అందులోనే ముఠా సభ్యులకు అసైన్‌మెంట్లు
నెలనెలా జీతాలు.. ప్రతిభకు తగినట్టుగా పారితోషికాలు, బోనస్‌లు
ఇప్పటివరకు 400 కిలోల బంగారం దోపిడీ
నివ్వెరపరుస్తున్న గోల్డ్ థీఫ్ సుబోధ్‌సింగ్ నేర విధానం
గ్యాంగ్ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ యాప్
దోపిడీకి, బంగారం తరలింపునకు, విక్రయానికి వేర్వేరు గ్యాంగ్‌లు
కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదు ర్కొంటున్న సుబో«ధ్ సింగ్.. పోలీసు విచారణలో చెప్పిన విషయాలు వారే నిర్ఘాంతపోయేలా చేశాయి. అతడి నేర విధానం, సాంకేతికతను వాడుకుంటున్న తీరు, తాను స్వయంగా పాల్గొననప్పుడు పకడ్బందీగా ముఠాను నడిపించడం చూస్తే మొత్తం నేర సామ్రాజ్యమే నివ్వెరపోయేలా ఉంది. కేవలం బంగారం, నగల దుకాణాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడటం ఇతని ముఠా ప్రత్యేకత. అందుకే ఇతన్ని గోల్డ్ థీఫ్ (బంగారం దొంగ)గా పిలుస్తారు.
ఇతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా వాడుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. దొంగల నెట్‌వర్క్ కోసం ఒక పకడ్బందీ యాప్ నిర్వహిస్తున్నాడు. తన ముఠా సభ్యులకు ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా దోపిడీకి గురైన సంస్థల జాబితాలో మనప్పురం, తనిష్క్ వంటి సంస్థలుండగా, ఈ గ్యాంగ్ ఇప్పటివరకు 400 కిలోల బంగారం దొంగిలించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే.. ఇతను నేరుగా కరీంనగర్ దోపిడీలో పాల్గొనలేదు. బిహార్ జైల్లో ఉండి, పక్కా స్కెచ్ వేసి తన గ్యాంగ్‌తో పని కానిచ్చాడు.
10 వరకే చదువుకున్నా..
బిహార్‌కు చెందిన సుబోధ్‌సింగ్ కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నాడు. ప్రస్తుతం సొంత రాష్ట్రంతో పాటు కోల్‌కతా, మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో 27 కేసులు ఎదుర్కొంటున్నాడు. కరీంనగర్‌లో మే 3వ తేదీన దోపిడీ జరగ్గా పోలీసులు స్వల్ప వ్యవధిలోనే కొందరు నిందితులను పట్టుకోగలిగారు. వారిని తమదైన శైలిలో విచారించి బిహార్ జైల్లో ఉన్న సుబోధ్‌సింగ్ కీలక సూత్రధారి అని తెలుసుకు న్నారు.
అతని పాత్రపై తగిన ఆధారాలు సంపాదించడంతో పాటు పీటీ వారంట్‌పై మే 28న రాష్ట్రానికి తీసుకువచ్చారు. కరీంనగర్ జైల్లో పెడితే తోటి ఖైదీలకు డబ్బు ఎరవేసి లోబరుచు కునే ప్రమాదముండటంతో ఒకే ఖైదీ ఉండేందుకు అవకాశం ఉన్న హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించారు. బుధవారం సుబోధ్‌సింగ్‌తో పాటు అతని అనుచరుల కస్టడీ ముగిసింది.
యాప్‌తో గ్యాంగ్ నిర్వహణ
సుబోధ్‌సింగ్ తన దోపిడీ నెట్‌వర్క్ కోసం ప్రత్యేక యాప్ నిర్వహిస్తున్నాడు. నేరాలు చేసి జైలుకు వెళ్లినప్పుడు పరిచయం అయిన చిన్న చిన్న నేరాలు చేసిన వారిని ముఠాలో చేర్చుకునే వాడు. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. నెలనెలా డబ్బులు ఇచ్చేవాడు. అత్యాధునిక ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు వాడటంలో ఆరితేరాడు. ఈ క్రమంలోనే తన గ్యాంగ్ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ వాడుతున్నాడు.
ఎవరి టాస్క్ వారికే..
గ్యాంగ్‌లో చేరిన వారి మొబైల్ ఫోన్‌లో ఆ యాప్ ఇన్‌స్టాల్ చేస్తారు. అందులో ఎవరికి కేటాయించిన టాస్క్ వారికి మాత్రమే కనిపిస్తుంది. అలా అప్పగించిన పనిని చేయగానే వారికి అందాల్సిన డబ్బు పక్కాగా అందుతుంది. పనిలో ప్రతిభ చూపిస్తే బోనస్‌లు కూడా ఇస్తాడు. బంగారం దోపిడీ పని కొందరికి, రవాణా బాధ్యత మరికొందరికి, అమ్మే పని వేరేవాళ్లకు.. ఇలా ఎవరికి కేటాయించిన పనిని వారు చేస్తారు. దీంతో ఎవరైనా పోలీసులకు చిక్కినా దోపిడీ గురించిన పూర్తి సమాచారం వారికి తెలియదు. అయితే కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలోని పోలీసుల బృందం చాకచక్యంగా వ్యవహరించి కేవలం రోజుల వ్యవధిలోనే జైల్లో ఉండి సుబోధ్‌సింగ్ వేసిన స్కెచ్‌కు సంబంధించిన కీలకాధారాలు న్యాయస్థానం ముందుంచి తెలంగాణకు తరలించడంలో సఫలీకృతమయ్యింది.
ఎంతకైనా తెగిస్తాడు..
సుబో«ధ్‌సింగ్ నేరాల్లో అధిక శాతం బిహార్, బెంగాల్‌లోనే ఉన్నాయి. తాను ఇప్పటివరకు దొంగిలించిన 400 కిలోల బంగారంలో అధిక శాతం బిహార్‌ను ఆనుకుని ఉన్న నేపాల్‌లో విక్రయించాడు. ఇతను తోటి ఖైదీలను అలాగే తన గ్యాంగ్‌కు సహకరిస్తారనుకున్న పోలీ సులు, జైలు అధికారులు, లాయర్లకు ఎంతైనా చెల్లిస్తాడు. లేనిపక్షంలో అవసరమనుకుంటే వారిపై దాడి చేయడం లేదా చంపేయడం ఇతని గ్యాంగ్‌కు అలవాటే. అందుకే పోలీసులు ఇతన్ని కరీంనగర్ జైల్లో ఉంచలేదు. సుబోధ్ సింగ్‌కు సంబంధించిన ఉదంతాన్ని తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో కేస్ స్టడీగా బోధించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.


