చదువు అమెరికాలో.. ఉద్యోగం స్వదేశంలో | New regulations are hurting opportunities for Indians | Sakshi
Sakshi News home page

చదువు అమెరికాలో.. ఉద్యోగం స్వదేశంలో

Aug 13 2026 2:02 AM | Updated on Aug 13 2026 2:02 AM

New regulations are hurting opportunities for Indians

81 శాతం మంది విద్యార్థులు చదువు కాగానే భారత్‌కే.. అమెరికా వీసాఆంక్షల నేపథ్యంలో మారుతున్న ఆలోచనలు  

భారతీయుల అవకాశాలను దెబ్బతీస్తున్న కొత్త నిబంధనలు..

ప్రపంచ విద్యార్థుల వలసలపైఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలి. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ద్వారా ఒకట్రెండేళ్లు పని చేయాలి. ఆపై హెచ్‌–1బీ వీసా సాధించి అక్కడే స్థిరపడాలి. ఇదీ ఓ సగటు భారతీయ విద్యార్థి ఆలోచన. అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులపై గతంలో లేనంతగా అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్‌ నిబంధనలను కఠినతరం చేయడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ గ్లోబల్‌ మొబిలిటీ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం విదేశాల్లో చదువుకోవాలని యోచిస్తున్న భారతీయ విద్యార్థుల్లో 81 శాతం మంది చదువు పూర్తి కాగానే స్వదేశానికి వచ్చేయాలని భావిస్తున్నారు. 

ఈ నివేదిక ప్రకారం ప్రతీ ఐదుగురు భారతీయ విద్యార్థుల్లో నలుగురు తాము విదేశీ విద్యను కేవలం అంతర్జాతీయ అనుభవం, నైపుణ్యాల పెంపుదల, విదేశీ డిగ్రీని పొందే మార్గంగానే చూస్తున్నారు. అక్కడ శాశ్వతంగా స్థిరపడటానికి కాదని స్పష్టం చేశారు. కేవలం 15 శాతం మంది మాత్రమే చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుకుతామని చెప్పారు. అయితే వారు భారత్‌లోనా లేదా విదేశాల్లోనా అనేది స్పష్టం చేయలేదు.  

నాలుగేళ్ల పరిమితి 
2026 జూలైలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ దశాబ్దాల నాటి డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానాన్ని రద్దు చేస్తూ అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో ఉండే సమయాన్ని నాలుగేళ్లకే పరిమితం చేసింది. కోర్సులు మారడం, విద్యాసంస్థల బదిలీలపై కూడా ఆంక్షలు విధించింది. విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టి స్వదేశానికి తిరిగి వెళ్లేలా చూడటమే దీని ఉద్దేశం.

2026 మార్చిలో వన్‌–స్ట్రైక్‌ విధానం కింద రెండో విడత సెవిస్‌ రికార్డుల రద్దు జరిగింది. రికార్డు రద్దయితే విద్యార్థి చట్టపరమైన హోదా వెంటనే ముగుస్తుంది. చదువు తర్వాత పని చేసుకోవడానికి వీలు కల్పించే ఓపీటీ కార్యక్రమాన్ని కూడా రద్దు లేదా పరిమితం చేయడానికి అధికారులు యత్నిస్తున్నారు. 2025 జూన్, జూలైలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్‌–1 వీసాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69 శాతం తగ్గి 41,336 నుండి 12,776కి పడిపోయాయి. అలాగే 2026లో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 20 శాతం తగ్గుతుందని అంచనా.  ప్రస్తుతం అమెరికాలోచదువుతున్న భారతీయ విద్యార్థులు 3,72,000

నిబంధనలతో సవాళ్లు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులను ప్రభావితం చేసే అనేక కఠిన చర్యలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2025 మార్చిలో వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సెవిస్‌) రికార్డులను అకస్మాత్తుగా రద్దు చేశారు. ఇందుకు చిన్నపాటి ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు, గత రాజకీయ కార్యకలాపాలు వంటి అస్పష్టమైన కారణాలను చూపారు.

2025 జనవరి నాటికి స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ 8వేల కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను రద్దు చేసింది. 2025లో 4,730 సెవిస్‌ రికార్డులు రద్దయ్యాయి. కనీసం 6వేలు ఎఫ్, ఎమ్, జే వీసాలను వెనక్కి తీసుకున్నారు. 2025 మే 27న స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రపంచవ్యాప్తంగా ఎఫ్, ఎమ్, జే దరఖాస్తుదారుల కోసం కొత్త వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను అకస్మాత్తుగా నిలిపివేసింది. 

ఆంక్షల మీదఆంక్షలు
2025 జూన్‌లో ఇరాన్, లిబియా, సోమాలియా, అఫ్గానిస్తాన్, పాలస్తీనాతోపాటు 39 దేశాల పౌరులకు వీసాల జారీని నిలిపివేశారు. 2025 సెప్టెంబర్‌లో కొత్త హెచ్‌–1బీ పిటిషన్లపై లక్ష డాలర్ల రుసుము విధించారు. దీనిని వ్యతిరేకిస్తూ 20 రాష్ట్రాలు కోర్టుకు వెళ్లగా, యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఈ విధానాన్ని పాక్షికంగా మార్చింది. ఒక విశ్వవిద్యాలయం మొత్తం విద్యార్థుల జనాభాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 15 శాతానికి పరిమితం చేస్తూ కొత్త నిబంధన తెచ్చారు. ఇందులో ఏ ఒక్క దేశం వాటా కూడా 5 శాతం మించకూడదు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ పరిమితి వారి ప్రవేశాన్ని మరింత కష్టతరం చేస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement