సాక్షి,హైదరాబాద్: దేశ భద్రతకు భంగం కలిగించే అవాంఛనీయ కార్యకలాపాలకు నిరోధించేలా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కీలక చర్యలు చేపట్టింది. ఈ రోజు (బుధవారం) ఉగాండా దేశానికి చెందిన నబంజ శారన్ అనే మహిళను అదుపులోకి తీసుకుంది. ఆ విదేశీయురాలిపై విచారణ జరుపగా, ఆమె వీసా గడువు ఇదివరకే ముగిసిందని అయినప్పటికీ భారతదేశంలో అక్రమంగా నివసిస్తుందని పోలీసులు తెలిపారు. ఈవిషయం సదరు మహిళ సైతం ధృవీకరించినట్లు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే..టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నబంజ శారన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో హైదరాబాద్‌లో తన నివాసానికి సంబంధించి ఆమె ఎలాంటి సంతృప్తికరమైన సమాధానాలు గానీ, సరైన పత్రాలు గానీ సమర్పించలేకపోయింది. సమగ్ర విచారణ అనంతరం, తన వద్ద చెల్లుబాటు అయ్యే వీసా లేదని, వీసా గడువు ముగిసినప్పటికీ భారతదేశంలో అక్రమంగా కొనసాగుతున్నానని ఆమె అంగీకరించింది.
మరింత లోతుగా దర్యాప్తు చేయగా, ఆమె 06-03-2019న ఈ-టూరిస్ట్ వీసాపై ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా భారతదేశానికి వచ్చినట్లు వెల్లడైంది. అనంతరం ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వెళ్లి, అక్కడ చిన్నచిన్న పనులు చేసింది. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మాదకద్రవ్యాల ముఠాలతో పరిచయాలు ఏర్పరచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు, హైదరాబాద్‌లలో డ్రగ్ పెడ్లర్లతో కలిసి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది.
ఆమె టూరిస్ట్ వీసా గడువు 04-05-2019 నాటికే ముగిసింది; అయితే ఆమె పాస్‌పోర్ట్ 23-11-2027 వరకు చెల్లుబాటులో ఉంది. వీసా గడువు ముగిసినప్పటి నుండి ఆమె భారతదేశంలో అక్రమంగా నివసిస్తూ, డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఆమెను స్వదేశమైన ఉగాండాకు పంపించేందుకు H-NEW విభాగం హైదరాబాద్‌లోని ఎఫ్.ఆర్.ఆర్.ఓ (FRRO) ద్వారా బహిష్కరణ (డీపోర్టేషన్) ప్రక్రియను ప్రారంభించింది.
బయోమెట్రిక్ వివరాలను పరిశీలించి, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ టూరిస్ట్ వీసా గడువు ముగిసినట్లు నిర్ధారించారు. అనంతరం హైదరాబాద్ FRRO నుండి ఎగ్జిట్ పర్మిట్ పొంది, భవిష్యత్తులో ఆమె భారతదేశంలోకి ప్రవేశించకుండా 'బ్లాక్‌లిస్ట్' చేశారు. ఆమె ప్రయాణానికి సంబంధించి ఈ రోజు (12-08-2026) తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమాన టికెట్ బుక్ చేశారు.
ఇటీవలి కాలంలో కొందరు విదేశీయులు మెడికల్ వీసా, స్టూడెంట్ వీసా, బిజినెస్ వీసా, టూరిస్ట్ వీసాలపై భారతదేశానికి వస్తున్నారు. పాస్‌పోర్ట్, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఇక్కడే ఉంటూ వివిధ రకాల మత్తుపదార్థాల రవాణా, సరఫరా, విక్రయాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని ఫలితంగా సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, వ్యసనం పెరిగి కుటుంబాలు, సమాజం తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాయి.
హైదరాబాద్ నగర ప్రజలు ఎవరూ కూడా మత్తుపదార్థాల బారిన పడవద్దని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) విజ్ఞప్తి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచి, వారు మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా H-NEW బృందానికి 8712661601 నంబరు ద్వారా తెలియజేయగలరని పోలీసు విభాగం పేర్కొంది.ఈ ఆపరేషన్‌లో ఇన్‌స్పెక్టర్ పి. శ్రీధర్, ఇన్‌స్పెక్టర్ ఎం. మధు బాబు తదితరులు పాల్గొన్నారు.


