రాష్ట్రంలోని విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లోని నగరాల పేర్లతో మెసేజ్‌లు
సాంకేతిక లోపంతో తప్పు సమాచారం వెళ్లిందన్న ఎన్‌బీఈఎంఎస్
సాక్షి, హైదరాబాద్: నీట్ పీజీ–2026 పరీక్ష రాసే వైద్య విద్యార్థులను జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల బోర్డు (ఎన్‌బీఈఎంఎస్) సాంకేతిక సమస్య గందరగోళానికి గురిచేసింది. ఆగస్టు 11న పరీక్ష కేంద్రం వివరాలను అభ్యర్థులకు తెలియజేయగా.. తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లోని నగరాల పేర్లతో ఎస్‌ఎంఎస్‌లు, ఈ–మెయిల్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే అధికారిక పోర్టల్‌లో అభ్యర్థి ఖాతాలోకి వెళ్లి పరిశీలించగా తెలంగాణలోనే పరీక్ష నగరం కేటాయించినట్టు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 11న పరీక్ష రాసే ‘నగరం’వివరాలను తెలియజేయాలని ఎన్‌బీఈఎంఎస్ ముందుగానే ప్రకటించింది. అందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి పలువురికి ఎస్‌ఎంఎస్‌లు, ఈ–మెయిల్ వెళ్లాయి. తెలంగాణలో ఉండి, దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకున్న రాష్ట్రాలకు సంబంధం లేని నగరాల పేర్లు రావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. కొందరికి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నగరాల పేర్లు వచ్చినట్లు అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
హాల్‌టికెట్ వచ్చేది 27న
ప్రస్తుతం విడుదల చేసింది కేవలం పరీక్ష రాసే నగరం సమాచారం మాత్రమే. ఇది హాల్‌టికెట్ కాదు. అసలు పరీక్ష కేంద్రం పూర్తి చిరునామా, ఇతర వివరాలతో కూడిన అడ్మిట్ కార్డులను ఆగస్టు 27న విడుదల చేయనున్నట్టు ఎన్‌బీఈఎంఎస్ షెడ్యూల్‌లో పేర్కొంది. నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 30న కంప్యూటర్ ఆధారిత విధానంలో ఒకే రోజున నిర్వహించనున్నారు.
నీట్ పీజీ సిటీ స్లిప్ విడుదల
నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పరీక్ష నగర సమాచార స్లిప్ (సిటీ ఇంటిమేషన్ స్లిప్)ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) బుధవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ natboard. edu.inలో తమకు కేటాయించిన పరీక్ష నగరాన్ని తెలుసుకోవచ్చు.
పోర్టల్‌లో సరైన సమాచారం.. అనంతరం మరో ఎస్‌ఎంఎస్
ఎస్‌ఎంఎస్‌లు వచ్చిన తర్వాత అభ్యర్థులు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎన్‌బీఈఎంఎస్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి తమ వివరాలను పరిశీలించారు. అక్కడ మాత్రం తాము నివసిస్తున్న రాష్ట్రంలోనే పరీక్ష నగరం కేటాయించినట్టు పలువురికి కనిపించింది. ఈ గందరగోళంపై ఎన్‌బీఈఎంఎస్ బుధవారం వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా కొందరు అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తప్పుడు ‘పరీక్ష నగరం’సమాచారం వెళ్లిందని తెలిపింది.


