విచారణ చేస్తున్న జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సు«దీర
సంగారెడ్డి: వివాహమైన 14 ఏళ్ల తరువాత మొదటి కాన్పు కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చిన గర్భిణి ఫిట్స్‌తో మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. చౌటకూర్ మండలంలోని బద్రిగూడెం గ్రామానికి చెందిన బక్క అనిత(33) మూడు రోజుల క్రితం ప్రసవం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. బుధవారం ఉదయం సర్జరీ చేద్దామని డాక్టర్లు సిద్ధమయ్యేసరికి అనిత ఫిట్స్‌తో మరణించింది.
దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేశారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న బంధువులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కాగా వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంటి ప్రభు, దళిత నాయకుడు పల్లె సంజీవయ్య డిమాండ్ చేశారు. అనంతరం ఆస్పతి ఎదుట ధర్నా చేపట్టారు.
ఆస్పత్రిలో విచారణ..
ప్రసవానికి కొచి్చన గర్భిణి మరణించడంతో ఆసుపత్రిని ఎంసీహెచ్ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర బుధవారం సందర్శించారు. అనిత, ఆమె పాప మృతి చెందిన ఘటనపై ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను వైద్యులు, సిబ్బందిని , సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలి పారు. జిల్లా వైద్యాధికారి లలితాదేవి ,ఎంసీహెచ్ పోగ్రాం ఆఫీసర్ నాగనిర్మల, సిబ్బంది ఉన్నారు. కాగా మృతురాలి భర్త శ్రీశైలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.
సర్జరీకి వెళ్లే సరికే చేయిదాటి పోయింది
అనిత రెండు రోజుల క్రితం అడ్మిట్ అయింది. వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం సర్జరీకి సిద్ధం అయ్యేసరికి ఆమెకు ఫిట్స్ వచ్చి మృతి చెందింది.
– మురళి కృష్ణ, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్.


