫలితాలపై అంచనాలు, పెరుగుతున్న అమ్మకాలు, కొత్త స్టోర్ల విస్తరణతో ఆభరణాల కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. బ్రోకరేజ్ సంస్థల బయ్ రేటింగ్స్ కూడా ర్యాలీకి కారణం.
→ కల్యాణ్ జ్యువెలర్స్: షేరు ధర 10 రోజుల్లో 68 శాతం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ ఆదాయం 38 శాతం పెరిగింది. బుధవారం షేరు రూ.548 వద్ద ముగిసింది.
→ టైటాన్: కంపెనీ షేరు ధర ఆల్‌టైం గరిష్ట స్థాయిని తాకింది. తని‹Ù్క జ్యువెలరీ విభాగంలో 39 శాతం వృద్ధి నమోదు కావడంతో షేరు పరుగులు పెడుతోంది. బుధవారం రూ.4,579 వద్ద ముగసింది.
→ సెన్కో గోల్డ్: కొత్తగా 8 స్టోర్లను ప్రారంభించడంతో స్టాక్ బలంగా పుంజుకుంది. షేరు రూ.373 వద్ద ముగిసింది.
→ తంగమయిల్ జ్యువెలరీ: షేరు జీవితకాల గరిష్టాన్ని చేరింది. నెలరోజుల్లో స్టాక్ 30% పైగా లాభపడింది. రూ.6,618 వద్ద ముగిసింది.
→ స్కైగోల్డ్ అండ్ డైమండ్స్: షేరు ధర కొత్త రికార్డు స్థాయిని తాకింది. బుధవారం రూ.630 వద్ద ముగిసింది.
కొత్త డిజైన్‌లకు ఆదరణ
కొత్తతరం కస్టమర్లు కేవలం బంగారం బరువు కన్నా డిజైన్, ఫ్యాషన్, రోజువారీ వినియోగానికి అనువైన నగలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతరం కస్టమైజ్డ్ ఆధారిత కలెక్షన్లు, డైమండ్ స్టడెడ్ జ్యువెలరీ, లైట్ వెయిట్ నగలను ఇష్టపడుతున్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


