నేనే ఏసీబీకి పట్టిస్తా! | Ponguleti Srinivasa Reddy fires on sub-registrars | Sakshi
Sakshi News home page

నేనే ఏసీబీకి పట్టిస్తా!

Aug 13 2026 1:55 AM | Updated on Aug 13 2026 1:55 AM

Ponguleti Srinivasa Reddy fires on sub-registrars

కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి పొంగులేటి

ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదు 

సబ్‌ రిజిస్ట్రార్లపై మంత్రి పొంగులేటి ఫైర్‌ 

ఆస్తులపై హక్కుదారుల్లా వ్యవహరించొద్దు..  

కోర్టుల ఆదేశాలపై మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవద్దు 

22ఏ జాబితా భూములు, ఆస్తులపై సమీక్షలో ఘాటుగా హెచ్చరికలు

సాక్షి, హైదరాబాద్‌: ‘సబ్‌ రిజిస్ట్రార్లు మారాలి. లేదంటే నేనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిస్తా. ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఏసీబీ దాడులు జరు గుతూనే ఉన్నాయి. అయినా మీరు మారట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు కనిపించడం లేదు..’అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 22ఏ (నిషేధిత) జాబితాలో ఉన్న భూములు, ఆస్తులపై సచివాలయంలో సమీక్ష సందర్భంగా సబ్‌ రిజిస్ట్రార్ల వ్యవహారశైలిని ప్రస్తావించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీతో పాటు నాలుగు జిల్లాల రిజిస్ట్రార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘సబ్‌ రిజిస్ట్రార్లు స్టాంపులు వేసే అధికారులు మాత్రమే. ప్రజల భూములు, ఆస్తులను ధ్రువీకరించేందుకు మాత్రమే ఆ అధికారాలుంటాయి తప్ప ఆ ఆస్తులు సబ్‌ రిజిస్ట్రార్లవి అయినట్టు వ్యవహరించకూడదు. పేదలు రిజిస్ట్రేషన్ల కోసం వస్తే కనీసం వారి ముఖం చూడకుండా మాట్లాడతారు. ఒకవేళ ప్రజల దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే కనీసం తగిన సమాధానం కూడా చెప్పరు. కావాల్సిన వాళ్లను మాత్రం కూర్చోబెట్టి మరీ ఏం చేయాలో సలహాలు ఇచ్చి పంపుతారు..’అని అన్నట్టు సమాచారం. 

అడ్డగోలు రిజిస్ట్రేషన్లు మానుకోవాలి 
‘కోర్టులకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడం, కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపెట్టి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేయడం మానుకోవాలి. కోర్టు ఉత్తర్వులు గౌరవించాల్సిందే కానీ, నిజంగా ఆ ఉత్తర్వులు వచ్చిన భూమి లేదా ఆస్తి ప్రభుత్వానికి చెందినదే అయితే అది ప్రభుత్వానికే దఖలు పడేలా ఏం చేయాలన్నదాని గురించి ఆలోచించాలి. అంతేతప్ప వెంటనే సబ్‌ రిజిస్ట్రార్లు నిర్ణయం తీసుకోవద్దు. జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా ఐజీతో మాట్లాడాలి. ప్రభుత్వానికి చెందిన భూమే అయితే దాన్ని ఖచ్చితంగా కాపాడాల్సిందే. అసలు కోర్టు ఉత్తర్వులపై సబ్‌ రిజిస్ట్రార్లు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు.’అని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. ఇకనైనా సబ్‌ రిజిస్ట్రార్లు మారాలని, లేదంటే ఏం చేయాలో అది చేస్తానని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.  

కలెక్టర్లకు హితబోధ 
మరోవైపు కొత్తగా వస్తున్న నిషేధిత జాబితా సమస్యల విషయంలో కలెక్టర్ల కర్తవ్యంపై పొంగులేటి హితబోధ చేశారని తెలుస్తోంది. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం కాదని, అసలు సమస్య రాకుండా చూసుకోవాలంటూ నిషేధిత జాబితా భూముల వివరాల నమోదులో కలెక్టర్ల నిర్లక్ష్యాన్ని కూడా మంత్రి ఎత్తిచూపినట్టు సమాచారం. కాగా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను ఉద్దేశించి అదే శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement