వేధింపులే కారణమంటూ ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
నాగోలు(హైదరాబాద్): ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ ఏసీపీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అజ్జిన తండాకు చెందిన జర్పుల విజయ–బోధ్య దంపతుల చిన్న కుమారుడు సాయికుమార్ (25) 2024 నవంబర్‌లో ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. జనరల్ డ్యూటీ చేస్తూ బీఎన్‌రెడ్డినగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇతనికి కంప్యూటర్‌పై అవగాహన ఉండడంతో స్టేషన్ రైటర్స్ ఈ–కాప్స్ డ్యూటీ చెప్పేవారు. గత నెల నుంచి ఎల్‌బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
సాయికుమార్ ఎస్‌ఐ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. మంగళవారం రాత్రి 1:30 ఎల్‌బీనగర్ డీసీపీ కార్యాలయ సిబ్బంది డీఎస్‌ఆర్‌కు సంబంధించి వివరాల కోసం ఎల్‌బీనగర్ ఏసీపీ కార్యాలయానికి ఫోన్ చేశారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఎల్‌బీనగర్ ఠాణాలోని సెక్షన్ ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్‌కు సమాచారం ఇచ్చారు. రాత్రి 2:30 సమయంలో వేణుగోపాల్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించగా అక్కడ ఉన్న రెస్ట్ రూమ్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ సాయికుమార్ కనిపించాడు.
పోలీసులు వెంటనే కామినేని హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్ సూసైడ్ నోట్ రాసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ లేఖను బయట పెట్టేందుకు పోలీసులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.
ఏసీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం
సాయికుమార్ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎల్‌బీనగర్ ఏసీపీ కార్యాలయంలోకి వెళ్లి సిస్టమ్, ప్రింటర్, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సాయికుమార్ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు, స్టేషన్‌లో ఉన్న ఇద్దరు రైటర్ల వేధింపులు తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని , దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీసీపీ అనురాధ మాట్లాడుతూ సాయికుమార్ ఆత్మహత్యపై పూర్తి విచారణ చేస్తామని చెప్పారు. సాయికుమార్ కుటుంబ సభ్యులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. రూ.22 లక్షల పరిహారం ఇస్తామని, తక్షణ సాయం కింద రూ. 10 లక్షలు అందజేస్తామన్నారు.


